Mala Shri: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సీనియర్ హీరోయిన్ మాలాశ్రీ కుమార్తె రాధనా రామ్ (Radhana Ram) ..!
ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో కథానాయికగా తనదైన ముద్ర వేసి, ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు కన్నడ సీనియర్ నటి మాలాశ్రీ (Mala Shri). తెలుగులోనూ ప్రేమఖైదీ, బావ బావమరిది వంటి హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.
తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాల్లోనూ నటించిన మాలాశ్రీ తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. లేడీ ఓరియెంటెండ్ చిత్రాలతోనూ మెప్పించారు.
దాదాపు అన్ని దక్షిణాది భాషల్లో నటించి అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు ఈ మాజీ హీరోయిన్. కరోనా సమయంలో ఆమె తన భర్తను కోల్పోయారు.
కాగా, ప్రస్తుతం మాలాశ్రీ తన కుమార్తె రాధనా రామ్ (Radhana Ram) ను వెండితెరకు పరిచయం చేస్తున్నారు. కన్నడ 'ఛాలెంజింగ్ స్టార్' దర్శన్ హీరోగా 'D56' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో ఆమె నటించనుంది.
బెంగళూరులోని శ్రీ రవిశంకర్ గురూజీ ఆశ్రమంలో ప్రస్తుతం చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. తొలి షాట్‌కు శ్రీ రవిశంకర్ గురూజీ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఈ చిత్రాన్ని రాక్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై (Rockline Productions) ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'రాబర్ట్' ఫేమ్ తరుణ్ సుధీర రచన, దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా మాలాశ్రీ (Malashree) మాట్లాడుతూ.. ‘నా సినిమాతోనే రాక్ లైన్ వెంకటేశ్ నిర్మాతగా అడుగుపెట్టారు. ఇప్పుడు నా కుమార్తె తొలి చిత్రానికి కూడా ఆయనే నిర్మాత కావడం ఆనందంగా ఉంది. రాధనాకి నటన అంటే చాలా ఇష్టం. ముంబయిలో డాన్స్ కూడా నేర్చుకుంది’ అన్నారు.
'రాధనా గత కొన్నేళ్లుగా చాలా కష్టపడి పనిచేస్తుంది. తను నా కూతురిగానే కాకుండా, తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకోవాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. కాగా, ఇదో యాక్షన్ కథా చిత్రమని.. చక్కని సందేశం కూడా ఉంటుందని దర్శకుడు తెలిపారు.