నాకో హిట్ సినిమా కావాలంటున్న ఆకాష్ పూరీ (AkashPuri).. అందుకు ప్రయత్నమే ‘చోర్‌బజార్’ సినిమా !
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆకాష్ పూరీ (AkashPuri).. హీరోగా నిలదొక్కుకోవడానికి తనవంతుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు చేసిన ఆకాష్ యాక్టింగ్‌కు మంచి పేరు దక్కిందే తప్ప, కమర్షియల్ హిట్ మాత్రం రాలేదు.
తాజాగా ఆకాష్ హీరోగా చేసిన సినిమా ‘చోర్ బజార్’. జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చోర్ బజార్ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడాడు ఆకాష్. తను పంచుకున్న విశేషాలు పింక్ విల్లా వ్యూయర్స్ కోసం..
ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో పూర్తి భిన్నమైన కథతో తెరకెక్కిన సినిమా ‘చోర్ బజార్’. 'అన్ని కమర్షియల్ అంశాలనూ కవర్ చేస్తూనే హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు జీవన్‌రెడ్డి. ఈ సినిమాలో బచ్చన్ సాబ్ అనే క్యారెక్టర్ చేశాను. నా క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. అందుకే కథ వినగానే ఓకే చేశాను ' అని ఆకాష్ తెలిపాడు.
'చోర్ బజార్ ఏరియా పేరు వినగానే అక్కడ ఉన్న వాళ్లు దొంగతనాలు చేస్తుంటారని అనుకుంటాం. కానీ, దగ్గరగా చూస్తే వాళ్ల జీవితాలు వేరుగా ఉంటాయి. అక్కడి మనుషులు, కుటుంబాలు, వాళ్ల కష్టాలను సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం.
ఈ సినిమాలో నేనొక టైర్ల దొంగగా కనిపిస్తాను. కారు కనిపిస్తే చాలు నిమిషాల్లో టైర్లు మాయం చేసేస్తాను. ఈ పనిలో రికార్డులు క్రియేట్ చేస్తుంటాను. అయితే ఆ డబ్బులతో చోర్ బజార్‌లోని పేద వాళ్లకు సాయం చేస్తుంటాను. అందుకే అక్కడి వాళ్లకు నేనే హీరో. దర్శకుడు జీవన్ తన చిత్రాల్లో హీరోయిజాన్ని బాగా చూపించారు ' అంటూ ఆకాష్ సినిమా పై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
కొత్త ఇమేజ్ వస్తుందని అనుకుంటున్నా..
'చోర్ బజార్ సినిమాతో నాకు కొత్త ఇమేజ్ వస్తుందని అనుకుంటున్నాను. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు స్టైలిష్‌గా ఉంటాయి. క్లైమాక్స్ బాగుంటుంది. ఈ సినిమాలో వజ్రం అనేది ఒక క్యారెక్టర్‌గా కనిపిస్తుంది. దాని చుట్టూ జరిగే డ్రామా చాలా చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది.
ఈ సినిమాలో సీనియర్ నటి అర్చన గారితో కలిసి పనిచేశాను. అందుకు సంతోషంగా ఉంది. నా క్యారెక్టర్‌కు బచ్చన్ సాబ్ అని పేరు పెట్టేది ఆమే. ఇక, హీరోయిన్ మూగ అమ్మాయిగా కనిపిస్తుంది. తనకి మాటలు రాకపోయినా.. సినిమా డైలాగులను స్పీకర్‌లో పెట్టి సమాధానం చెబుతుంది. పాటలు, ట్రైలర్ చూసిన తర్వాత నాన్న పూరి జగన్నాథ్.. సినిమా బాగుందిరా.. గ్రాండ్‌గా కనిపిస్తోందని చెప్పారు.
ఒక్క రోజులో అయ్యేది కాదు..
‘రొమాంటిక్’ సినిమా ఈవెంట్‌లో హీరోగా నిలదొక్కుకుంటానని చెప్పాను. అదంతా ఒక్క సినిమాతో జరిగేది కాదు. నా సినిమాల విషయంలో నాన్న ఎప్పుడూ కలగజేసుకోరు. ‘నీ సినిమాల నిర్ణయాలు నువ్వే తీసుకో.. ధైర్యంగా ముందుకెళ్లు’ అని చెప్తుంటారు. నేను చేసిన సినిమాలు చూసిన వాళ్లు వయసుకు మించిన పాత్రలు చేశానని చెప్పారు. ఇక నుంచి అందరికీ నచ్చే సినిమాలే చేయాలని అనుకుంటున్నాను. సినిమాలే నా ఫస్ట్ ప్రయారిటీ. ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్‌లు నా దగ్గర ఉన్నాయి. ఒకటి కామెడీ ఎంటర్‌టైనర్, మరొకటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా అని ఆకాష్ పూరీ (AkashPuri) చెప్పాడు.
Read More : Kiara Advani: చావు అంచుల వరకు వెళ్లా.. హారర్ సినిమాలంటే భయం అంటున్న కియారా ఆడ్వాణీ