Shekar Movie :శేఖ‌ర్ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన కోర్టు.. ఇక నిర్మాత‌ల‌దే నిర్ణ‌య‌మ‌న్న రాజ‌శేఖ‌ర్‌

Updated on May 24, 2022 10:57 AM IST
 Shekar Movie :శేఖ‌ర్  సినిమాపై వాద‌న‌లు విన్న జ‌డ్జి స్టే ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Shekar Movie :శేఖ‌ర్ సినిమాపై వాద‌న‌లు విన్న జ‌డ్జి స్టే ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Shekar Movie :రాజ‌శేఖ‌ర్ న‌టించిన శేఖ‌ర్ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు అడ్డంకులు తొలిగాయి. శేఖ‌ర్ సినిమాపై విధించిన‌ స్టే ఉత్త‌ర్వులను కోర్టు ర‌ద్దు చేసింది. త‌న సినిమాకు ఆటంకాలు తొల‌గ‌డంపై రాజ‌శేఖ‌ర్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఇక శేఖ‌ర్ సినిమా భ‌విష్య‌త్తును నిర్మాత‌లే నిర్ణ‌యిస్తారంటూ ట్వీట్ చేశారు.

యాంగ్రీ స్టార్ రాజ‌శేఖ‌ర్(Rajasekhar) న‌టించిన శేఖ‌ర్ సినిమా రిలీజ్‌కు ముందు నుంచి వివాదాలు మొద‌ల‌య్యాయి. శేఖ‌ర్ సినిమాను రాజ‌శేఖ‌ర్ భార్య జీవితా రాజ‌శేఖ‌ర్ డైరెక్ట్ చేశారు. అయితే జీవితా రాజ‌శేఖ‌ర్ తన ద‌గ్గ‌ర డ‌బ్బు తీసుకుని తిరిగి ఇవ్వ‌లేదంటూ ఫైనాన్షియర్ పరంధామరెడ్డి కోర్టులో పిటిష‌న్ వేశారు. త‌మ‌కు డ‌బ్బు చెల్లించేలా కోర్టు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. మే 20న శేఖ‌ర్ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన రెండు రోజుల్లో కోర్టు ఈ సినిమాపై స్టే విధించింది. 

 

శేఖ‌ర్ సినిమాపై కోర్టు విధించిన స్టే పై హీరో రాజ‌శేఖ‌ర్ ట్విట్ట‌ర్‌లో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు. తన సినిమా శేఖ‌ర్ థియేట‌ర్ల‌లో ఆడేందుకు అన్ని హ‌క్కులు ఉన్నాయ‌న్నారు. త‌మ‌ను న‌ష్ట‌ప‌ర‌చాల‌నే కొంద‌రు ఇలా చేశార‌న్నారు. త‌మ ఆశ‌ల‌న్నీ శేఖ‌ర్ సినిమాపై పెట్టుకున్న‌మంటూ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. శేఖ‌ర్ సినిమా ఆగిపోవ‌డంతో త‌మ‌కు చాలా న‌ష్టం జ‌రుగుతుందంటూ జీవితా రాజ‌శేఖ‌ర్ కోర్టును ఆశ్ర‌యించారు. శేఖ‌ర్ సినిమాపై ఉన్న స్టేను ఎత్తివేయాల‌ని కోరారు. 

శేఖ‌ర్ సినిమా ప్ర‌ద‌ర్శించుకోవ‌చ్చ‌ని ఫైనాన్షియ‌ర్ ప‌రంధామ రెడ్డి త‌రఫున వాదిస్తున్న లాయ‌ర్ కోర్టుకు తెలిపారు. కానీ త‌మ‌కు సినిమాకు వ‌చ్చే క‌లెక్ష‌న్‌లో ఇవ్వాల్సిన డ‌బ్బును డిపాజిట్ చేయాల‌ని జ‌డ్జిని కోరారు. ప‌రాంధామ రెడ్డి కోరిన‌ట్టే ఇచ్చిన డ‌బ్బును తిరిగి ఇస్తామ‌ని జీవితా రాజ‌శేఖ‌ర్ త‌ర‌ఫు లాయ‌ర్లు  తెలిపారు. సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి వచ్చే డబ్బుని డిపాజిట్ చేస్తామని చెప్పారు. శేఖ‌ర్ సినిమాపై వాద‌న‌లు విన్న జ‌డ్జి అంత‌కు ముందు విధించిన స్టేను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

 Shekar Movie :శేఖ‌ర్  సినిమాపై వాద‌న‌లు విన్న జ‌డ్జి స్టే ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

శేఖ‌ర్ సినిమాకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న ప్రేక్ష‌కులకు ధ‌న్య‌వాదాలంటూ రాజ‌శేఖ‌ర్ (Rajasekhar) ట్వీట్ చేశారు. త‌న సినిమాకు విధించిన స్టే ఉత్త‌ర్వులు ఆపేయాలని కోర్టు తెలిపింది. కానీ శేఖ‌ర్ సినిమా వీకెండ్ల‌లో థియేట‌ర్ల‌లో ఆడ‌క‌పోవ‌డం వ‌ల్ల తాము చాలా న‌ష్ట‌పోయామ‌న్నారు, కొంద‌రు కుట్ర‌ల‌తో ఈ సినిమాను అడ్డుకోవాల‌ని చూశారు. శేఖ‌ర్ సినిమా ప్ర‌జ‌లు ఆద‌రిస్తార‌ని త‌న‌కు తెలుస‌న్నారు. భవిష్యత్‌లో శేఖ‌ర్ చిత్ర‌ ప్రదర్శనపై నిర్మాత‌లు నిర్ణ‌యం తీసుకుంటార‌ని.. అందుకు తాము మ‌ద్ద‌తుగా నిలుస్తామ‌ని తెలిపారు రాజ‌శేఖ‌ర్.
  
శేఖ‌ర్ సినిమా (Shekar Movie)లో రాజ‌శేఖ‌ర్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా క‌నిపించారు. రాజ‌శేఖ‌ర్ కూతురు శివాని రాజ‌శేఖ‌ర్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. యాక్ష‌న్, థ్రిల్ల‌ర్ సినిమాలో హీరోయిన్లుగా అను సితార, ముస్కాన్ ఖుబ్‌చందానీలు యాక్ట్ చేశారు. ఈ సినిమాకు జీవితా రాజ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రాజ‌శేఖ‌ర్ కూతుళ్లు శివానీ, శివాత్మికలు ప్రొడ్యూస‌ర్లుగా శేఖ‌ర్ సినిమాను నిర్మించారు. రిలీజ్ త‌ర్వాత కోర్టు స్టేల‌తో నిరాశ ప‌రిచిన శేఖ‌ర్ సినిమా.. మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో ఎలాంటి వ‌సూళ్లు సాధిస్తుందో చూడాలి. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!