EXCLUSIVE: "నటనలో సెంచరీలు ఉండాలే కానీ.. బౌండరీలు ఎందుకు ?" : రాజ్ తరుణ్ (Raj Tarun)

Updated on Nov 07, 2022 08:22 PM IST
నా అభిమానులకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు -  'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ ఈవెంట్ లో  రాజ్ తరుణ్  (Raj Tarun)
నా అభిమానులకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు - 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ ఈవెంట్ లో రాజ్ తరుణ్ (Raj Tarun)

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) 'ఉయ్యాల జంపాల' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. పక్కింటి కుర్రాడిలా కనిపించే పాత్రలలో నటిస్తూ, యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో సినిమాలతో పాటు, ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు. 

'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్‌తో సరికొత్తగా వినోదం పంచేందుకు రెడీ అవుతున్న రాజ్ తరుణ్‌తో పింక్‌విల్లా ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ !

రాజ్ తరుణ్ (Raj Tarun)

హలో రాజ్ తరుణ్! హీరోగా అనేక చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్‌తో వినోదం పంచేందుకు సిద్ధమయ్యారు. ఈ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు మీ అనుభవాల గురించి చెప్పండి?

'అహ నా పెళ్ళంట' చాలా వైవిధ్యమైన సబ్జెక్టు.  ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది ఎపిసోడ్లతో ప్రేక్షకుల ముందుకు రానుంది. జీ 5లో నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సిరీస్‌ను కచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను అనుకున్న దానికంటే, ఈ సిరీస్ చాలా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులకు కూడా ఈ సిరీస్ చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను.
 
'అహ నా పెళ్ళంట'లో మీ పాత్ర గురించి చెప్పండి?

నా క్యారెక్టర్ ఓ పక్కింటి కుర్రాడిలా ఉంటుంది. అలాగే చాలా సరదాగా ఉంటుంది. టీనేజ్ వయసులో ఉండే ఫ్రస్టేషన్‌ను దర్శకుడు ఈ కథలో చాలా కొత్తగా చూపించారు. నా ఫ్రస్టేషన్ నుంచి వచ్చిన కంటెంట్‌తోనే ఈ సిరీస్ పూర్తిగా సాగుతుంది. ఈ సిరీస్‌లోని కన్ఫూజన్ కామెడీ కూడా నా పాత్రకు ప్లస్ కానుంది. 

హీరోయిన్ శివాని రాజశేఖర్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది?

శివాని రాజశేఖర్ నాకు మంచి స్నేహితురాలు. ఆమె, నేను ఎప్పటినుంచో కలిసి నటించాలని అనుకునేవాళ్లం.'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్‌లో తనతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. శివాని చాలా మంచి నటి.

 

'అహ నా పెళ్ళంట'లో ఆమని, హర్ష లాంటి నటులతో కలిసి యాక్ట్ చేయడంతో ఎలా ఫీల్ అయ్యారు?

'అహ నా పెళ్ళంట'లో చాలా మందితో కలిసి వర్క్ చేశాం. మీరు నమ్ముతారో లేదో కానీ.. షార్ట్ షార్ట్‌కి తేడా కూడా తెలియలేదు. సీనియర్ నటులతో నటించడం ఆనందంగా ఉంది. వారి నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం. అలాగే మా తరం నటులతో కూడా కలిసి నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. 

సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తున్నారు. కారణం ఏమిటి?

సినిమా అంటే దాదాపు ఓ రెండు గంటల పాటు, కథ మనతోనే ప్రయాణిస్తుంది. కానీ సిరీస్ అలా కాదు. ఒక కథను పరిమిత వ్యవధిలోనే చెప్పడం కుదరదు. అందుకే, చాలా టైమ్  తీసుకుంటుంది. అలాగే ఎపిసోడ్ల సంఖ్య కూడా పెరుగుతుంది. దర్శకుడు సంజీవ్ రెడ్డి 'అహ నా పెళ్ళంట' కథను చాలా అద్భుతంగా రాశారు. ఈ సిరీస్ చేస్తుంటే, సినిమాలో నటిస్తున్న ఫీలింగే కలిగింది. సినిమాకు, సిరీస్‌కు పెద్ద తేడా ఏమీ కనిపించలేదు. 

'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ నుండి ప్రేక్షకులు ఏం ఆశించవచ్చో చెబుతారా? 

'అహ నా పెళ్ళంట' చాలా డిఫరెంట్ సబ్జెక్టు. అంతేకాదు అన్ని ఎపిసోడ్‌లలో నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది. ప్రేక్షకులకు మంచి హాస్యాన్ని అందివ్వడానికి మేం చాలా ప్రయత్నించాం. కామెడీ జోనర్‌లో  'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ చాలా బెస్ట్. ఈ వెబ్ సిరీస్‌లో అన్ని ఎపిసోడ్లు ఒకేసారి రిలీజ్ కానున్నాయి.

నేను ఇప్పటికి చాలా కామెడీ సినిమాలు చేశాను. కానీ ఇలాంటి సబ్జెక్టు వినడం మాత్రం ఇదే మొదటిసారి. పైగా నటించేటప్పుడు చాలా చాలా ఎంజాయ్ చేశాం. తమ నటనతో ఇతరులను నవ్వించడం అనేది చాలా గొప్ప విషయమని నేను అనుకుంటాను.

మీ తదుపరి ప్రాజెక్టుల గురించి చెబుతారా?
నేను ఇటీవలే కొన్ని కొత్త ప్రాజెక్టులకు సైన్ చేశాను. అయితే అవి సినిమాలా, వెబ్ సిరీస్‌లా అనేది సస్పెన్స్. త్వరలో ఆయా ప్రాజెక్టుల వివరాలు నిర్మాతలే ప్రకటిస్తారు. 
 
రాజ్ తరుణ్ (Raj Tarun) లవర్ బాయ్‌గా కాకుండా, సీరియస్ రోల్స్‌లో కూడా నటించే అవకాశం ఉందంటారా?

రామాయణం, మహాభారతం లాంటి ఎపిక్స్‌తో పాటు.. కామెడీ బుక్స్ కూడా చదువుతూ పెరిగాను. నాకు హీరో పాత్రలతో పాటు నెగిటివ్ పాత్రల్లోనూ నటించాలని ఉంటుంది. విలన్ పాత్రల్లో కూడా నటించడం నా డ్రీమ్. అన్ని కుదిరితే ఎప్పటికైనా అలాంటి పాత్ర ఒకటి తప్పకుండా చేస్తాను. 

ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. మీరు కూడా మల్టీస్టారర్ సినిమాలలో నటించే అవకాశం ఉందా?

మల్టీస్టారర్ సినిమాలలో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను. ఫలానా క్యారెక్టరే చేయాలి? ఫలానా వాళ్లతోనే నటించాలనే బౌండరీలు నేను ఏమీ పెట్టుకోలేదు. అవకాశం రావాలే గానీ, ఎవరితోనైనా కలిసి నటిస్తాను. అయితే తొలుత నాకు కథ నచ్చాలి. 

మీరు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తీశారు. భవిష్యత్తులో సినిమా డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉందా?

నాకు దర్శకుడిగా సినిమాలు తీయాలనే ఆశ ఉంది. దర్శకుడిగా సినిమా తీయాలంటే, ఒక్కో సినిమాకు రెండేళ్ల సమయం పడుతుంది. ప్రస్తుతం హీరోగా కొనసాగుతున్నాను కాబట్టి.. దర్శకత్వం గురించి ఆలోచించడం లేదు. భవిష్యత్తులో తప్పకుండా ఓ సినిమాను డైరెక్ట్ చేస్తాను.

మీ అభిమానులకు ఏం చెబుతారు?
నా అభిమానులకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు.  నా ఫ్యాన్స్‌కు ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుందనే ఆశిస్తున్నాను.

Read More: EXCLUSIVE: అమ్మా, నాన్నలతో తప్పకుండా ఓ సినిమా తీస్తా.. వచ్చే ఏడాది మిస్ ఇండియా పోటీలకు వెళతా : శివాని రాజశేఖర్ (Shivani Rajashekar)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!