'పాన్ ఇండియా'పై హీరో సిద్దార్థ్ (Siddharth) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

Updated on May 22, 2022 04:22 PM IST
హీరో సిద్దార్థ్, కేజీఎఫ్ 2 పోస్ట‌ర్ (Hero Siddharth, KGF2 Poster)
హీరో సిద్దార్థ్, కేజీఎఫ్ 2 పోస్ట‌ర్ (Hero Siddharth, KGF2 Poster)

కోలీవుడ్ ఇండ‌స్ట్రీకి 'బాయ్స్' సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆపై స్టార్ హీరోగా ఎదిగాడు హీరో సిద్దార్థ్ (Siddharth). అనతికాలంలోనే మంచి ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకున్నాడు ఈ యువ హీరో. ఇక‌, 'బొమ్మ‌రిల్లు' హి‌‌ట్ తర్వాత.  సిద్దార్ధ్ తెలుగింటి కుర్రాడైపోయాడు. ఇక‌, అప్పటి నుంచి వ‌రుస‌ సినిమాలు చేస్తూ, తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు.

అయితే ఆ త‌ర్వాత ఆయ‌న‌ చేసిన కొన్ని ప్ర‌య‌త్నాలు బెడిసి కొట్ట‌డంతో. ఆ ప్రభావం మార్కెట్ పై ప‌డింది. దీంతో సిద్దార్థ్ పూర్తిగా కోలీవుడ్ చిత్రాలకు ప‌రిమిత‌మ‌య్యాడు.

ఈ మ‌ధ్య‌నే 'మ‌హా స‌ముద్రం' అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ (Tollywood) కు కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాపై ఆయ‌న‌ ఎన్నో ఆశ‌లు సైతం పెట్టుకున్నాడు. కానీ ఆ సినిమా ఫ‌లితం నిరాశ‌ప‌రిచింది. 'స‌మ్ థింగ్ స‌మ్ థింగ్' సినిమా త‌ర్వాత. సిద్దు పూర్తిగా టాలీవుడ్‌కి దూర‌మైన సంగతి తెలిసిందే. ఆ చిత్రం తర్వాత,  మ‌ళ్లీ 'మ‌హాస‌ముద్రం'తోనే రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇదే క్రమంలో, మ‌ధ్య‌లో కొన్ని హిందీ సినిమాలు కూడా చేసాడు. ముఖ్యంగా అమీర్ ఖాన్ లాంటి నటులతో కలిసి నటించిన "రంగ్ దే బసంతీ" సినిమా ఆయనకు బాలీవుడ్‌లో కూడా మంచి పేరు తీసుకొచ్చింది. 

కానీ టాలీవుడ్ అందించిన సూపర్ సక్సెస్‌లు.. ఏ చిత్ర పరిశ్రమ కూడా సిద్ధార్థకు అందివ్వలేదన్నది సత్యం. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట, ఓ మై ఫ్రెండ్.. లాంటి తెలుగు సినిమాలు సిద్ధార్థ్‌‌ను ఇక్కడి యువతకు బాగా దగ్గర చేశాయి. కానీ అదే మ్యాజిక్ ఆయనకు తర్వాత రిపీట్ కాలేదు. 

కాగా, సిద్ధార్థ్ అప్పుడ‌ప్పుడు కొన్ని వివాదాస్ప‌ద కామెంట్ల‌తోనూ వార్త‌ల్లో నిలుస్తుంటాడు. ఈ నేప‌థ్యంలోనే ఈ మ‌ధ్య‌ పాన్ ఇండియా సినిమాకి ఓ కొత్త అర్ధాన్ని చెప్పాడు.

‘కేజీఎఫ్ 2’(KGF 2) ను పాన్ ఇండియా సినిమా అని పిలుస్తుంటే చాలా ఫన్నీగా ఉంది. 15 ఏళ్ల నుంచి నేను వివిధ భాషల్లో సినిమాలు చేస్తున్నా. తమిళంలో చేస్తే తమిళియన్‌గా, తెలుగులో చేస్తే తెలుగబ్బాయిలా,..ఇలా ఏ భాషలో వర్క్ చేస్తే, ఆ భాషలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా. వేరేవాళ్ల చేత డబ్బింగ్ చెప్పించుకోను. నా వరకూ ఆయా చిత్రాలను ఇండియన్ ఫిల్మ్ అని పిలవడమే నాకు ఇష్టం.

అందుకే, పాన్ ఇండియా (Pan India) అంటుంటే కాస్త అగౌరవంగా అనిపిస్తుంది. వేరే ఎవరినో ఇబ్బంది పెట్టాలని ఇలా చెప్పడం లేదు. చిత్రపరిశ్రమలో హిందీ సినిమాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి, ఆ భాష నుండి విడుదలైన సినిమాలు ప్రేక్షకాదరణ పొందితే, వాటిని బాలీవుడ్ అనే అంటారు. కానీ, ప్రాంతీయ చిత్రాలు విశేషమైన ప్రేక్షకాదరణ పొంది, భారీ విజయాన్ని అందుకున్నప్పుడు వాటిని ఎందుకు పాన్ ఇండియా అని పిలవడం? భారతీయ చిత్రం అని అనొచ్చు కదా” అని ఆయన అన్నారు.

అలాగే ఓ ఈవెంట్‌‌లో బాలీవుడ్ గురించి.. త‌న నేటివిటీ గురించి కూడా సిద్ధార్థ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసాడు. "నేను ఢిల్లీ అబ్బాయిని. ఈ విషయాన్ని చాలా మంది మ‌ర్చిపోతున్నారు. నేను కూడా హిందీ మాట్లాడుతాను. ఆ భాష మీద మంచి ప‌ట్టుంది. కానీ న‌టుడిగా సౌత్‌లో ఎక్కువ సినిమాలు చేసాను. మంచి కంటెంట్, కథా ప్రాధాన్యమున్న చిత్రాలేవైనా వ‌స్తే.. త‌ప్ప‌కుండా హిందీలో న‌టిస్తాను. అప్ప‌టి వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే" అని  సిద్ధార్థ్ అన్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!