‘గుండమ్మ కథ’ సినిమాలో క్యారెక్టర్ నా టాలెంట్‌కు తగినది కాదు: జమున (Jamuna)
‘గుండమ్మ కథ’ .. ఈ చిత్రం టాలీవుడ్‌లో ఎంత పెద్ద హిట్ సినిమానో అందరికీ తెలిసిందే. తెలుగు సినీ చరిత్రకు సంబంధించి టాప్ టెన్ సినిమాల జాబితాను తయారుచేస్తే, అందులో ‘గుండమ్మ కథ’ కచ్చితంగా ఉంటుంది. ఆ సినిమాలో నందమూరి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున (Jamuna) వంటి దిగ్గజ నటీనటులు ఎందరో నటించారు.
ఈ చిత్రంలో రామారావు, నాగేశ్వరరావుల నటన ఒక ఎత్తు అయితే, సావిత్రి సౌమ్యంగా నటించిన తీరు, జమున కొంటెతనంతో పలికించిన సంభాషణలు ఒక ఎత్తు. ఇక గుండక్క పాత్రలో అలనాటి మేటి నటి సూర్యకాంతం పాత్రలో ఒదిగిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఆమె గయ్యాళితనాన్ని దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించారు. 'గుండమ్మ కథ ' సినిమా రిలీజై అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, జమున మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.
‘గుండమ్మ కథ’ సినిమా పేరు పెట్టినపుడు, ఎవరి దగ్గర నుంచి కూడా పెద్దగా స్పందన లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో అప్పటికే మాకున్న గొడవను 'గుండమ్మ '.. ఆ సినిమాతో కాంప్రమైజ్ చేసింది. ఆ ఇద్దరు హీరోలతో సుమారు మూడు సంవత్సరాలు నేను మాట్లాడలేదు. వేరే వాళ్లయితే చాలా ఇబ్బందుల్లో పడేవారు. చిన్న వివాదం కారణంగా, ఆ హీరోలతో సినిమాలు చేయబోనని భీష్మించుకుని కూర్చున్నాను.
దారిన పోయే దానయ్యతోనైనా సినిమా చేస్తాను కానీ, మీతో మాత్రం చేయనని చెప్పాను. ఈ క్రమంలోనే జగ్గయ్య లాంటి వాళ్లతో సినిమా చేసి సూపర్‌హిట్ కొట్టాను. కాంచనమాల, కన్నాంబ.. తర్వాత కృష్ణవేణి, వరలక్ష్మి తరం వచ్చింది. ఆ తర్వాత మేం వచ్చాం. ఒక్కొక్కరూ 20 నుంచి 30 సంవత్సరాలు నటించాం. ఇప్పటి హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్తున్నారు.
సంబంధాలు సరిగా లేనప్పుడు ఎలా..
ఆత్మాభిమానంతో ఉండాలనుకుంటేనే ఎవరితోనైనా గొడవలు.నాగేశ్వరరావుతో ఇబ్బందిపడ్డాననే, ఆయనతో సినిమాలు చేయలేదు. నా జోలికి రావొద్దని చెప్పా. ఏ రంగంలోనైనా స్త్రీ ఆత్మాభిమానం పొగొట్టుకోవద్దంటే, సమస్యల్ని ఎదుర్కోవాలి. 'గుండమ్మ కథ ' సినిమాలో సరోజ పాత్ర నేనే చేయాలని.. చక్రపాణి, నాగిరెడ్డి మూడు సంవత్సరాలు ఎదురుచూశారు.
ఒక రోజు నాగేశ్వరరావుతో నాగిరెడ్డి, చక్రపాణి, నేను సమావేశమయ్యాం. 'ఏదో చిన్న పిల్ల కాలు మీద కాలు వేసుకుందని.. అలా ఉంటే ఎలా '.. 'నా గుండమ్మ మూడు సంవత్సరాలుగా ఏడుస్తోందయ్యా.. సినిమా మాత్రం కచ్చితంగా చేయాలని ' ఆయన నాగేశ్వరరావుతో చెప్పారు. నిజంగా చెప్పాలంటే, అది నా టాలెంట్‌కు సరిపడా క్యారెక్టర్ కాదు. మామూలు చిలిపి అమ్మాయిగా నటించాలంతే.
రచయిత ముందుగానే గమనిస్తాడు
ఒక పాత్ర స్వభావాన్ని, తీరుతెన్నులను రచయిత గమనిస్తాడు. ఆ క్యారెక్టర్‌ను ఎవరు చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా చేస్తాడు పొగరుగా ఉన్న క్యారెక్టర్‌లో సావిత్రి నటిస్తే ఒప్పుకుంటారా ? ఆమె పాత్రలు సాఫ్ట్‌గా ఉండాలి. జమున ఏడుపుగొట్టు వేషాలేస్తే, ప్రేక్షకులు అంగీకరిస్తారా? జమున సత్యభామలా ఉండాలనుకుంటారు. పుట్టుకతో అలాంటి నటన వస్తేనే, పాత్రకు న్యాయం చేయగలుగుతాం.
టీనేజ్‌లో రాణీలా..
సినిమాలో రాణి క్యారెక్టర్ మాదిరిగానే టీనేజ్‌లో ఉండేదాన్ని. అమ్మ, నాన్న, తమ్ముడు, మరదలు అందరూ ఇంట్లోనే ఉండేవారు. అన్ని విషయాలను అమ్మే చూసుకునేది. ఆమెకు క్రమశిక్షణ ఎక్కువ. అయితే నా విషయంలో, మరింత జాగ్రత్తగా ఉండేది. సూర్యకాంతంతో నాకు మంచి సాన్నిహిత్యం ఉండేది. అందరినీ తన పిల్లల్లాగే చూసుకునేది ఆమె. అందరికీ పెట్టడానికి, పెద్ద క్యారియర్ తెప్పించి.. దగ్గరుండి మరీ తినిపించేది.
జ్ఞాపకాలు గుర్తొస్తుంటే..
గుండమ్మ కథ వంటి గొప్ప సినిమా తీసిన మహానుభావులు నాగిరెడ్డి, చక్రపాణి. ఆ సినిమాలో నటించిన నటీనటులు అందరినీ ప్రస్తుతం నేను తలచుకుంటున్నా. ఆ అనుభవాలు, జ్ఞాపకాలు గుర్తుకొస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ సినిమా రిలీజై 60 సంవత్సరాలు గడిచిన సందర్భంగా, సినిమాను గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందని జమున (Jamuna) అన్నారు.
Read More: నో గన్.. నో ఎంట్రీ : ఆసక్తి రేకెత్తిస్తున్న లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్‌డే’ సినిమా టీజర్ !