‘మహాభారతం’లో నటించడం నా డ్రీమ్: సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) తనదైన విలక్షణమైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఎప్పుడూ మెస్మరైజ్ చేస్తుంటారు. ఈమధ్య కథానాయక పాత్రలకు దూరంగా ఉంటున్నప్పటికీ.. డిఫరెంట్ రోల్స్‌లో నటిస్తూ ఆడియెన్స్ కు మరింత దగ్గరవుతున్నారు. ‘సాక్రెడ్ గేమ్స్’, ‘తాండవ్’ లాంటి వెబ్ సిరీస్‌ల్లో పోషించిన పాత్రలు ఆయన కెరీర్‌లో మర్చిపోలేనివిగా నిలిచాయి.
ఇటీవల రిలీజైన ‘విక్రమ్ వేద’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సైఫ్ అలీ ఖాన్.. ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రంలో రావణుడి పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవ్వనున్న ఈ చిత్రంతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని ఈ పటౌడీ వారసుడు భావిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. ‘మహాభారతం’లో నటించాలని ఉందని సైఫ్ తన మనసులోని మాటను బయటపెట్టారు.
భారతీయ ఇతిహాసాల్లో ఒకటైన ‘రామాయణం’పై తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’లో నటించిన సైఫ్.. ‘మహాభారతం’లోనూ నటించాలని ఉందని తెలిపారు. హాలీవుడ్ క్లాసిక్ ‘లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్’ మాదిరిగా ఎవరైనా మహాభారతాన్ని భారీగా తెరకెక్కిస్తే.. అందులో యాక్ట్ చేయాలని ఉందని సైఫ్ చెప్పారు. ‘కచ్చే ధాగే’ సినిమా అప్పటి నుంచే తాను అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn)తో ‘మహాభారతం’ ప్రాజెక్ట్ గురించి చర్చిస్తున్నానని సైఫ్ పేర్కొన్నారు.
దక్షిణాదితో కలసి తెరకెక్కించాలి
‘మా జనరేషన్‌కు మహాభారతం ఒక డ్రీమ్. ప్రతి ఒక్కరూ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలనుకుంటారు. హిందీ చిత్ర పరిశ్రమతోపాటు దక్షిణాది సినీ ఇండస్ట్రీ కలిసి ఈ మెగా ప్రాజెక్ట్‌ను భారీగా తెరకెక్కించాలి’ అని సైఫ్ పేర్కొన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. సైఫ్ ప్రస్తుతం ‘ఆదిపురుష్’ సినిమా పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ దర్శకనిర్మాత ఓం రౌత్ తీస్తున్న ఈ సినిమాలో.. సైఫ్ రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. రావణాసురుడిగా సైఫ్ లుక్ బాగోలేదని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.
‘ఆదిపురుష్’ టీజర్ (Adipurush Teaser)పై వస్తున్న విమర్శలపై తాజాగా దర్శకుడు ఓం రౌత్ స్పందించారు. ఈ సినిమాతో రాముడి గొప్పతనాన్ని రానున్న తరాలకు తెలియజెప్పాలని అనుకుంటున్నానని ఓం రౌత్ అన్నారు. అందుకు అనుగుణంగానే రావణాసురుడి లుక్‌ను అలా డిజైన్ చేశామని ఆయన చెప్పారు. ‘కేవలం 95 సెకన్ల వీడియో చూసి ఒక అభిప్రాయానికి రావొద్దు. సినిమా చూశాక మాట్లాడండి’ అని ఓం రౌత్ పేర్కొన్నారు. రావణాసురుడు క్రూరత్వం కలిగిన వ్యక్తి అని.. లుక్స్‌తోనే ఆ క్రూరత్వాన్ని చూపించాలని చెప్పుకొచ్చారు.
Read more: ఫ్యాన్స్ కోసం ‘ఆదిపురుష్’ (Adipurush) టీజర్ స్పెషల్ స్క్రీనింగ్స్.. అభిమానులను రివ్యూ కోరిన ప్రభాస్ (Prabhas)