‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడి నుంచి మరో సంచలన మూవీ.. 11 భాషల్లో భారీ రిలీజ్‌కు వివేక్ (Vivek Agnihotri) ప్లాన్!

Updated on Nov 10, 2022 01:45 PM IST
కరోనా టీకా కసరత్తుల గురించి కొత్త అధ్యాయాలను ఈ చిత్రం ద్వారా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నానని వివేక్ అగ్నిహోగ్రి (Vivek Agnihotri) అన్నారు
కరోనా టీకా కసరత్తుల గురించి కొత్త అధ్యాయాలను ఈ చిత్రం ద్వారా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నానని వివేక్ అగ్నిహోగ్రి (Vivek Agnihotri) అన్నారు

ఇండియాలో అతిపెద్ద చిత్ర పరిశ్రమగా బాలీవుడ్‌కు పేరుంది. అయితే పెద్దన్న పాత్ర పోషించే హిందీ ఇండస్ట్రీకి ఈ మధ్య బ్యాడ్ టైమ్ నడుస్తోంది. గత రెండేళ్లలో బాలీవుడ్‌లో బిగ్ హిట్స్ పడటం తగ్గిపోయింది. స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతున్నాయి. అయితే కన్నడ, తెలుగు చిత్రాలు మాత్రం ఉత్తరాదిన డబ్ అయ్యి సత్తా చూపిస్తున్నాయి. ఈ తరుణంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) మూవీ సంచలన విజయం సాధించింది. 

చిన్న సినిమాగా విడుదలైన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సక్సెస్ బాలీవుడ్‌లో బడా మేకర్స్‌ను షాక్‌కు గురి చేసింది. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) దర్శకత్వం వహించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ.. కశ్మీర్ పండిట్ల ఊచకోత నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. 

యథార్థ ఘటనలతో..

వివేక్ అగ్నిహోత్రి నుంచి కొత్త చిత్రం ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆయన.. తన కొత్త సినిమా గురించి తాజాగా ప్రకటించారు. మరో యథార్థ సంఘటనలతో ఓ మూవీని తెరకెక్కించనున్నట్లు వివేక్ తెలిపారు. తాజాగా ఈ చిత్రం టైటిల్‌తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘ది వ్యాక్సిన్ వార్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని 11 భాషల్లో విడుదల చేయనున్నట్లు వివేక్ అగ్నిహోత్రి వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇంగ్లీషులోనూ రిలీజ్!

దేశంలో కరోనా వైరస్ వల్ల నెలకొన్న పరిస్థితులతోపాటు టీకా కసరత్తుల గురించి ఈ చిత్రం కొన్ని అధ్యాయాలను చూపిస్తుందని వివేక్ అగ్నిహోత్రి చెప్పారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నామని తెలిపారు. హిందీతోపాటు ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ భాషల్లో మూవీని విడుదల చేస్తామని వివేక్ పేర్కొన్నారు. ఈ సినిమాను ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్‌కు చెందిన పల్లవీ జోషి, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించనున్నారు. 

Read more: ‘బింబిసార’ (Bimbisara) డైరెక్టర్‌తో భారీ మూవీకి ప్లాన్!.. వశిష్టకు అవకాశం ఇచ్చే యోచనలో చరణ్ (Ram Charan)​?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!