Movie Review : వినోదభరితంగా బెల్లంకొండ గణేష్‌ (Bellamkonda Ganesh) ‘స్వాతిముత్యం’ (SwathiMuthyam)

Updated on Oct 06, 2022 03:21 PM IST
బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్‌ హీరోగా తెరకెక్కిన స్వాతిముత్యం సినిమా దసరా కానుకగా  బుధవారం విడుదలైంది
బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్‌ హీరోగా తెరకెక్కిన స్వాతిముత్యం సినిమా దసరా కానుకగా బుధవారం విడుదలైంది

సినిమా : స్వాతిముత్యం

న‌టీన‌టులు : బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ, నరేష్, రావు రమేష్

మ్యూజిక్ : మహతి స్వర సాగర్‌

నిర్మాత : సూర్యదేవర నాగవంశీ

దర్శకత్వం : లక్ష్మణ్ కె.కృష్ణ  

విడుద‌ల‌ తేదీ : 05–10–2022

రేటింగ్ : 3 / 5

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్‌ (Bellamkonda Ganesh) హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు లక్ష్మణ్‌ కె కృష్ణ తెరకెక్కించిన సినిమా ‘స్వాతిముత్యం’ (SwathiMuthyam). సితార ఎంటర్‌‌టైన్‌మెంట్స్‌ నిర్మించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించారు. కామెడీ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన స్వాతిముత్యం సినిమా దసరా సందర్భంగా బుధవారం విడుదలైంది.

పండుగ సీజన్‌ అంటే పెద్ద సినిమాలతోపాటు చిన్న సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేస్తుంటాయి. ఈ దసరా పండుగకు గాడ్‌ఫాదర్‌‌, ది ఘోస్ట్‌ సినిమాలతోపాటు స్వాతిముత్యం సినిమా కూడా విడుదలైంది. స్వాతిముత్యం చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉండడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్‌ఫాదర్, కింగ్ నాగార్జున నటించిన ది ఘోస్ట్‌ సినిమాలతోపాటు రిలీజైన స్వాతిముత్యం సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

 క‌థ ఏంటంటే : బాలమురళీకృష్ణ అలియాస్ బాల (బెల్లంకొండ గ‌ణేష్‌) ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తుంటారు. నిజాయ‌తీతోపాటు కొంచెం అమాయకత్వం కూడా ఉన్న వ్యక్తి. పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంట్లో వాళ్లు పెట్టే రూల్స్ కారణంగా సంబంధం కుదరక ఇబ్బంది పడుతుంటారు. భాగ్యలక్ష్మి (వర్ష బొల్లమ్మ) స్కూల్ టీచర్. పెళ్లి చూపుల్లో ఆమెను చూసి ప్రేమలో పడతాడు బాల. అనేక సమస్యలు దాటుకొని వారి ప్రేమ.. పెళ్లిపీటల వరకు వస్తుంది. కొన్ని గంటల్లో పెళ్లి జరగబోతున్న సమయంలో శైలజ (దివ్య శ్రీపాద) అనే యువతి తొమ్మిది నెలల బిడ్డను తీసుకొచ్చి నీ బాబే అంటూ బాల చేతిలో పెడుతుంది. బాల కూడా త‌న బిడ్డే అని ఒప్పుకుంటాడు. అనూహ్యమైన ఆ ప‌రిణామంతో పెళ్లింట్లో క‌ల‌క‌లం రేగుతుంది. ఇంత‌కీ శైలజ ఎవరు? ఆ చిన్నారి నిజంగా బాలకు పుట్టిన బిడ్డేనా? స్వాతిముత్యంలాంటి బాల పెళ్లికి ముందే బిడ్డని ఎలా క‌న్నాడు? బాల, భాగ్యలక్ష్మి పెళ్లి జ‌రిగిందా? లేదా? అనేది మిగిలిన క‌థ‌.

బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్‌ హీరోగా తెరకెక్కిన స్వాతిముత్యం సినిమా దసరా కానుకగా  బుధవారం విడుదలైంది

ఎలా ఉందంటే : అమాయ‌కుడైన ఒక యువ‌కుడి పెళ్లి కష్టాల చుట్టూ సాగే హాస్యభ‌రిత‌మైన కుటుంబ క‌థ ఈ సినిమా. స‌రోగ‌సీ అంశాన్ని టచ్ చేస్తూ.. సినిమా మొదటి నుంచి చివరి వరకూ ప్రేక్షకుడిని నవ్వించడమే లక్ష్యంగా క‌థను రాసుకున్నారు దర్శకుడు. ఇటువంటి కథతో చాలా సినిమాలే వచ్చినప్పటికీ ఆ కథను కొత్తగా చెప్పేందుకు ప్రయత్నించారు. హీరో, దర్శకుడు ఇద్దరికీ ఇదే మొదటి సినిమా. అయితే.. అనుభవం ఉన్న నటీనటులతో సినిమాను బాగానే తెరకెక్కించారు.

చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం సంపాదించిన బాల.. పెళ్లి ప్రయత్నాలతో స్వాతిముత్యం సినిమా కథ స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ పెట్టే రూల్స్, హీరో అమాయకత్వం, ఆఫీస్‌లో జరిగే హడావుడితో ఫస్టాఫ్‌ అంతా సరదాగా సాగిపోతుంది. సినిమాలోని క్యారెక్టర్లను పరిచయం చేయడానికి పట్టే సమయం ఎక్కువకావడంతో.. కథ నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అంతా ఓకే.. ఇక పెళ్లి జరిగిపోతుంది అనుకున్న సమయంలో వచ్చే ట్విస్ట్‌తో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే సీన్లు కథ వేగంగా నడుస్తోందని అనిపిస్తుంది.

జరిగిన విషయాన్ని పేరెంట్స్‌కు చెప్పడానికి బాల ఇబ్బంది పడే సన్నివేశాలు, వాళ్లు అతన్ని చూసే తీరు నవ్వులు తెప్పిస్తాయి. సెకండాఫ్‌లో సెంటిమెంట్‌ కూడా బాగానే పండింది. రొటీన్ కథలో కామెడీని చేర్చి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా నచ్చేలా సినిమాను తెరకెక్కించారు.

ఎవ‌రెలా నటించారంటే: బెల్లంకొండ గ‌ణేష్‌ (Bellamkonda Ganesh)కు మొదటి సినిమానే అయినా పాత్రకి తగ్గట్టుగా నటించారు. అమాయకత్వాన్నే కాకుండా భావోద్వేగాలను కూడా బాగానే పండించారని చెప్పాలి. హీరోయిన్ వర్ష తన నటనతో ఆకట్టుకున్నారు. సెకండాఫ్‌లో ఆమె చుట్టూనే కథ తిరగడంతో నటనకు ఎక్కువ ఆస్కారం లభించింది. గోపరాజు రమణ క్యారెక్టర్‌‌ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. రావు రమేష్‌ మేనరిజం, ఆయన చేసిన కామెడీ ప్రేక్షకుడికి సినిమాను బోర్‌‌ ఫీల్‌ కాకుండా చేస్తాయి. నరేష్‌, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హర్షవర్ధన్, ప్రగ‌తి, సురేఖ‌వాణి తమ పరిధిమేరకు నటించారు.

సాంకేతికంగా కూడా స్వాతిముత్యం (SwathiMuthyam) సినిమాకు మంచి మార్కులే వేయచ్చు. మహతి స్వర సాగర్‌‌ అందించిన మ్యూజిక్ అలరిస్తుంది. అదే సమయంలో పాటలు అంతగా ఆకట్టుకునేలా లేకపోవడం సినిమాకు మైనస్ అని చెప్పచ్చు.  

ప్లస్ పాయింట్లు : కామెడీ కథాంశం, ట్విస్ట్‌, సెకండాఫ్‌

మైనస్ పాయింట్లు : ఫస్టాఫ్‌లో కథ నెమ్మదిగా ఉండడం, పాటలు

ఒక్క మాటలో : వినోదాన్ని పంచిన ‘స్వాతిముత్యం’

Read More : God Father Movie Review : రాజకీయ కేళిలో నమ్మినవారికి అండగా నిలిచే "గాడ్ ఫాదర్ " !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!