త‌ప్పుగా మాట్లాడాను..క్ష‌మించండి : విశ్వక్ సేన్ (Vishwak Sen)

Updated on May 03, 2022 11:03 AM IST
సినిమా ప్ర‌మోషన్స్ విశ్వ‌క్‌సేన్‌కు (Vishwak Sen) క‌ష్టాలు తెచ్చింది. సినిమా కోసం విశ్వ‌క్‌సేన్ చేసిన ప్రాంక్ ర‌చ్చ అయింది. త‌ప్పు మాట్లాడాను.... క్ష‌మించండ‌ని విశ్వ‌క్ సేన్ అంటున్నాడు.
సినిమా ప్ర‌మోషన్స్ విశ్వ‌క్‌సేన్‌కు (Vishwak Sen) క‌ష్టాలు తెచ్చింది. సినిమా కోసం విశ్వ‌క్‌సేన్ చేసిన ప్రాంక్ ర‌చ్చ అయింది. త‌ప్పు మాట్లాడాను.... క్ష‌మించండ‌ని విశ్వ‌క్ సేన్ అంటున్నాడు.

విశ్వక్ సేన్  (Vishwak Sen) .. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నామా దాస్, హిట్, పాగల్ లాంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన వ్యక్తి. తనకంటూ ఒక మాస్ ఫాలోయింగ్‌ని ఏర్పరచుకున్న వ్యక్తి. ప్రస్తుతం ఆయన నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. అయితే ఇదే క్రమంలో ఓ వివాదంలో చిక్కుకున్నాడు ఈ నటుడు. 

సినిమా ప్ర‌మోషన్స్ కోసం విశ్వ‌క్‌ సేన్‌ (Vishwak Sen) చేసిన ప్రాంక్ ఆయనకే  క‌ష్టాలు తెచ్చింది. ఈ ప్రాంక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆఖరికి విశ్వక్ ఓ టీవీ యాంకర్‌ని బూతులు తిట్టే దాకా, ఈ గొడవ వెళ్లింది. "త‌ప్పు మాట్లాడాను.... క్ష‌మించండి" అని చివరికి విశ్వక్ సేన్ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

మాస్ కా దాస్ అని త‌న యాక్టింగ్‌తో పేరు తెచ్చుకున్నాడు హీరో విశ్వ‌క్ సేన్‌ (Vishwak Sen). త‌క్కువ సినిమాలే చేసినా.. యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం ఆయన నటించిన అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మే 6 న థియేట‌ర్ల‌లో ఈ చిత్రం సంద‌డి చేయ‌నుంది. కానీ ఈ సినిమా కోసం చేసిన ఓ ప్ర‌మోష‌న్ విశ్వ‌క్ సేన్‌కు క‌ష్టాలు తెచ్చిపెట్టింది. 

ఇటీవలే హైదరాబాద్‌లో అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఆ తర్వాత,  నడిరోడ్డుపై ఓ యువకుడు త‌న ఒంటిపై కిరోసిన్ పోసుకుని విశ్వ‌క్ సేన్ కారుని ఆపాడు. విశ్వ‌క్ సేన్ అతన్ని కంట్రోల్ చేసి, తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. జ‌నాలు అంద‌రూ ఏమైంద‌ని కంగారు ప‌డుతుంటే.. ఇది తమ సినిమా ప్ర‌మోష‌న్ కోసం చేసిన ఓ ప్రాంక్ మాత్రమేనని చిత్ర యూనిట్ తెలిపింది. అప్పుడే మొద‌లైంది విశ్వ‌క్ సేన్‌కి బ్యాడ్ టైం. 

Vishwak Sen

ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేశాక, విశ్వక్ ప్రవర్తన పై ఓ ప్రముఖ ఛానల్ డిబేట్ జరిపింది. ఇదే క్రమంలో  ఆ ఛానల్ యాంక‌ర్ దేవీ నాగ‌వ‌ల్లి షోకి డైరెక్టుగా వెళ్లిపోయిన విశ్వ‌క్ సేన్, ఆమె కోసం తను తెచ్చిన స్వీట్లు తినాల‌ని కోరాడు. డిబెట్ కంటిన్యూ అవుతుంద‌ని... విశ్వ‌క్ సేన్ డిబెట్‌లో కూర్చుని మాట్లాడాలని దేవీ నాగ‌వల్లి చెప్పింది ఆ తర్వాత,. డిబెట్‌లో డిప్రెస్‌డ్ ప‌ర్స‌న్ అని దేవి నాగ‌వ‌ల్లి తనను సంబోధించడంతో విశ్వ‌క్ సేన్ కోపంతో ఆ యాంక‌ర్‌ను తిట్టాడు. దీంతో నాగ‌వ‌ల్లి "గెట్ అవుట్ ఆఫ్ మై షో" అంటూ విశ్వక్ పై విరుచుకుపడింది. 

తర్వాత విశ్వక్ పలు ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. త‌న కెరీర్‌లో  అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం ఓ ఉత్తమ చిత్రంగా నిలవాలని కోరుకుంటున్న‌ట్లు విశ్వ‌క్ సేన్ చెప్పాడు. సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం స‌ర‌దాగా ప్రాంక్ చేశాన‌ని.. అంతేతప్ప ఎవ‌రినీ భయపెట్టాల‌ని కాద‌న్నాడు. ప‌బ్లిసిటీ ఎంత ఎక్కువగా చేస్తే, ఆడియ‌న్స్ అంత ఎక్కువగా థియేట‌ర్ల‌కు వ‌స్తార‌నే ఆలోచ‌న త‌న‌ద‌ని చెప్పుకొచ్చాడు. 

తాను దేవీ నాగవల్లితో త‌ప్పుగా మాట్లాడానని, అందుకు క్ష‌మాప‌ణ‌లు కోరానని విశ్వక్ సేన్ తెలిపాడు. మీడియాలో జ‌రిగిన గొడ‌వ దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నాడు. వివాదం సృష్టించి జనం దృష్టిని ఆకర్షించాలని  తాను ఎప్పుడూ అనుకోలేద‌న్నాడు. వివాదంతో  సినిమాకు హైప్‌ తెచ్చుకోవాలనే దురాశ తనకు లేదన్నాడు. ఓ మీడియాలో జ‌రిగిన త‌ప్పుకు మొత్తం మీడియాని బాధ్యులం చేయ‌లేమ‌న్నాడు. 

అశోకవనంలో అర్జున కల్యాణంలో మంచి పాత్ర ద‌క్కింద‌ని, ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్‌ రుక్సాన్‌ థిల్లాన్‌ చెప్పారు. విశ్వ‌క్ సేన్ ఎలాంటి పాత్ర అయినా చేయ‌గ‌ల‌ర‌ని దర్శకుడు విద్యాసాగర్‌ చింతా అన్నారు.  ఈ సినిమాతో విష్వక్‌(Vishwak Sen) ఇమేజ్‌ మారిపోతుందని  ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!