Laal Singh Chaddha Review : ఎన్నో భావోద్వేగాలతో ముడిపడిన.. అసాధారణ అనుభవాల కలయిక "లాల్ సింగ్ చడ్డా"
సినిమా : లాల్ సింగ్ చడ్డా
పాత్రధారులు : అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య, మోనా సింగ్
కథా సహకారం : అతుల్ కులకర్ణి
మూలకథ : ఫారెస్ట్ గంప్ నవల, సినిమా ఆధారంగా
నిర్మాతలు : అమీర్‌ఖాన్, కిరణ్ రావ్, జ్యోతిదేశ్ పాండే, అజిత్ అంధారే
దర్శకత్వం : అద్వైత్ చందన్
రేటింగ్ : 3/5
లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha).. ఈ మధ్యకాలంలో ఎన్నో చర్చలకు తెరదీసిన సినిమా. ముఖ్యంగా ఆస్కార్ అవార్డును పొందిన పేరెన్నిక చిత్రం "ఫారెస్ట్ గంప్" ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అనగానే, ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర అభిమానులందరిలోనూ ఆసక్తిని రేకెత్తించిందీ చిత్రం.
ఈ రోజే ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, లాల్ సింగ్ (అమీర్ ఖాన్ - Aamir Khan) అనే ఓ కుర్రాడి జీవితం ఇది. బుద్ధి మాంద్యంతో బాధపడే ఓ కుర్రాడు తన తల్లి ప్రేరణతో పాఠశాలలో అందరితో సమానంగా రాణించడానికి ప్రయత్నిస్తాడు. అతనికి ఓ స్నేహితురాలు కూడా తోడవుతుంది. వయసు పెరుగుతున్నా కూడా, లాల్ సింగ్ ప్రవర్తనలో ఏ మార్పూ ఉండదు. అదే చిన్న పిల్లాడి మనస్తత్వంతో జీవితాన్ని వెళ్లదీస్తుంటాడు. అటువంటి సమయంలోనే అతనికి ఆర్మీలో చేరే అవకాశం లభిస్తుంది.
ఆర్మీ క్యాంపులోనే బోడిపాలెం బాలరాజు (అక్కినేని నాగచైతన్య) అనే తెలుగు కుర్రాడితో లాల్ సింగ్‌కు పరిచయమవుతుంది. ఆర్మీ నుండి రిటైర్ అయ్యాక, తనకు బట్టల వ్యాపారం చేయాలని ఉందని బాలరాజు అనేకసార్లు లాల్ సింగ్‌కు చెబుతూ ఉంటాడు. కానీ అదే బాలరాజు కార్గిల్ యుద్ధంలో చనిపోతాడు.
తర్వాత లాల్ సింగ్ కూడా బుల్లెట్ గాయాల బారిన పడతాడు. ఓ పాకిస్తాన్ సైనికుడిని కూడా కాపాడతాడు. ఇదే క్రమంలో ఎన్నో చిత్ర, విచిత్రమైన అనుభవాలను ఎదుర్కొంటాడు. కొన్నిసార్లు అసాధారణమైన ఘనతలను కూడా సాధిస్తాడు. తనకంటూ కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకుంటాడు. చిన్ననాటి స్నేహితురాలు రూప (కరీనా కపూర్) ను కలుసుకుంటాడు. ఆమెతో జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటాడు. ఇక్కడే ఒక సగటు మనిషికి ఏర్పడే భావోద్వేగాలతో దర్శకుడు మనల్ని కట్టిపడేస్తాడు.
కానీ విధి అనేకసార్లు లాల్ సింగ్ జీవితాన్ని తలక్రిందులు చేస్తూనే ఉంటుంది. అయినా, నూతనోత్సాహంతో అతను ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఈ క్రమంలో సినిమా కాస్త ఫిలాసఫికల్ యాంగిల్‌లో కూడా సాగుతుంది. ఆఖరికి లాల్ సింగ్ జీవితం ఎలాంటి గమ్యాన్ని చేరుకుందో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
నటీనటుల గురించి
అమీర్ ఖాన్‌కు (Aamir Khan) ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. గతంలో పీకే, ధూమ్ 3 లాంటి చిత్రాలలో ఇలాగే ఆయన పాత్రలతో ప్రయోగాలు చేశారు. లాల్ సింగ్ చడ్డా సినిమాలో కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. అయితే కొన్నిసార్లు, మిస్టర్ బీన్ ఛాయలు అదే పాత్రలో మనకు కనిపిస్తాయి. ఏదేమైనా, ఇలాంటి పాత్రలో నటించి అమీర్ ఖాన్ పెద్ద సాహసమే చేశారని చెప్పాలి.
ఇక ఆర్మీలో లాల్ సింగ్‌కు పరిచయమైన స్నేహితుడు బాలరాజు పాత్రలో నాగచైతన్య తన పరిధి మేరకు బాగా నటించాడు. ఒక వైవిధ్యమైన క్యారెక్టర్‌ను పోషించాడు. సినిమాలో దాదాపు అరగంట సేపు అలరించాడు. అలాగే లాల్ సింగ్ ప్రేయసి రూప పాత్రలో కరీనా కపూర్ నటన సైతం ఆకట్టుకొనే విధంగా ఉంది. అలాగే లాల్ సింగ్ తల్లి పాత్రలో మోనా సింగ్ నటన కూడా బాగుంది.
సాంకేతిక వర్గం గురించి
అతుల్ కులకర్ణి దాదాపు 10 సంవత్సరాల పాటు ఫారెస్ట్ గంప్ కథను భారతీయ నేటివిటీకి తగ్గట్టుగా రూపొందించే ప్రాజెక్టుపై పరిశోధన చేశారు. మన దేశ చరిత్రకు సంబంధించిన అనేక అంశాలను కథకు జోడించుకుంటూ, స్క్కిప్ట్ తయారుచేశారు. లాల్ సింగ్ పాత్ర రూపకల్పన వెనుక ఆయన కృషి ఎంతో ఉంది. ఆయన ఈ సినిమాకి కథా సహకారం అందించారు.
అయితే అద్వైత్ చందన్ (Advait Chandan) దర్శకత్వంలోనే అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. సినిమా ఆసక్తికరంగా ప్రారంభమైనప్పటికీ, సెకండాఫ్‌లో స్లో నేరేషన్ అన్నది ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఇలాంటి నేరేషన్ ఆకట్టుకుంటుందో చెప్పడం కష్టమే. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్, లొకేషన్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్.
హాలీవుడ్ చిత్రం 'ఫారెస్ట్ గంప్'ను వీక్షించిన వారికి, ఈ సినిమా పెద్దగా ఆకట్టుకుంటుందని చెప్పలేం. కానీ అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రయత్నంలో మాత్రం ఎలాంటి లోపం లేదు. శాయశక్తులా సినిమా ఒరిజినల్ స్క్రిప్ట్‌కు ఆయన న్యాయం చేయడానికే ప్రయత్నించారు.