Guinness Records: రివర్స్‌ స్క్రీన్‌ప్లే లవ్‌స్టోరీ ‘మనసానమ:’ ( Manasanamaha) షార్ట్‌ ఫిల్మ్‌కు 513 అవార్డులు

Updated on Jun 26, 2022 08:03 PM IST
గిన్నిస్‌ బుక్‌ రికార్టు సర్టిఫికెట్‌తో మనసానమ: డైరెక్టర్‌‌ దీపక్‌రెడ్డి
గిన్నిస్‌ బుక్‌ రికార్టు సర్టిఫికెట్‌తో మనసానమ: డైరెక్టర్‌‌ దీపక్‌రెడ్డి

ఏబీసీడీలు, అఆలను వెనుక నుంచి ముందుకు చదవాలంటేనే ఎంతో ప్రాక్టీస్ అవసరం. అంతెందుకు ఏదైనా పదాన్ని లేదా వాక్యాన్ని వెనుక నుంచి చదవాలంటే కష్టపడాల్సిందే. అటువంటిది రివర్స్ స్క్రీన్‌ప్లేతో సినిమా తీయాలంటే మామూలు విషయం కాదు. రివర్స్ స్ర్కీన్‌ప్లేతో ఒక షార్ట్ ఫిల్మ్‌ను తెరకెక్కించాడు దర్శకుడు దీపక్‌రెడ్డి. ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ఇప్పుడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 513 అవార్డులు అందుకున్న మొదటి షార్ట్ ఫిల్మ్‌గా నిలిచింది ‘మనసానమ:’ ( Manasanamaha).

యువ దర్శకుడు దీపక్‌రెడ్డి తెరకెక్కించిన ‘మనసానమ:’ అనే షార్ట్‌ ఫిల్మ్‌కు గిన్నిస్‌ బుక్‌లో చోటు కల్పిస్తున్నట్టు ప్రశంసాపత్రాన్ని కూడా అందించింది. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ దర్శకుడి ప్రయత్నాన్ని, వినూత్న ఆలోచనను మెచ్చుకుంటున్నారు. 2020లో విడుదల చేసిన ‘మనసానమ:’ షార్ట్ ఫిల్మ్‌ పోయినేడాది ఆస్కార్‌‌ అవార్డుల బరిలోనూ పోటీ పడింది. 

మనసానమ: షార్ట్‌ ఫిల్మ్‌ పోస్టర్

ఎలా మొదలైందంటే..

దీపక్‌రెడ్డికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే మక్కువ ఎక్కువ. ఇంట్లో వాళ్లను బాధపెట్టడం ఇష్టం లేని దీపక్.. మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘ఫిదా’ సినిమా అమెరికా షెడ్యూల్‌లో దాదాపు 40 రోజులు పనిచేశాడు. అప్పుడే సినిమా తీయడంపై అవగాహన తెచ్చుకున్నాడు దీపక్. కొన్నాళ్లకు ఇండియాకు తిరిగివచ్చి ‘ఎక్స్‌క్యూజ్‌మీ’, ‘హైడ్ అండ్ సీక్’ వంటి పలు షార్ట్ ఫిల్మ్స్‌ను తెరకెక్కించాడు. ఆ సమయంలోనే మంచి ఫీల్ ఉన్న లవ్‌స్టోరీ ఏదైనా తీయాలనే ఆలోచన వచ్చింది దీపక్‌కు. దాని కార్యరూపమే ‘మనసానమ:’

ఆ సినిమాలో పాటే స్ఫూర్తి..

2009వ సంవత్సరంలో లోకనాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా ‘మన్మథ బాణం’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక పాటను రివర్స్‌లో తెరకెక్కించారు. దాని నుంచి స్ఫూర్తి పొందిన దీపక్.. మనసానమ: షార్ట్ ఫిల్మ్‌ను పూర్తిగా రివర్స్‌లో తెరకెక్కించాడు. కథ, కథాంశం, అందులోని భావోద్వేగాలు దెబ్బతినకుండా షార్ట్‌ఫిల్మ్‌ను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు దీపక్.

మనసానమ: షార్ట్‌ ఫిల్మ్‌ పోస్టర్

షూటింగ్‌ 5 రోజులు మాత్రమే..

2019వ సంవత్సరంలో కేవలం 5 రోజుల్లోనే షార్ట్‌ ఫిల్మ్‌ షూటింగ్‌ను పూర్తి చేశాడు దీపక్. అయితే దాని ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల కోసం మాత్రం దాదాపుగా ఏడాది సమయం కేటాయించి శ్రమించాడు. 2020లో యూట్యూబ్‌లో విడుదల చేసిన ‘మనసానమ:’ షార్ట్ ఫిల్మ్‌ చూసిన ప్రముఖ దర్శకులు సుకుమార్, క్రిష్ కూడా దీపక్ టాలెంట్‌ను మెచ్చుకున్నారు. ఇక, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ అయితే ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను తమిళంలోకి డబ్బింగ్‌ చేసి రిలీజ్‌ చేశారు.

ప్రకృతినే కథావస్తువుగా తీసుకుని సూర్య అనే యువకుడి జీవితంలో జరిగిన ప్రేమ మజిలీలను చైత్ర, వర్ష, సీత అంటూ కాలాలకు అన్వయమయ్యేలా పేర్లు పెట్టి ‘మనసానమ:’ షార్ట్‌ ఫిల్మ్‌ను తెరకెక్కించాడు దర్శకుడు దీపక్. విభిన్నంగా ఉండాలనే ఆలోచనతో రివర్స్‌  స్క్రీన్‌ప్లేలో తెరకెక్కించాడు. ఈ షార్ట్‌ఫిల్మ్‌ టైటిల్‌ ఎటు నుంచి చూసినా ‘మనసానమః’ ( Manasanamaha) అని ఒకేలా కనిపించడం విశేషం.

Read More : నాగచైతన్య (Naga Chaitanya) ‘థ్యాంక్యూ’ సినిమా నుంచి మరో సింగిల్.. ‘ఫేర్‌‌వెల్‌’ పాట రిలీజ్‌ ఎప్పుడంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!