జీ తెలుగులో (Zee Telugu) కొత్త సీరియల్స్.. ప్రమోషన్స్ లో పాల్గొన్న మహేష్ బాబు-సితార స్పెషల్ ప్రోమో రిలీజ్..!
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు (Mahesh Babu) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇటీవల 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata)సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఈ మధ్యకాలంలో జీ తెలుగు ఛానెల్ ద్వారా అనేక పర్యాయాలు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నారు మహేష్ బాబు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఓ ప్రోమో ద్వారా తెలుగు ప్రేక్షకులందరినీ అలరించడానికి సిద్ధమయ్యారు.
బుల్లితెరపై జీ తెలుగులో (ZEE Telugu) త్వరలో మొదలుకానున్న మూడు ఫిక్షనల్ షోస్ యొక్క ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు తన కూతురు సితార, సీరియల్స్ లోని నటీనటులతో కలిసి చేసిన మ్యూజికల్ కాన్సెప్ట్ ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు.
జీ తెలుగులో ప్రసారం కాబోతున్న 'పడమటి సంధ్యారాగం', 'అమ్మాయి గారు', 'శుభస్య శీఘ్రం' అనే సీరియల్స్ కథనాలు ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని పరిచయం చేస్తూ షూట్ చేసిన ఒక చిన్నపాటి వీడియోలో మహేష్ బాబుతో పాటు ఆయన కుమార్తె సితార కూడా కలిసి కనిపించింది. దీంతో, ఈ మూడు సీరియల్స్ పై చేసిన ప్రోమో ద్వారా సీరియల్స్ తో పాటు జీ తెలుగు సంస్థ మీద కూడా ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
ఈ వీడియోలో తండ్రీకూతుర్ల కెమిస్ట్రీ, సితార (Mahesh Babu Daughter Sitara) అద్భుతమైన నటన, తన చలాకీతత్వం, స్క్రీన్ ప్రసేన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. అద్భుతమైన కథాంశం, నిర్మాణ విలువలతో చిత్రీకరించబడిన ఈ మ్యూజికల్ కాన్సెప్ట్ ప్రోమోకు 'సీతారామం' మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించగా, ఎస్.పి చరణ్ తన గాత్రాన్ని అందించాడు.
'పడమటి సంధ్యారాగం' (Padamati Sandhyaragam) అనే సీరియల్ జీ తెలుగులో సెప్టెంబర్ 19వ తేదీ నుంచి రాత్రి 8 గంటలకు ప్రసారం కాబోతోంది. ఈ సీరియల్ లోని సన్నివేశాలు విదేశాల్లో కూడా చిత్రీకరింపబడటం విశేషం. అమెరికాలో పాశ్చాత్య సంస్కృతిలో పుట్టి పెరిగిన అమ్మాయి ఒక సంప్రదాయకరమైన తన పెద్దమ్మ కుటుంబంలో ఉండాల్సివస్తే జరిగే పరిణామాలని ఆధారంగా చేసుకుని ఈ కథ సాగుతుంది. ఇందులో, జయశ్రీ, సాయి కిరణ్ మరియు తదితరులు ప్రముఖ పాత్రలలో ఆకట్టుకోనున్నారు.
ఒక తండ్రి ఆప్యాయత కోసం పరితపించే ఒక అమ్మాయి జీవిత ఆధారంగా 'అమ్మాయిగారు' (Ammayi Garu) అనే మరో సీరియల్ సిద్ధం చేశారు. అలాగే మధ్య తరగతి తల్లి తన కూతుర్ని తన కుటుంబాన్ని ఆపదల నుంచి ఎలా కాపాడుతుంది అనేదాన్ని ప్రధాన కథాంశంగా 'శుభశ్య శీఘ్రం' (Subhasya Sheegram) అనే మరో సీరియల్ ని రూపొందించారు.