మిత్రా శర్మ (Mitraaw Sharma) : దాతృత్వం చాటుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Updated on May 20, 2022 04:41 PM IST
మిత్రా శర్మ  (Mitraaw Sharma)
మిత్రా శర్మ (Mitraaw Sharma)

దేశవ్యాప్తంగా బిగ్ బాస్ రియాలిటీ షో హిట్ కావడంతో తెలుగులో కూడా ఈ షోను ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ షో 5 సీజన్లను పూర్తి చేసుకుంది. కాగా ప్రస్తుతం డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో  బిగ్ బాస్ నాన్ స్టాప్ 24 గంటలూ ప్రసారమవుతోంది. అయితే, ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ మిత్రా శర్మ  (Mitraaw Sharma) తన ధాతృత్వాన్ని చాటుకుంది. తన టీమ్, ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన వారికి నిత్యావసర సరుకులతో పాటు, దుస్తులు అందజేశారు.

వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాలోని ఎన్టీఆర్ నగర్ లో ఈ నెల 1వ తేదీన ఓ ఇంట్లో సిలిండర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 5 గుడిసెలు పూర్తిగా దగ్దమయ్యాయి. గుడిసెవాసులు ఉగాది పండుగకు తెచ్చుకున్న సరుకులు, కొత్త బట్టలతో పాటు ఇంట్లోని అన్ని వస్తువులు కాలిపోయాయి. ప్రాణ నష్టం సంభవించకపోయినప్పటికీ.. గుడిసెవాసులు కట్టుబట్టలతో నిర్వాసితులయ్యారు. 

ఈ నేపథ్యంలో వారు సాయం కోసం ఎదురుచూస్తుండగా మిత్రాశర్మ టీమ్ స్పందించి.. నందమూరి అభిమానులతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నష్టపోయినవారికి ఒక్కొక్కరికి 25కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు, దుస్తులు, దుప్పట్లు అందజేశారు. ఇందులో నందమూరి అభిమానులు, మిత్రా శర్మ  (Mitraaw Sharma) తరపున కోట్ల తిమ్మారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిమ్మారెడ్డి మాట్లాడుతూ.. మిత్రాశర్మకు ధన్యవాదాలు తెలిపారు. సరైన సమయంలో స్పందించి ఆ కుటుంబాలను ఆదుకున్నారని కొనియాడారు. 

మిత్రాశర్మ తరపున సహాయకుడు రాజు మాట్లాడుతూ.. నిర్వాసితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా, ఇప్పటివరకు మిత్రాశర్మ తన పేరును బయటపెట్టకుండా ఎన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక, ఇప్పుడు ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పటికీ తన టీమ్ సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తుండటం విశేషం. 

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!