Suma Kanakala: యాంక‌ర్ సుమ పంచుల వ‌ర్షం.. ప‌రువు తీసేసిన జోగి బ్ర‌ద‌ర్స్!

Updated on May 29, 2022 11:10 AM IST
క్యాష్ ప్రోమో (Cash Promo)
క్యాష్ ప్రోమో (Cash Promo)

తెలుగు బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా త‌న‌ హవాను చూపిస్తూ.. నెంబర్ వన్ గా కొన‌సాగుతోంది ప్రముఖ యాంక‌ర్ సుమ కనకాల (Suma Kanakala). ఆమె ఏ షో చేసినా సక్సెసే అనేంతగా తనదైన శైలిలో యాంకరింగ్‌తో మాయ చేస్తోంది. స్పాంటేనియ‌స్ గా పంచులు వేస్తూ సెలెబ్రిటీలకే చుక్కలు చూపిస్తూ ఉంటుంది. ఫలితంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది ఈ యాంక‌ర్. ఇక, సుమ చేస్తున్న షోలలో క్యాష్ గేమ్ షో కు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంది. ప‌లువురు సెలెబ్రిటీలతో సందడి చేస్తూ ఆమె ముందుండి నడిపే ఈ షోకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణ లభిస్తోంది. దీంతో ప్రతి వారం ఈ షోకు భారీగా రేటింగ్ వ‌స్తోంది. ఇదిలా ఉంటే, ఈ షోలోకి గెస్టులుగా వచ్చిన న‌టులు జోగి బ్రదర్స్.. యాంక‌ర్ సుమ బండారాన్ని బయట పెట్టేశారు. అసలేం జరిగిందో.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మీరే చూసేయండి! 

ప్రముఖ ఛానెల్ ఈటీవీలో చాలా కాలంగా ప్రసారం అవుతున్న క్యాష్ షో (Cash Show) గురించి అందరికీ తెలిసిందే. కామెడీ షోలు అయిన‌ జబర్ధస్త్, ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ తర్వాత ఈ షో అంతటి ప్రేక్షకాదరణను అందుకుంటోంది. పేరుకు గేమ్ షోనే అయినా కామెడీ ప్రధానంగానే రన్ అవుతుండ‌డంతో ఇది సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇక, ఈ కార్యక్రమం ఇంతగా సక్సెస్ అవడానికి ఈ షో హోస్ట్ చేస్తున్న సుమనే కారణం అనవ‌చ్చు. ఇక‌, సుమ‌ తన యాంకరింగ్ ప్రయాణంలో ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు చేసింది. వీటిలో చాలా వరకు షోలు సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అందులో 'క్యాష్' (Cash Show) కూడా ఒకటని తెలిసిందే. బుల్లితెర, వెండితెరకు చెందిన సెలెబ్రిటీలు హాజరయ్యే ఈ షో విజయవంతంగా ప్రసారం అవుతోంది. దీనికి వచ్చిన వారికి సుమ పంచుల‌తో చుక్కలు చూపిస్తూ సందడి చేస్తోంది. వచ్చే శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ఎపిసోడ్ లో టాలీవుడ్‌కు చెందిన సీనియర్ నటులు కాదంబరి కిరణ్, రాగిణి, జోగి నాయుడు, కృష్ణంరాజు గెస్టులుగా వచ్చారు. వీరంద‌రితో సుమ చేసిన సందడి అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ఈ ఎపిసోడ్ లో కొందరిని ఈ సీనియర్ యాంకర్ తనదైన టైమింగ్ పంచుల‌తో ముప్పతిప్పలు పెట్టింది. మామూలుగా చూసుకుంటే క్యాష్ షోలో వచ్చిన సెలెబ్రిటీలకు యాంకర్ సుమ కనకాల పంచ్‌లు వేస్తూ ఆట పట్టిస్తుంటుంది. ఆమె దెబ్బకు అందరూ ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. అయితే, తాజాగా విడుదలైన ప్రోమోలో సెలెబ్రిటీలే ఈ యాంకరమ్మకు చుక్కలు చూపించారు. మరీ ముఖ్యంగా జోగి బ్రదర్స్, కాదంబరి కిరణ్ కూడా ఆమెకు పంచులు వేసి అవాక్కయ్యేలా చేసేశారు.

గెస్టులుగా వచ్చిన (Jogi Brothers) జోగి బ్రదర్స్.. యాంకర్ సుమ గురించి వివరిస్తూ ప్రత్యేకమైన స్కిట్ చేశారు. ఇందులో భాగంగానే వాళ్లిద్దరూ ఆమె వ‌య‌స్సు, సంపాదన, యాంకరింగ్ గురించి తమదైన రీతిలో పంచులు పేల్చారు. కొన్ని సందర్భాల్లోనైతే సుమకు షాకిచ్చే అంశాలను సైతం ప్రస్తావించారు. దీంతో ఈ ఎపిసోడ్ మొత్తం వాళ్లిద్దరి డామినేషన్ ఉన్నట్లు అర్థం అవుతోంది. ఈ ఎపిసోడ్ లో సుమ గురించి స్పెషల్ స్కిట్ చేసిన సమయంలో జోగి బ్రదర్స్ ఆమె పరువు తీసేలా మాట్లాడారు. మరీ ముఖ్యంగా 'సుమ పంచులు అనుకోని వేస్తుందంటావా? అప్పటికప్పుడు వేసేస్తుందా' అని జోగి నాయుడు అడగ్గా.. కృష్ణంరాజు 'సుమ అస్సలు పడుకోదు. రాత్రంతా పంచులన్నీ ప్రాక్టీస్ చేసి.. పొద్దున్నే వేసేస్తది. వాటిని మనం నేర్చుకోలేం' అని బాంబ్ పేలుస్తాడు. ఇక, ఆ త‌ర్వాత‌ జోగి బ్రదర్స్ యాక్టర్ సమీర్ ప్రస్తావన కూడా తీసుకు వచ్చారు. కృష్ణంరాజు ఈ స్కిట్‌లో 'అరేయ్.. సమీర్‌ ఈ క్యాష్ షోకు కాంట్రాక్టర్‌ అని తెలుసా?' అని అడిగాడు.. దీనికి జోగి నాయుడు 'ఏది మన యాక్టర్ సమీరా? అసలు ఎందుకొస్తున్నాడో తెలుసా? సుమ డబ్బులు ఇవ్వడం లేదట. ఏదో ఒకరోజు ఇస్తాదని వస్తున్నాడు' అని పంచ్ వేశాడు. దీంతో అంతా ఫక్కున న‌వ్వేస్తారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!