Breakup Stories : ఊరుకో హృదయమా!!! ప్రేమ గాయం తుడిచేయ్
ప్రేమించిడానికి ఎన్నో కారణాలు ఉన్నట్టే ,విడిపోవడానికి కూడా ఉంటాయి. మనస్పర్థలు, మోసం, చెదిరిన బంధాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ప్రేమించినవారిని మరిచిపోవడం కష్టమే. కానీ అంతమాత్రాన వారు లేకపోతే, జీవితమే లేదు అనుకోవడం మాత్రం పొరపాటే. పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టే.. పాత జ్ఞాపకాల నుంచి బయటకు రావాలి అంటే, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి.
భావోద్వేగాలను అదుపు చేసుకోండి
ప్రేమించిన వారితో విడిపోతే, మనసుకు కష్టంగా ఉంటుంది. ఆ ఫీలింగ్ నుంచి బయటకు రావాలంటే, వారికి దూరంగా ఉండండి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోండి. వారికి ఫోన్ చేయకండి. మెసేజులు పెట్టకండి. మీరు వద్దనుకున్న వారికి, మీరు దూరంగా ఉండటమే మంచిది. ఒక్కోసారి ఎడబాటు కూడా మనకు మంచే చేస్తుంది. కొత్త విషయాలను గురించి ఆలోచించేలా చేస్తుంది. వారి జీవితంలో మీరు లేకుంటే ఉన్న వెలితి.. మీకు వేరే ప్రేమను పంచేలా చేయవచ్చు.
మీ కోసం ఆలోచించండి
మీరు ప్రేమ బాధితులుగా ఉండిపోకండి. ఈ క్రమంలో మిమ్మల్ని ప్రేమ పేరుతో ఇబ్బందులకు గురి చేసిన వారి గురించి ఆలోచించకండి. మీ కాళ్లపై మీరు నిలబడండి. సమాజంలో ఓ గుర్తింపు వచ్చేలా స్థిరపడండి. అప్పుడు ప్రేమ పేరుతో, ఒకప్పుడు మిమ్మల్ని వంచించిన వారే మీ కాళ్ల దగ్గరకు వస్తారు.
బిజీగా ఉండేందుకు ప్రయత్నించండి
మీ ప్రేమ విఫలమైందని బాధపడుతూ కూర్చోవడం కంటే, మిగతా విషయాలపై మీ మనసును లగ్నం చేయడం బెటర్. అందుకే మీ మనసుకు నచ్చిన పనులు ఉంటాయి. మీ కెరీర్ పై దృష్టి పెట్టండి. కొత్త అభిరుచులను అలవాటు చేసుకోండి. బిజీగా మారిపోండి. అంతే తప్ప, మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. ఈ ప్రపంచంలో, ఎవరూ శాశ్వతం కాదు అనే మాటను గుర్తుపెట్టుకోండి. ప్రేమను మరిచిపోవడం కష్టమే.. కానీ ప్రేమే జీవితం కాదని తెలుసుకోండి.