M Ramakrishna Reddy : అభిమానవంతులు, అగ్ని కెరటాలు వంటి సూపర్ హిట్ చిత్రాల నిర్మాత మృతి
టాలీవుడ్ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత ఎం.రామకృష్ణారెడ్డి (M Ramakrishna Reddy) బుధవారం తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన తమిళనాడులోని ఓ ప్రైవేటు హాస్పటిల్‌లో చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆయన మెదడుకి అనుకోకుండా స్ట్రోక్ రావడంతో మరణించారు. రామకృష్ణారెడ్డి మృతిపట్ల ఎందరో చలనచిత్ర ప్రముఖులు తమ సంతాపం తెలిపారు.
ఎం. రామకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా గూడూరు గ్రామంలో 1948 లో సుబ్బరామిరెడ్డి, మస్తానమ్మ దంపతులకు జన్మించారు. మైసూర్ విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన తొలుత సిమెంట్ రేకుల వ్యాపారం చేశారు. లెజండరీ నిర్మాత ఎం.ఎస్.రెడ్డి అందించిన ప్రోత్సాహంతో సినీ నిర్మాణ రంగంలోకి వచ్చారు. 1973 లో కృష్ణంరాజు, రంగనాథ్, శారద, యస్వీ రంగారావు ప్రధాన తారాగణంగా 'అభిమానవంతులు' చిత్రాన్ని నిర్మించారు. ఫటాఫట్ జయలక్ష్మి అనే నటిని తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత కూడా ఈయనే.
వైకుంఠపాళి, మా ఊరి దేవత, సీతాపతి సంసారం, గడుసు పిల్లాడు, అగ్ని కెరటాలు, అల్లుడు గారు జిందాబాద్, మాయగాడు, మూడు ఇళ్ళ ముచ్చట లాంటి సినిమాలు రామకృష్ణారెడ్డికి మంచి పేరు తీసుకొచ్చాయి. ఎక్కువగా కృష్ణ, శోభన్ బాబు, చంద్రమోహన్ లాంటి నటులతో రామకృష్ణారెడ్డి సినిమాలు నిర్మించారు. శ్రీరామకృష్ణా ఫిల్మ్స్ అనే బ్యానర్ పై ఈయన సినిమాలు తెరకెక్కుతూ ఉండేవి. 'అమ్మోరు తల్లి' పేరుతో ఓ తమిళ సినిమాని డబ్బింగ్ కూడా చేశారు ఈయన.