Alluri Movie Review : నిజాయతీ గల ఓ పోలీస్ ఆఫీసర్ లైఫ్ జర్నీ ఈ "అల్లూరి" .. సత్తా చాటిన "శ్రీ విష్ణు"

Updated on Sep 23, 2022 07:38 PM IST
అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదే ఒకే కథ, బ్రోచేవారెవరురా, మెంటల్ మదిలో,  లాంటి సినిమాలతో తన నటన పటిమను చాటిన హీరో శ్రీవిష్ణు (Sree Vishnu)
అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదే ఒకే కథ, బ్రోచేవారెవరురా, మెంటల్ మదిలో, లాంటి సినిమాలతో తన నటన పటిమను చాటిన హీరో శ్రీవిష్ణు (Sree Vishnu)

నటీనటులు : శ్రీవిష్ణు, కాయదు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్, మధుసూదన్ రావు, రిషి 

సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్

నిర్మాత : బెక్కెం వేణుగోపాల్

దర్శకత్వం : ప్రదీప్ వర్మ 

రేటింగ్ : 3/5

అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదే ఒకే కథ, బ్రోచేవారెవరురా, మెంటల్ మదిలో, రాజరాజ చోర లాంటి సినిమాలతో తన నటన పటిమను చాటిన కథానాయకుడు శ్రీవిష్ణు (Sree Vishnu). ఇప్పుడు ఈయన పూర్తిస్థాయి యాక్షన్ సినిమా "అల్లూరి" తో మన ముందుకు వస్తున్నాడు. మరి ఈ సినిమా శ్రీవిష్ణుకు ఎంతవరకు కలిసొస్తుందో మనమూ విశ్లేషిద్దాం

కథ
ఈ సినిమాలో శ్రీవిష్ణు (Sree Vishnu) పోషించిన పాత్ర పేరు అల్లూరి సీతారామరాజు. ఈయన ఓ పోలీస్ అధికారి. నిజాయతీ, ముక్కుసూటితనం వల్ల ఈయన ఎప్పటికప్పుడు ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఒక్కో స్టేషనులో తనకు ఎదురైన ఒక్కో అనుభవం ఏమిటన్నదే ఈ చిత్రకథ. ఓ పోలీస్ అధికారి తన కెరీర్‌లో ఎలాంటి కేసులను డీల్ చేశాడు? వాటి పరిష్కారానికి తనవంతుగా ఎలా కష్టపడ్డాడో ఈ సినిమా తెలియజేస్తుంది. 

సానుకూల అంశాలు
పోలీస్ బ్యాక్ గ్రౌండ్‌లో తెలుగులో సినిమాలు రిలీజ్ కావడం కొత్తేమీ కాదు. అందులో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి. ఎస్పీ పరుశురాం, అంకుశం, పోలీస్ స్టోరీ, రౌడీ ఇన్స్‌పెక్టర్, సూర్య ఐపిఎస్, విక్రమార్కుడు, టెంపర్, ధ్రువ, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. సునీల్, నారా రోహిత్, సుమంత్ లాంటి నటులు కూడా పోలీస్ పాత్రలలో అలరించారు. 

ఇప్పుడు నటుడు శ్రీవిష్ణు (Sree Vishnu) కూడా కచ్చితంగా హిట్ కొట్టాల్సిన సమయంలో, పోలీస్ కథపైనే ఆధారపడ్డాడు. ఆయన అంచనాలకు తగ్గట్టుగానే, దర్శకుడు ప్రదీప్ వర్మ సినిమాను తనదైన స్టైల్‌లో చాలా డిఫరెంట్‌గా తెరకెక్కించాడు. కొన్ని సీన్లను చాలా సహజంగా చిత్రీకరించాడు. ముఖ్యంగా ఫైట్ సీన్లను, యాక్షన్ సన్నివేశాలను సినిమాకు తగ్గట్టుగా డిజైన్ చేశారు. ఇదో ప్లస్ పాయింట్. 

అలాగే శ్రీవిష్ణు ఈ సినిమాలో తన పాత్రకు 100 శాతం పూర్తి న్యాయం చేశాడు. భావోద్వేగ సన్నివేశాలలో, యాక్షన్ ఎపిసోడ్లలో తాను పడిన కష్టం మనకు కనిపిస్తుంది. కథానాయిక కాయదు లోహర్ కూడా మంచి పరిణితితో కూడిన నటనను కనబరిచింది. 

ప్రతికూల అంశాలు
ఈ సినిమా తొలి భాగం బాగా రక్తి కట్టేలా ఉన్నా, సెకండాఫ్ మాత్రం కొంచెం స్లోగా సాగుతుంది. అలాగే కొన్ని లాజిక్ లెస్ సీన్లు, బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయి. అయినా సరే, చివరి అరగంట సినిమా ఊపందుకుంటుంది. 

టెక్నికల్ అంశాలు
ఈ సినిమాను మంచి నిర్మాణ విలువలతో ప్రొడ్యూసర్స్ తెరకెక్కించారు. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. అలాగే సంగీతం కూడా ఈ సినిమాకి ప్రధానమైన బలమే అని చెప్పుకోవాలి. హర్షవర్థన్ రామేశ్వర్‌కు మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి భవిష్యత్తు ఉంది. సినిమాటోగ్రఫీ కూడా సినిమా సబ్జెక్టుకి తగ్గ విధంగానే ఉంది. 

ఫైనల్ వర్డ్ : "అల్లూరి" పాత్రలో శ్రీవిష్ణు కచ్చితంగా మనల్ని ఆకట్టుకుంటాడు. 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!