Ante Sundaraniki Trailer: నవ్వులు పూయిస్తున్న 'అంటే సుందరానికి..' ట్రైలర్!

Updated on Jun 02, 2022 09:44 PM IST
'అంటే సుందరానికి..' మూవీ పోస్టర్స్ (Ante Sundaraniki Movie Posters)
'అంటే సుందరానికి..' మూవీ పోస్టర్స్ (Ante Sundaraniki Movie Posters)

Ante Sundaraniki Trailer: టాలీవుడ్ నాచురల్‌ స్టార్‌ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజిమ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా 'అంటే సుందరానికి'. 'బ్రోచేవారేవరురా', 'మెంటల్ మదిలో' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఫ్యామిలీ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో.. చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ముందుగా ప్రకటించిన సమయానికే.. ఈరోజు సాయంత్రం 6 గంటల మూడు నిమిషాలకు విశాఖపట్నం వేదికగా 'అంటే సుందరానికి' సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నాని, నజ్రియా, వివేక్ ఆత్రేయా.. అంతా యంగ్ టాలెంట్ కలిసి ఓ సినిమా తీస్తున్నారంటేనే.. ఆ మూవీ మీద యూత్‌లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 

2 నిమిషాల 50 సెకన్ల ఈ ట్రైలర్ ఎంతో ఎంటర్టైనింగ్ గా ఉంది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన హీరో.. క్రిస్టియన్ అమ్మాయి ప్రేమలో పడతాడు. రెండు కుటుంబాలు కూడా వారి ప్రేమను అంగీకరించని తెలిసిన హీరో, హీరోయిన్ ఆ తరువాత ఏం చేశారనేదే సినిమా. ఇవే సన్నివేశాలను ట్రైలర్ లో కూడా చూపించారు. 'ఎవరా అమ్మాయి.. హిందుస్ హా, చెప్పిచావరా?' అనే డైలాగుతో ఆరంభం అవుతుంది. 'నాకు పెద్ద కోరికలు ఏమీ లేవండి, నేను కూడా అమెరికా వెళ్లి.. అక్కడినుంచి మా స్నేహితులకు ఫోన్ చేసి నేను కాలిఫోర్నియాలో ఉన్నాను, ఇక్కడ ఈ వర్షాలు ఏంటిరా బాబు అని ఒకేసారి మాట్లాడితే చాలండి'అనే డైలాగ్ అందరిని ఆకట్టుకుంటోంది. 

ట్రైలర్ ప్రారంభం నుండి ఎక్కడా సీరియస్ మోడ్‌లో లేకుండా చివరి వరకు క్లీన్ కామెడీతోనే సాగిపోతుంది. అంటే.. సుందరానికీ ట్రైలర్‌లో మరోసారి క్లీన్ కామెడీతో నవ్వించారు నాని, నజ్రియా. ఇక సపోర్టింగ్ క్యాస్ట్ కూడా కామెడీతో నవ్వించడానికి సిద్ధమయ్యారు. ఎప్పటిలాగానే దర్శకుడు వివేక్ ఆత్రేయా కామెడీ మూవీకి ఓ ఫ్రెష్ టచ్ ఇచ్చినట్టుగా ట్రైలర్‌లో కనిపిస్తోంది. ఈ సినిమాలో నాని 'K.P.V.S.S.P.R సుందర ప్రసాద్' అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళంలో 'ఆదదే సుందర', మలయాళంలో 'ఆహా సుందర' టైటిల్స్‌తో విడుదల చేయనున్నారు. 

టాలీవుడ్‌లోని యంగ్ హీరోల్లో స్పీడ్‌గా సినిమాలు చేసేవారిలో నాని కూడా ఒకరు. మినిమమ్ గ్యారెంటీ హిట్స్‌తో, ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరయిపోయాడు నాని. నాని సినిమా వస్తుందంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసేయొచ్చు అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి అదే విషయన్ని ప్రూవ్ చేయడానికి 'అంటే.. సుందరానికీ'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!