Pratap Pothen: ప్రముఖ నటుడు ప్రతాప్ పోతన్ మృతి .. 'మరో చరిత్ర' సినిమాతో తెలుగులోనూ గుర్తింపు పొందిన స్టార్ !
ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతన్ (Pratap Pothen) కన్నుమూశారు. 70 ఏళ్ల ప్రతాప్ పోతన్ చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ప్రతాప్ చివరిగా మమ్ముటి కథానాయకుడిగా నటించిన 'CBI5 ది బ్రెయిన్' చిత్రంలో నటించారు. దక్షిణాదిలో ప్రతాప్ పోతన్ పేరు చాలా పాపులర్. తమిళ, మలయాళ చిత్రాలతో పాటు తెలుగు సినిమాల్లోనూ ప్రతాప్ పోతన్ నటించి మెప్పించారు. అలాగే నాగార్జున హీరోగా నటించిన 'చైతన్య' చిత్రానికి దర్శకత్వం వహించారు.
ప్రతాప్ సినీ జీవితం
తెలుగులో ప్రతాప్ (Pratap Pothen) కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన 'ఆకలి రాజ్యం', 'కాంచనగంగ', 'మరో చరిత్ర', 'వీడెవడు' లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. 'మరో చరిత్ర'లో ప్రతాప్ పాత్ర ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. థకార, చమరం, 22 ఫిమేల్ కొట్టాయం వంటి సినిమాల్లో ప్రతాప్ పోతన్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ప్రతాప్ పోతన్ చివరగా దర్శకత్వం వహించిన సినిమా 'ఒరు యాత్రమొళి'. 1985లో వచ్చిన 'మీండుమ్ ఒరు కాతల్ కథై' చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా ప్రతాప్ పోతన్ జాతీయ అవార్డు అందుకున్నారు.
ప్రతాప్ పోతన్ తాను నటించిన 'థకారా' సినిమాకి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. అలాగే చమరం (ఉత్తమ నటుడు), రుతుభేదం (ఉత్తమ దర్శకుడు) చిత్రాలకు కూడా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. అలాగే 1985లో రిలీజైన 'మీండుమ్ ఒరు కాతల్ కథై' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఇందిరాగాంధీ అవార్డు అందుకున్నారు ప్రతాప్.
ప్రతాప్ వ్యక్తిగత జీవితం
1985లో ప్రతాప్ పోతన్ (Pratap Pothen) నటి రాధికను వివాహం చేసుకున్నారు. వీరిద్ధరి వివాహ బంధానికి ఒక సంవత్సరంలోనే బ్రేక్ పడింది. రాధిక, ప్రతాప్ పోతన్ 1986లో విడిపోయారు. ఆ తర్వాత ప్రతాప్ 1990లో అమలా సత్యనాథ్‌ను మళ్లీ వివాహం చేసుకున్నారు. వీరి కూతురు పేరు కియా. ప్రతాప్, అమలా సత్యనాథ్‌లు 2012లో విడిపోయారు.
రాధిక గురించి ప్రతాప్ ఏమన్నారంటే..
ప్రతాప్ పోతన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను తెలిపారు. రాధిక (Raadhika Sarathkumar)తో విడాకుల గురించి ప్రస్తావించారు. రాధికాతో విడాకులు తీసుకోవడానికి ప్రత్యేక కారణాలు లేవని..రాధిక మంచి మహిళ అని అన్నారు. ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని చెప్పుకొచ్చారు.
వివాహ జీవితం అందరికీ సరిపడేది కాదని.. ఇద్దరి ఆలోచనలను బట్టి వివాహ బంధం ఉంటుదన్నారు. సినిమాలంటే ప్రతాప్‌కు ప్రాణం. ప్రతాప్ పోతన్ సినిమాలలో నటిస్తూనే, తన చివరి రోజులను గడిపారు.
Read More: ఎన్టీఆర్‌తో నటించాలని ఉంది - రాధిక శరత్ కుమార్