పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వాళ్లందరికీ థ్యాంక్స్: సమంత (Samantha)
‘ఏ మాయ చేశావే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సమంత రుత్ ప్రభు (Samantha). తన అందం, అభినయంతో కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది సమంత. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరి స్టార్ హీరోలతోనూ నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఏప్రిల్ 28న 35వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సమంతకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన వాళ్లందరికీ ధ్యాంక్యూ చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది సమంత. ‘నా పుట్టినరోజున మీరు నా మీద చూపించిన ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు. మీ అందరి సపోర్ట్‌కు, నాపై మీకున్న సానుకూలతకు ఎప్పటికీ కృతజ్ఞురాలిగా ఉంటా. మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఈ ఏడాదిని మరింత ధైర్యంగా ఎదుర్కొనేందుకు మీ అందరూ నాలో ఉత్సాహాన్ని నింపారు’ అని సామ్ పోస్ట్ చేసింది.
విజయ్ దేవరకొండ, సమంత కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో సమంతకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా స్క్రిప్ట్‌లో లేని సన్నివేశాన్ని సమంతతో చెప్పించాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ కలిసి సినిమా చేస్తున్నారు. కాశ్మీర్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇటీవల ప్రారంభమైన షూటింగ్ సెట్స్‌లోనే సమంతతో స్క్రిప్ట్‌లో లేని డైలాగ్స్ చెప్పించి వెరైటీగా విష్ చేశాడు. ఈ విషయం తెలియని సమంత సన్నివేశంలో లీనమై మరీ డైలాగ్స్ చెప్పేసింది. ‘ఎందుకిలా ఉన్నావ్? నేను వెళ్లిపోతున్నందుకా? నువ్వు మా ఊరు వచ్చి.. మా వాళ్లతో మాట్లాడటం కాదు. నేనే మీ వాళ్లతో మాట్లాడి మన పెళ్లికి ఒప్పిస్తా’ అని సమంత డైలాగ్ చెప్తుండగా.. విజయ్ హ్యాపీ బర్త్‌డే అంటూ విష్ చేసి ఆమెను ఆశ్చర్యపరిచాడు.
తర్వాత దర్శకుడు, సాంకేతిక నిపుణులు కేక్ తెచ్చి సమంతతో కట్ చేయించారు. ఈ సర్‌ప్రైజ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సమంత (Samantha), విజయ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాకు ఇప్పటివరకు టైటిల్ ఖరారు కాలేదు. ‘వీడీ 11’ వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.