Movie Review: మ్యూజిక్ డైరెక్టర్ కోటి విలన్‌గా నటించిన ‘పగ పగ పగ’ సినిమా రివ్యూ
సినిమా : పగ పగ పగ
నటీనటులు : అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య, కోటి, బెనర్జీ
నిర్మాత : సత్య నారాయణ సుంకర
దర్శకత్వం : రవి శ్రీ దుర్గా ప్రసాద్
సంగీతం : కోటి
విడుదల తేది : సెప్టెంబర్ 22,2022
రేటింగ్ : 2.5 / 5
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి విలన్‌గా నటించిన సినిమా ‘పగ పగ పగ’. అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్, మూవీ మోషన్ పోస్టర్, కోటి నటించిన క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న పగ పగ పగ సినిమా సెప్టెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కథ ఏంటంటే..
ఈ సినిమా కథ మొత్తం 1985, 90, 2006వ సంవత్సరంలోనే జరుగుతుంది. విజయవాడలోని బెజ్జోనిపేటకు చెందిన జగ్గుభాయ్ (కోటి), కృష్ణ (బెనర్జీ) కాంట్రాక్ట్ కిల్లర్స్. ఒక్కసారి డీల్ కుదుర్చుకుంటే.. ప్రాణాలు పోయినా డీల్ పూర్తి చేస్తారు. ఒక పోలీసు హత్య కేసులో కృష్ణ అరెస్ట్ అవుతారు. ఆ సమయంలో జగ్గూభాయ్‌కి కూతురు సిరి(దీపిక ఆరాధ్య) జన్మిస్తుంది. కృష్ణ ఫ్యామిలీని కంటికి రెప్పలా కాపాడుతానని మాట ఇచ్చిన జగ్గు.. అతను జైలుకు వెళ్లగానే ఆ ఊరి నుంచి పారిపోతాడు. తర్వాత హత్యలు చేయడం మానేసి జగదీష్ ప్రసాద్‌గా పేరు మార్చుకొని బిజినెస్‌మేన్ అవుతాడు.
కృష్ణ ఫ్యామిలీ మాత్రం మరిన్ని కష్టాలు పడుతుంది. కానీ అతని కొడుకు అభి(అభిలాష్) చదువులో రాణిస్తాడు. అభి చదువుకునే కాలేజీలోనే సిరి కూడా చేరుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. జగదీష్ మాత్రం వీళ్ల పెళ్లికి నిరాకరిస్తాడు. దీంతో ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుంటారు. తను గారాబంగా పెంచుకున్న కూతురిని తీసుకెళ్లిన అభిపై పగ పెంచుకుంటారు జగదీష్. అల్లుడిని చంపడానికి ఒక ముఠాతో డీల్ కుదుర్చుకుంటాడు. కానీ కూతురు ప్రెగ్నెన్సీ అని తెలిసి ఆ డీల్‌ని వద్దనుకుంటారు. కానీ ఇంతలోపే ఆ డీల్ చేతులు మారి చివరకు బెజ్జోనిపేటకు చెందిన ఒక వ్యక్తికి చేరుతుంది. అసలు ఆ డీల్ తీసుకున్నది ఎవరు? తన అల్లుడిని కాపాడుకోవడానికి జగదీష్ చేసిన ప్రయత్నం ఏంటి? అభి తండ్రి కృష్ణ చివరకు ఏం చేశారు? అభి ప్రాణాలను ఎవరు రక్షించారు? అనేదే సినిమా కథ.
ఎలా ఉందంటే..
కరోనా తర్వాత ప్రేక్షకులను ఆకర్షించడం, థియేటర్లకు తీసుకురావడం చాలా కష్టంగా మారింది. విభిన్న కథ ఉంటే తప్పితే ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. ఇలాంటి సమయంలో పగ పగ పగ అనే విభిన్నమైన టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు దర్శకుడు రవి శ్రీ దుర్గా ప్రసాద్. దర్శకుడు సెలెక్ట్ చేసుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా, దానిని తెరకెక్కించడంతో అంతగా సక్సెస్ కాలేదు.
ఫస్టాఫ్‌లో కథ అంతగా ఇంటరెస్ట్‌గా అనిపించదు. కాలేజీలో సన్నివేశాలు సరదాగానే సాగుతాయి. అలాగే అభి, సిరిల మధ్య జరిగే సీన్లు బాగానే ఉన్నాయి. జగ్గూభాయ్.. జగదీష్ ప్రసాద్‌గా మారడం, వ్యాపారంలో రాణించడం, కృష్ణ కష్టాలతో బాధపడడం, సిరి, అభి ప్రేమపెళ్లితోనే సినిమా ఫస్టాఫ్ అయిపోతుంది. అసలు కథ అంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. కాంట్రాక్ట్ కిల్లర్‌ని పట్టుకునేందుకు జగ్గుభాయ్ చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా ఉంటాయి. ఈ కథకి పోకిరి సినిమాలోని ఒక సన్నివేశాన్ని లింక్ చేయడం బాగుంది. క్లైమాక్స్ మాత్రం ఊహకు భిన్నంగా, టైటిల్‌కి తగినట్టుగా ఉంది.
ఎవరెలా నటించారంటే..
కెరీర్‌లో మొదటిసారి విలన్ పాత్ర పోషించారు సంగీత దర్శకుడు కోటి. జగ్గూ అలియాస్ జగదీష్ ప్రసాద్ క్యారెక్టర్‌కు ఆయన న్యాయం చేశారు. విలన్‌గా, కూతురికి మంచి నాన్నగా అదరగొట్టేశారు. హీరో అభిలాష్ మొదటి సినిమా అయినా చక్కగా నటించారు. సీరియస్, కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్‌తోఅదరగొట్టేశారు. హీరోయిన్‌గా సిరి పాత్రలో దీపిక మెప్పించారు. బెనర్జీ, కరాటే కల్యాణి, జీవా తమ పరిధిమేరకు నటించారు.
కోటి అందించిన సంగీతం పగ పగ పగ సినిమాకు ప్లస్ అయింది. తనదైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచారు. సినిమా నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్: కథ, కోటి సంగీతం
మైనస్ పాయింట్స్: దర్శకుడు కథను నడిపించిన విధానం, ఫస్టాఫ్‌లో ప్రధాన కథ కనెక్ట్ కాకపోవడం
ఒక్క మాటలో: ప్రేక్షకుడిని ఆకట్టుకోలేని రివెంజ్ స్టోరీ
Read More : Movie Review: సుధీర్‌బాబు (Sudheer Babu) నటించిన ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. భావోద్వేగాల సమ్మోహనం