NTR 30: పాన్ ఇండియా సినిమాగా ఎన్టీఆర్30.. అప్‌డేట్ ఇచ్చేశారు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Junior NTR) తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన కొత్త సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రానుందని తెలిపారు. తాను ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నానంటూ పెద్ద క్లూ కూడా ఇచ్చేశారు.
కల్పిత కథాంశంతో తెరకెక్కిన స్వాతంత్య్ర సమరయోధుల చిత్రం RRR లో.. కొమరం భీమ్ పాత్రలో జీవించాడు ఎన్టీఆర్. ఇదే క్రమంలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ బర్త్ డే సందర్భంగా కొరటాల శివతో తన సిన్మా గురించి ఆయన ఓ కొత్త అప్డేట్ ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ 30 గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
అన్నింటి కన్నా ముఖ్యంగా, 'కత్తి పట్టుకున్న ఎన్టీఆర్.. సముద్రంలో రక్తం అలలై ఎగిసేలా చేసిన సీన్'ను రిలీజ్ చేశారు ఎన్టీఆర్ 30 సినిమా నిర్మాతలు. ఈ వీడియో నిజంగానే అభిమానుల మైండ్ బ్లాక్ చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఎంతో ఇంటెన్సిటీతో ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు, కొరటాల సినిమాలో తూటాల్లా పేలాయనడంలో సందేహం లేదు.
నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ 30 సినిమాను నిర్మిస్తున్నారు. ఆయన సోషల్ మీడియాలో తెలుగు వర్షెన్ వీడియోను కూడా పోస్ట్ చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తానే స్వయంగా హిందీ వర్షన్ వీడియోని ట్వీట్ చేశారు. ఇక యూట్యూబ్‌లో చూస్తే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలలో.. ఎన్టీఆర్ 30 కు సంబంధించిన వీడియో రిలీజైంది. అంటే దక్షిణాదితో పాటు, ఉత్తరాదిలో కూడా ఎన్టీఆర్ సినిమా రచ్చ చేయనుందని చెప్పకనే చెప్పారు చిత్ర యూనిట్. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. యువసుధ బ్యానర్‌పై కళ్యాణ్ రామ్ నిర్మాతగా తన తమ్ముడిని హీరోగా పెట్టి, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ 30 సినిమా డైలాగులు ఎలా ఉన్నాయంటే..
అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు..
అవసరానికి మించి తను ఉండకూడదని..
అప్పుడు భయానికి తెలియాలి..
తాను రావాల్సిన సమయం వచ్చిందని...
వస్తున్నా.
ఇది మచ్చుకు మాత్రమే. ఇలాంటి ఎన్నో అదిరిపోయే డైలాగులతో ఎన్టీఆర్ 30 ఫర్రీ వీడియో రిలీజ్ చేశారు నిర్మాతలు. ఇక ఎన్టీఆర్ తన రెండు వేట కత్తులతో ఎవరిని చంపారు? సముద్రంలో రక్తాన్ని అలలుగా ఎగిసిపడేలా చేసిన ఎన్టీఆర్ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు? కొరటాల శివ డైరెక్షన్‌లో పాన్ ఇండియా లెవెల్‌లో మాస్ సినిమా రిలీజ్ కానుందా? ఈ ప్రశ్నలన్నింటికి ఆన్సర్ దొరకాలంటే కాస్త సమయం వేచి చూడాల్సిందే.