థ్యాంక్యూలో మహేష్‌ ఫ్యాన్‌గా నాగచైతన్య (Naga Chaitanya)

Updated on May 03, 2022 02:40 PM IST
మహేష్‌కు  ఫ్యాన్‌గా నాగచైతన్య (Naga Chaitanya)
మహేష్‌కు ఫ్యాన్‌గా నాగచైతన్య (Naga Chaitanya)

అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు అక్కినేని నాగచైతన్య లవర్‌‌బాయ్‌ క్రేజ్‌తో టాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు. జోష్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చై.. తర్వాత మంచి మంచి సినిమాలతో తొందరగానే స్టార్ హీరో స్టేటస్‌ సంపాదించుకున్నాడు. నాగేశ్వరరావు మనవడిగానే కాకుండా విక్టరీ వెంకటేష్‌ మేనల్లుడిగా కూడా సుపరిచితుడైన చైతన్య.. మాస్‌, యాక్షన్‌, సెంటిమెంట్‌, ఫ్యామిలీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

ఇటీవల లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాల విజయాలతో జోరు మీదున్న నాగచైతన్య Naga Chaitanya).. ప్రస్తుతం విక్రమ్‌ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న థ్యాంక్యూ సినిమాలో నటిస్తున్నాడు. రాశీఖన్నా హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

ఇటీవలే రష్యాలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌తోపాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ సినిమాలో సూపర్‌‌స్టార్ మహేష్‌బాబుకు డై హార్డ్‌ ఫ్యాన్‌గా, హాకీ ప్లేయర్‌‌గా కనిపించనున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో మంగళవారం జరిగే షూటింగ్‌లో ప్రకాష్‌రాజ్‌పై పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని, ఈ సన్నివేశాల్లో చైతన్య ఉండబోడని, అందుకే అతను షూటింగ్‌కు రావడం లేదని చిత్ర యూనిట్‌ తెలిపింది.

హ్యూమర్‌‌, డ్రామా, రొమాంటిక్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొద్దిపాటి యాక్షన్ సన్నివేశాలు కూడా కథలో ఉన్నట్టు సమాచారం. దిల్‌ రాజుకు చెందిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌పై తెరకెక్కుతున్న నాగచైతన్య (Naga Chaitanya ) థ్యాంక్యూ సినిమా విడుదల తేదీపై ఇప్పటివరకు స్పష్టత లేదు. సాధారణ కుటుంబంలో పుట్టిన యువకుడు ప్రపంచ స్థాయిలో బిజినెస్‌ చేసే స్థాయికి ఎలా ఎదిగాడు.  దానికి సహకరించిన వాళ్లకు థ్యాంక్స్‌ చెప్పడం కోసం ఏం చేశాడు అనేది సినిమా కథ అని తెలుస్తోంది. ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రల్లో అవికా గోర్, మాళవికా నాయర్, సుశాంత్‌ రెడ్డి, జబర్దస్త్ సుధీర్‌‌ కనిపించనున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!