బాలకృష్ణతో సినిమా మామూలుగా ఉండదు.. కొత్త బాలయ్యను చూస్తారంటున్న అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)

Updated on May 24, 2022 10:29 AM IST
బాలకృష్ణ, అనిల్ రావిపూడి
బాలకృష్ణ, అనిల్ రావిపూడి

రాజ‌మౌళి త‌ర్వాత కెరీర్‌లో ఫ్లాప్ సినిమా లేని దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఇప్పటివ‌ర‌కు అనిల్‌ డైరెక్షన్ చేసిన సినిమాలు ఆ హీరోల కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. కామెడీ సినిమాలకు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ జోడించి హిట్లు అందుకోవడం అనిల్‌ స్పెషాలిటీ. ప్రస్తుతం అనిల్‌ ద‌ర్శకత్వం వ‌హించిన చిత్రం ఎఫ్‌-3. వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ హీరోలుగా న‌టించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2019లో సంక్రాంతి విన్నర్‌‌గా నిలిచిన సూపర్‌‌హిట్‌ సినిమా ఎఫ్‌-2కు సీక్వెల్‌గా సినిమాను తెరకెక్కించాడు అనిల్. కామెడీ ఎంట‌ర్‌‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం మే27న విడుద‌ల కానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్లు మొద‌లుపెట్టింది. ప్రమోష‌న్లలో భాగంగా అనిల్ రావిపూడి బాల‌కృష్ణ సినిమా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్లడించాడు.

‘బాల‌కృష్ణతో చేయ‌బోయే సినిమా ఒక రేంజ్‌లో ఉంటుంది. కంప్లీట్ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నా. ఒక ‘పోకిరి’,‘గ‌బ్బర్‌సింగ్‌’, ‘అర్జున్‌రెడ్డి’ టైప్‌లో క్యారెక్టర్ ఓరియెంటెడ్ మూవీ. ఈ చిత్రంలో బాల‌య్య 45 సంవ‌త్సరాల మ‌ధ్య వ‌య‌స్సు పాత్రలో న‌టించ‌నున్నాడు. ఫాద‌ర్, డాట‌ర్ ఎమోష‌న్‌తో ఈ సినిమా సాగుతుంది’ అని అనిల్‌ రావిపూడి చెప్పాడు. దాంతో నంద‌మూరి అభిమానులు ఈసారి బాల‌య్య ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడని ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం బాల‌య్య గోపిచంద్ మ‌లినేనితో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇందులో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఇక, ఎఫ్3 సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి చెబుతున్నాడు. అయితే కామెడీతో పాటు ఎఫ్3లో కంటెంట్ కూడా ఉంటుందని హామీ ఇస్తున్నాడీ యంగ్‌ టాలెంటెడ్ డైరెక్టర్. ఎఫ్2 సినిమాలో భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం, అవగాహన రాహిత్యం లాంటి విషయాలపై చర్చించాడు అనిల్. ఎఫ్3లో మనిషికి మనీ ఎంత అవసరం, మనీ బంధాలు మానవ సంబంధాల్ని ఎలా దెబ్బతీస్తున్నాయనే విషయాన్ని చెప్పబోతున్నాడు. ఎఫ్2లో నాజర్​తో సందేశం అందించిన రావిపూడి, ఎఫ్3లో ఆ బాధ్యతను మురళీశర్మకు అప్పగించాడు.

‘ఎఫ్2 బంపర్ హిట్టయిన వెంటనే మనీ కాన్సెప్ట్‌లో ఎఫ్3  కథ అనుకున్నాను. అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. నేను కాన్సెప్ట్‌ అనుకున్న సమయానికి కరోనా స్టార్ట్ అవ్వలేదు. అయితే, కరోనా వచ్చిన తర్వాత డబ్బు విలువ మరింతగా తెలిసొచ్చింది అందరికీ. మనిషి జీవితంలో మనీ ఎంత వరకు ఇంపార్టెంట్ అనే పాయింట్‌ను నిజాయితీగా తెలియజేసేలా సినిమా చేద్దాం అనిపించింది. ఎఫ్2లో ఎంతగా నవ్వించినా మంచి కంటెంట్ కూడా చెప్పాం. అదే విధంగా ఎఫ్3లో కూడా బాగా నవ్విస్తాం, మనీకి సంబంధించి మంచి కంటెంట్ కూడా చెబుతాం. మనిషి జీవితాన్ని డబ్బు ఎలా రూల్ చేస్తోందనేది వివరిస్తాం’ అని చెప్పాడు అనిల్‌ (Anil Ravipudi).

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!