ఆర్మీలో జాయిన్ కావాలనుకుంటున్నారా? ‘మేజర్’ టీమ్ సాయం చేస్తుందని ప్రకటించిన అడివి శేష్ (Adivi Sesh)
ఆర్మీలో చేరాలనుకునే యూత్‌కు తమ వంతు సాయం చేయాలనుకుంటున్నట్లు ‘మేజర్’ చిత్ర యూనిట్ ప్రకటించింది. 26/11 ముంబై ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మేజర్’. అడివి శేష్ (Adivi Sesh) మేజర్ పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా జూన్ 3న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘మేజర్’ సక్సెస్ మీట్ శనివారం జరిగింది.
ఈ కార్యక్రమంలో అడివి శేష్ మాట్లాడుతూ.. సినిమా కోసం పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు. ‘మేజర్’ సినిమా చూసి ఆర్మీలో చేరాలనుకుంటున్నట్లు చాలామంది తనకి మెసేజ్‌లు చేస్తున్నారు. ‘‘ఇండస్ట్రీలో ఓ మాట ఉంది. సినిమా రిలీజైన రోజు వరుసగా ఫోన్ కాల్స్ వస్తే ఆ సినిమా బ్లాక్‌బస్టర్. ఎలాంటి ఫోన్ కాల్స్ రాకుండా కేవలం ‘మీ సినిమా గురించి మంచి టాక్ వింటున్నాం’ అని మెసేజ్‌లు వస్తే సినిమా ఫర్వాలేదని. నిన్నటి నుంచి నా ఫోన్‌కి అస్సలు ఖాళీ లేదు. ఫైనాన్షియల్‌గా, ఎమోషనల్‌గా.. ఎలా చూసుకున్నా ‘మేజర్’ ఇప్పటివరకూ వచ్చిన నా సినిమాలతో పోలిస్తే ఐదు లేదా పది రెట్లు ఎక్కువే సాధించింది. ‘సినిమా హిట్ అయ్యింది కదా ఇంక ప్రశాంతంగా ఉండు’ అని అందరూ చెబుతున్నారు.
ఇంకా ఏదో చేయాలని ఉంది..
కానీ, సందీప్ ఆశయాలను, ఆయన కథను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఇంకా ఏదో చేయాలని ఉంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఆయన స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఇంకా చేస్తా. ఈరోజు ఓ ముగ్గుర్ని నేను బాగా మిస్ అవుతున్నా. సందీప్ వాళ్ల తల్లిదండ్రులు. సినిమా రిలీజ్ అయ్యేవరకూ వాళ్లు నాతోనే ఉన్నారు. నా గురువు అబ్బూరి రవిని ఎంతగానో మిస్ అవుతున్నా. వేరే మీటింగ్స్ ఉండటం వల్ల ఈరోజు ఆయన ఇక్కడికి రాలేకపోయారు. అలాగే నా సోదరి, స్టైలిష్ట్‌ను కూడా ఈరోజు ఇక్కడ మిస్ అవుతున్నా అని శేష్ చెప్పాడు.
మాట ఇస్తున్నాం..
‘మేజర్’ చూసి ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నానని చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారు. అలాంటి వాళ్లందరి కోసం ఇదే మా ‘మేజర్’ ప్రామిస్. ఆర్మీలో జాయిన్ కావాలని కలలు కనేవాళ్లకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఎలా అనేది త్వరలో చెబుతాం. మొదట పదిమందితో ప్రారంభించినా, భవిష్యత్తులో కోట్ల మందికి చేరువవుతుందని అనుకుంటున్నా. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరుతోనే దీన్ని ప్రారంభించాలనుకుంటున్నాను అని అడివి శేష్ వివరించారు.
కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ శశి..
ఇక, ఈ సినిమా దర్శకుడు శశికిరణ్ తిక్కా మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ సమయంలో తన తండ్రి చనిపోయారని చెప్పి భావోద్వేగానికి గురయ్యాడు శశి. సినిమాలో ప్రకాష్‌రాజ్, రేవతిల క్యారెక్టర్లు చూస్తుంటే అందరిలాగే తనకి కూడా తల్లిదండ్రులు గుర్తుకువచ్చారని అన్నాడు.
అడివి శేష్ (Adivi Sesh) సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో నటించిన మేజర్ సినిమా ప్రీమియర్ షోలు దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనల్లో సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు ఉన్నికృష్ణన్ జీవిత కథకు బాగా కనెక్ట్ అయ్యి..ఆయన చేసిన త్యాగానికి పలువురు థియేటర్లలోనే కన్నీళ్లు పెట్టుకుంటున్న, లేచి నిలుచుని ఉన్నికృష్ణన్‌కు సెల్యూట్ చేస్తున్న వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, ఈ సినిమాను అందరూ చూడాలనే ఆలోచనతో టికెట్ రేట్లను కూడా పెంచలేదు.
Read More: ‘మేజర్’ సినిమా టికెట్ల కోసం క్యూలో మహేష్‌బాబు (MaheshBabu).. వీడియో వైరల్