Don Movie: 'డాన్' సినిమా ప్రమోషన్లలో శివకార్తికేయన్, సముద్రఖని!
కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ (Siva Karthikeyan) మెల్ల మెల్లగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన నటించిన ‘రెమో’ ‘వరుణ్ డాక్టర్’ వంటి చిత్రాలు తెలుగులో కూడా మంచి హిట్ అయ్యాయి. త్వరలో టాలీవుడ్ మూవీ ‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్ డైరెక్షన్‌లో ఆయన, ఓ తెలుగు మూవీ కూడా చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే.. శివ కార్తికేయన్ నటించిన తాజా చిత్రం ‘డాన్’ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
శిబి చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‌గా నటించింది. ఇక, ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌కి విక్రయించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 10, 2022న నుంచి ప్రదర్శించబడనున్నట్లు తెలుస్తోంది.
కానీ, మేకర్స్ లేదా OTT ప్లాట్‌ఫారమ్ నుంచి ఇప్పటివరకైతే అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. లైకా ప్రొడక్షన్స్, శివకార్తికేయన్ (Siva Karthikeyan) ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ హిట్ మూవీలో ఎస్ జె సూర్య, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. కాగా, సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో, రోజురోజుకీ తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్లు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.1.30 కోట్ల షేర్‌ను రాబట్టింది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) చిత్రంతో పోటీగా 'డాన్' విడుదలైంది. అయితే, ఆ సినిమా టికెట్ రేట్లు ఎక్కువగా ఉండడంతో, వీకెండ్స్‌లో చాలామంది 'డాన్' చిత్రానికి వెళ్తున్నారు. ఇక, ఈ సినిమాకు మంచి మౌత్ టాక్ రావడం కూడా ప్లస్ అయ్యింది. అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు మరో రూ. 0.48 కోట్లు షేర్‌ను రాబట్టాలి. ఈ మధ్య కాలంలో ఎంతటి భారీ విజయం సాధించినా సినిమాలు అయినా సరే, కేవలం నెల రోజుల్లోనే ఓటీటీలోకి దర్శనమిస్తున్నాయి.