ఎన్టీఆర్ (NTR), రాంచరణ్ (RamCharan) తో కలిసి పనిచేయడం అదృష్టమన్న ప్రేమ్‌రక్షిత్ (Prem Rakshith)
ఆర్‌ఆర్‌ఆర్.. సినిమా ఎంత పాపులర్ అయ్యిందో ఎవరికీ చెప్పనవసరం లేదు. అందులోనూ నాటు నాటు పాటకు వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఇక, ఆ పాటకు ఎన్టీఆర్ (NTR), రాంచరణ్ (RamCharan) చేసిన డ్యాన్స్‌కు థియేటర్‌లో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఆన్‌లైన్‌లో కోట్ల వ్యూస్ సాధించిన నాటు నాటు పాట ఈ మధ్య కాలంలో పాపులర్ అయిన పాటల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఈ పాటకు కొరియోగ్రఫీ చేసింది ప్రేమ్ రక్షిత్.
ఆర్‌ఆర్‌ఆర్‌లో పాటకు కొరియోగ్రఫీ చేయాలని రాజమౌళి అడిగినప్పుడు తాను ఆశ్యర్యపోయానని, దేశంలోని ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్లతో కలిసి పాట చేయబోతున్నందుకు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యానని చెప్పాడు ప్రేమ్ రక్షిత్. అప్పటి నుంచి వారితో ఎటువంటి స్టెప్స్ వేయించాలనే దానిపై కసరత్తు చేశానన్నాడు. వారిద్దరి నుంచి బెస్ట్ పెర్ఫామెన్స్ రాబట్టాలని అనుకున్నానని చెప్పాడు.
లిరిక్స్‌కు తగ్గ స్టెప్స్
సినిమాలో పాట వచ్చే సమయం, దానికి ఉన్న ప్రాధాన్యత, పాటను రాజమౌళి ప్రేమ్‌కు అప్పజెప్పారు. మ్యూజిక్, బీట్, లిరిక్స్‌కు తగ్గట్టుగా పాటలో స్టెప్స్ కంపోజ్ చేశాడు ప్రేమ్. తారక్, చరణ్ సమానంగా డ్యాన్స్ చేసేలా, మూవ్‌మెంట్‌లో ఏ మాత్రం తేడా లేకుండా ఉండేలా పాటను చిత్రీకరించాలని రాజమౌళి చెప్పారట. దానికి తగ్గట్టుగానే ప్రేమ్ పాటను అద్భుతంగా తీశాడు. ముందుగా ఈ పాటకు 100 మంది డ్యాన్సర్లతో చేయించాలని అనుకున్నప్పటికీ, చరణ్, తారక్‌లతోనే చివరికి చేయించారు.
30 రోజులు రిహార్సిల్స్
‘నాటు నాటు’ సాంగ్ చిత్రీకరణ సమయంలో ఇండియాలో కరోనా లాక్‌డౌన్ రూల్స్ ఇంకా అమలులోనే ఉన్నాయి. దీంతో ఆ పాటను ఉక్రెయిన్‌లో షూట్ చేశారు. ఈ పాటలోని 97 డ్యాన్స్ మూవ్‌మెంట్ల కోసం ప్రేమ్ 30 రోజుల సమయం తీసుకున్నారు. స్టెప్స్‌ను తారక్, చరణ్ 30 రోజులు ప్రాక్టీస్ చేశారు. ఆ పాటలోని ఒక్కో స్టెప్‌ను రాజమౌళి జూమ్ చేసి చూసి మరీ ఓకే చేశాడు.
ఛత్రపతి నుంచి రాజమౌళితో..
‘విద్యార్థి’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు (Prem Rakshith). ఆ సినిమా విజయం సాధించకపోవడంతో ఆయనకు ఆశించిన పేరు రాలేదు. ఆ సినిమాలో పాటలు చూసిన రాజమౌళి.. తన కొడుకు కార్తికేయతోపాటు కీరవాణి కొడుకులు సింహా, భైరవలకు కూడా డ్యాన్స్ నేర్పించాలని ఫోన్ చేసి ప్రేమ్‌రక్షిత్‌ను అడిగాడు. దానికి ఒప్పుకున్న ప్రేమ్‌కు.. త్వరలో తాను తీయబోయే ఛత్రపతి సినిమాలో మాస్ సాంగ్‌కు కొన్ని స్టెప్స్ కంపోజ్ చేయాలని రాజమౌళి కోరాడు. రాజమౌళి, ప్రేమ్ రక్షిత్‌ల ప్రయాణం మొదలైంది. ఇప్పటివరకు తెలుగు, తమిళంలో కలిపి సుమారు 70 సినిమాలకు కంపోజ్ చేసిన ప్రేమ్.. చరణ్ నటించిన మగధీర, రంగస్థలం, త్వరలో విడుదల కానున్న ఆచార్యతోపాటు ఎన్టీఆర్ నటించిన యమదొంగ, బృందావనం, శక్తి, దమ్ము సినిమాలకు పనిచేశాడు.
ఆ డబ్బుల కోసం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..
ప్రేమ్ రక్షిత్‌ది జాయింట్ ఫ్యామిలీ. కొన్ని కారణాల వల్ల 1993లో బయటికి వచ్చేశారు. అప్పటినుంచి కుటుంబపోషణ కూడా ఇబ్బంది అయ్యేది. ప్రేమ్ టైలరింగ్ షాప్‌లో పని చేస్తున్న సమయంలో, తన తండ్రి డ్యాన్స్ అసిస్టెంట్‌గా పనిచేసేవారు. ఆయనకు సుందరం మాస్టర్ మంచి ఫ్రెండ్. ఫ్యామిలీ అంతా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా ప్రేమ్‌కు మంచి ఉద్యోగం రాలేదు. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్లో కోచింగ్ తీసుకున్న తర్వాత కూడా సరైన అవకాశాలు రాకపోవడంతో, అప్పుడు డ్యాన్స్ మీద దృష్టిపెట్టాడు ప్రేమ్.
డ్యాన్స్ యూనియన్‌లో మెంబర్‌షిప్ తీసుకున్నాడు. ఫెడరేషన్ నుంచి తన ఫ్యామిలీకి వచ్చే రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా కోసం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఒక వ్యక్తి నుంచి సైకిల్ తీసుకుని తొక్కుకుంటూ.. చెన్నై మెరీనా బీచ్‌కు ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లిన ప్రేమ్‌కు మరో ఆలోచన వచ్చింది. సైకిల్ ఇచ్చిన వ్యక్తి తన తండ్రిని ఇబ్బంది పెడతాడని అనిపించింది. దీంతో వెంటనే వెనక్కి వచ్చి ఆ వ్యక్తికి సైకిల్ తిరిగి ఇచ్చేసి నడుచుకుంటూ మెరీనా బీచ్‌కు బయలుదేరాడు. దారిలో ఉండగా ప్రేమ్‌కు డ్యాన్స్ చేసే అవకాశం వచ్చిందని తండ్రి ఫోన్ చేశాడు. దీంతో ఆత్మహత్య నిర్ణయాన్ని విరమించుకున్న ప్రేమ్.. అప్పటినుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఈ స్థాయికి ఎదిగాడు.
17 ఏండ్ల సినీ ప్రయాణం
17 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో జరిగాయని, చెన్నైలో తన ఫ్యామిలీని వదిలి హైదరాబాద్‌లో ఉండేవాడినని ప్రేమ్ చెప్పాడు. తన కొడుకు పరీక్షత్ బాల్యాన్ని చాలా మిస్ అయ్యానని అన్నాడు. ఈ కాలంలో సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. జీవితంలో కూడా ఎంతో నేర్చుకున్నానని చెప్పాడు ప్రేమ్. తల్లిదండ్రులు, తన భార్య రాజ్యలక్ష్మి సహకారంతోనే సక్పెస్ అయ్యానని ప్రేమ్ రక్షిత్ చెప్పుకొచ్చాడు.