EXCLUSIVE : సినిమా అనేది నా జీవితంలో 5 శాతం మాత్రమే.. మరో 95 శాతం జీవితం ఎవరి కోసమో తెలుసా : ప్రకాష్ రాజ్

Updated on Nov 08, 2022 12:23 AM IST
నేను నటుడిని కావడం వల్లే ఇంతమందితో కలిసి ప్రయాణించే అవకాశం దక్కింది. నన్ను ప్రతీ చోట ప్రేమించే మనుషులు ఉన్నారు : ప్రకాష్ రాజ్
నేను నటుడిని కావడం వల్లే ఇంతమందితో కలిసి ప్రయాణించే అవకాశం దక్కింది. నన్ను ప్రతీ చోట ప్రేమించే మనుషులు ఉన్నారు : ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్ (Prakash Raj).. ఈయన తన జీవితంలో మూడు తరాలను చూశారు. అలాగే ఇండస్ట్రీలో మూడు కాలాల పాటు ఉన్నారు. అయినా ఇంకా తన ప్రస్థానం కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఇదే అంశం పై మాట్లాడారు. ఇంకా ప్రతీ రోజు సెట్స్‌కి వచ్చి పని చేస్తున్నప్పుడు, మీలో ఉత్తేజాన్ని నింపేదేమిటి? ఇండస్ట్రీలో ఇంకా ఏవైనా మార్పులను చూడాలనుకుంటున్నారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. 

"నేను ఈ మాట అంటే చాలామంది నమ్మరు. పైగా నవ్వుతారు కూడా. కానీ సినిమా అనేది నా జీవితంలో 5 శాతం మాత్రమే. మరో 95 శాతం జీవితాన్ని నా కుటుంబం, వ్యవసాయ క్షేత్రం, పిల్లలు, స్నేహితులు, సాహిత్యం మరియు సంగీతాన్ని ఆస్వాదించడం కోసం కేటాయిస్తాను. కానీ నేను నటుడిని కాబట్టి, ఆ పనిని కూడా ప్రేమిస్తాను ! కానీ నాలో ఉత్తేజాన్ని నింపే అంశాలు చాలా ఉన్నాయి. 

నేనెప్పుడో మూడు తరాలను చూసేసి వచ్చి ఇప్పుడు నటుడవ్వలేదు. అలాగే ఒక నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలనే తాపత్రయం కూడా లేదు. కానీ ఈ పని వల్ల ఎప్పటికప్పుడు నేను కొత్త జీవితాన్ని చూస్తుంటాను. కొత్త పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాను. ఈ పని నన్ను కొత్త సరిహద్దుల వైపు దూసుకెళ్లేలా చేస్తుంది. అందుకే నటన అనేది నాలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. 

కనుక నేను ప్రతీ రోజు కొత్తదనాన్ని అన్వేషించడం కోసమే వివిధ పాత్రలకు సైన్ చేస్తుంటాను. కొత్త వాతావరణంలో ఎలా ఇమడాలో ఆలోచిస్తాను. కొత్త సంగీతాన్ని ఆస్వాదిస్తుంటాను. కొత్త లొకేషన్లను చూడాలని కోరుకుంటాను. వివిధ భాషలకు చెందిన నటీనటులు, సహానటులతో కలిసి పనిచేయడం ఒక రకంగా నాకు వరం.

నేను నటుడిని కావడం వల్లే ఇంతమందితో కలిసి ప్రయాణించే అవకాశం దక్కింది. నన్ను ప్రతీ చోట ప్రేమించే మనుషులు ఉన్నారు. పైగా అదే ప్రేమ రోజు రోజుకీ పెరుగుతోంది. నటుడిగా నా చుట్టూ చాలా జీవితం ఉన్నప్పుడు, రోజూ సెట్స్‌కు రావడానికి నాకు ఇబ్బంది ఏముంటుంది?

నేను ఈ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులను కోరుకోవడం లేదు. ఎందుకంటే మార్పు అనేది ఒక్కటే స్థిరంగా ఉంటుంది. జీవితం మీకు చాలా విషయాలను నేర్పిస్తుంది. దాని నుండి మీరు చాలా నేర్చుకుంటారు. ఒక వేళ మీరు నేర్పుకోకపోతే, అది మళ్లీ మళ్లీ మీకు నేర్పడానికి ప్రయత్నిస్తుంది. మనం మార్పును కోరుకోవాలి. పరిస్థితులకు తగ్గట్టు మనల్ని మనం ఎలా మలచుకోవాలో తెలుసుకోవాలి. పనికిరాని చెత్తను బుర్ర నుండి తుడిచేయాలి. ఎప్పటికప్పుడు రిలాక్స్ అవుతూ ఉండాలి" అంటూ ప్రకాష్ రాజ్ "ముఖ్బీర్" వెబ్ సిరీస్ ప్రమోషనల్  ఇంటర్వ్యూలో తన మదిలోని మాటలను పంచుకున్నారు. 

(ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న "ముఖ్బీర్" వెబ్ సిరీస్ త్వరలోనే జీ5 ఓటీటీలో ప్రసారమవుతోంది. శివమ్ నాయర్ ఈ సిరీస్‌కు దర్శకుడు)

 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!