యాడ్స్ వద్దనుకుంటున్న సెలబ్రిటీలు (Celebs)
సమాజంలో ప్రతి దానికి సెలబ్రిటీలు ప్రేరణగా ఉంటారని చాలా మంది చెబుతూ ఉంటారు. కనుక వాళ్ల మాటతీరు, వాళ్లు తీసుకునే నిర్ణయాలు, వారి ప్రవర్తన ప్రభావం సమాజంపై పడుతుంది. అందుకే వాళ్లు చేసే ప్రతి పనిలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సినిమాల్లోనే కాదు బయట, వాళ్లు చేసే యాడ్స్ ప్రభావం కూడా ప్రజలపై ముఖ్యంగా యూత్‌పై చాలా ఎక్కువగా ఉంటుంది. యువతను పక్కదారి పట్టించేలా ఉండే యాడ్స్, వారిని చెడు వ్యసనాలకు బానిసలుగా చేసేలా ఉండే అడ్వర్టైజ్‌మెంట్స్, ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు ఉపక్రమించే యాడ్స్‌కు సెలబ్రిటీలు దూరంగా ఉంటున్నారు.
ఎంతో క్రేజ్ ఉంటేనే కానీ కమర్షియల్ యాడ్లలో నటించాలని సెలబ్రిటీలకు కంపెనీల నుంచి ఆఫర్లు వెళ్లవు. ఎంతో కష్టపడి సినిమా చేస్తే వచ్చే రెమ్యునరేషన్ ఒక యాడ్ చేస్తే చాలా వరకు వచ్చేస్తుంటుంది సెలబ్రిటీలకు. కానీ సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఉండకూడదని చాలామంది యాక్టర్లు భావిస్తున్నారు. ఆ లిస్ట్‌లో ఉన్న కొంతమంది గురించి తెలుసుకుందాం.
ప్రేక్షకులను అలరించడమే నా బాధ్యత: బాలకృష్ణ
ఇండస్ట్రీలో బలమైన బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.. అంతులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా.. సమాజానికి సేవ చేయడానికి మాత్రమే దానిని ఉపయోగించుకుంటాడు బాలకృష్ణ (BalaKrishna). ఎన్నో ఏళ్లుగా ఆయన సినిమాల్లో నటిస్తున్నా ఇప్పటివరకు ఏ టీవీ, పేపర్ యాడ్స్‌లో ఆయన కనిపించలేదు. ఎటువంటి బ్రాండ్‌కు మద్దతు ఇవ్వలేదు. నాన్న ఎన్టీఆర్ ఎటువంటి ప్రకటనల్లోనూ కనిపించలేదని, ఆయన బాటలోనే తాను కూడా నడుస్తున్నానని బాలయ్య ఒకసారి మీడియాతో అన్నారు. నాపై అభిమానం చూపిస్తున్న వారిని మభ్యపెట్టి డబ్బు సంపాదించలేను. సినిమాల్లో నటించడం ద్వారా ప్రేక్షకులను, అభిమానులకు అలరించడం మాత్రమే నటుడిగా నా బాధ్యత. జీవితాంతం నటిస్తానని చెప్పారు
కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన ఐకాన్ స్టార్
కొన్ని ప్రకటనల్లో కనిపిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. తాను చేసే సినిమాల్లాగానే యాడ్స్ సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తాడు. తాను ప్రమోట్ చేసే ప్రొడక్ట్ గురించి ఫ్యాన్స్ ప్రశ్నించేలా ఉండకూడదని భావిస్తాడు అల్లు అర్జున్. పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ఒక యాడ్ చేయాలని ఆ సంస్థ యాజమాన్యం బన్నీని సంప్రదించింది. దానికి కోట్ల రూపాయల పారితోషకాన్ని కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే వాళ్లు ఇచ్చిన ఆఫర్‌ను బన్నీ నిర్మొహమాటంగా తిరస్కరించాడని తెలుస్తోంది.
తప్పుడు సంకేతాలు పంపిస్తుందనే తిరస్కరించానన్న సాయిపల్లవి
తన నటన, డ్యాన్స్‌తో చాలా తక్కువ సమయంలోనే అభిమానులను సంపాదించుకుంది సాయిపల్లవి (Sai Pallavi). మహిళలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం ఉన్న కారణంగా తను కూడా ఒక ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్‌ను తిరస్కరించింది. దాదాపు రూ.2 కోట్లు ఇవ్వడానికి సంస్థ యాజమాన్యం ఆసక్తి కనబరిచినా ఆ ఆఫర్‌ను పల్లవి రిజెక్ట్ చేసినట్టు సమాచారం.
ముందు క్లయింట్ అభిప్రాయాన్ని తెలుసుకుంటానన్న బిగ్ బీ
ఏదైనా ప్రొడక్ట్‌ను ప్రమోట్ చేయడానికి ముందు దాని గురించి తెలుసుకుంటాను. దానిని పరిశీలిస్తాను. పూర్తిగా ఎంక్వైరీ చేస్తాను. క్లయింట్‌ను కలుసుకుని వాళ్ల అభిప్రాయాన్ని అడిగి తెలుసకుంటాను’ అని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అన్నారు. చిన్న పాప అడిగిన ప్రశ్నతో ఒక కూల్‌డ్రింక్ యాడ్‌ను వదులుకున్నానని చెప్పారు అమితాబ్.
ఒప్పందాలను రద్దు చేసుకున్న ఆమిర్
విభిన్నమైన కథలతో అభిమానుల క్రేజ్‌ను సొంతం చేసుకున్న నటుడు ఆమిర్‌ఖాన్ (Aamir Khan). సత్యమేవ జయతే కార్యక్రమం ద్వారా సమాజంలో చాలామందిలో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. సామాజిక కార్యక్రమాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి లగ్జరీ కార్‌కు సంబందించిన యాడ్ అగ్రిమెంట్‌ను తిరస్కరించినట్టు తెలిసింది. సత్యమేవ జయతే ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేయడానికి ముందుగా యాడ్ ఏజెన్సీలతో తాను చేసుకున్న అగ్రిమెంట్లను ఆమిర్ క్యాన్సిల్ చేసుకున్నాడు.
అదే బాటలో మరికొందరు సెలబ్రిటీలు..
ఇక, ఇటీవల మరణించిన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్‌ను తిరస్కరించాడు. తన ఆలోచనలకు వ్యతిరేకంగా ఉండడంతో యాడ్ ఏజెన్సీలు ఇచ్చిన రూ.15 కోట్ల ఆఫర్‌కు సుశాంత్ యాక్సెప్ట్ చేయలేదు. జాత్యహంకారాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయనే కారణంతో ఫెయిర్‌నెస్ క్రీమ్ ఉత్పత్తుల ఎండార్స్‌మెంట్‌ను రణబీర్ కపూర్ కూడా తిరస్కరించాడు. రణదీప్ హుడా, అనుష్క శర్మ (Anushka Sharma) కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాడు. పొగాకు ఉత్పత్తుల ప్రచారానికి వచ్చిన అవకాశాన్ని తిరస్కరించింది సన్నీలియోన్ (Sunny Leone). భవిష్యత్తులో కూడా అటువంటి ఉత్పత్తులను ప్రమోట్ చేయకూడదని సన్నీ నిర్ణయించుకుంది.