Cannes Film Festival 2022: కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో తెలుగు సినిమా సత్తా !
ప్రపంచ సినిమాల పండుగే కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ (Cannes Film Festival 2022). టాలీవుడ్ దిగ్గజాలైన చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్‌లకు ఈసారి ఈ ఉత్సవంలో అరుదైన గౌరవం దక్కింది. వీరి ముగ్గురి చిత్రాలను సెలబ్రిటీ గ్యాలరీలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఇలాంటి అరుదైన గౌరవం దక్కడంతో తెలుగు సినిమా ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో తెలుగు సినిమా అదరగొడుతోంది. మే 17 నుంచి 28 వరకు ఫ్రాన్స్‌లో ప్రపంచ సినిమా వేడుకలు జరుగుతున్నాయి. ఆ వేడుక పేరే కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్. ఇందులో పలు తెలుగు సినిమాల ప్రదర్శనకు చోటు దక్కింది.
వివిధ దేశాల నుండి అనేకమంది సినీ తారలు ఈ వేడుకలకు హాజరవుతున్నారు. రెడ్ కార్పెట్‌పై మెరుస్తున్నారు. ఇక మన దేశం తరఫున అధికారిక ప్రతినిధిగా నటి పూజ హెగ్డే హాజరయ్యారు. అలాగే ప్రముఖ తారలైన దీపికా పదుకొనె, తమన్నా, కమల్ హాసన్.. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో ఇప్పటికే సందడి చేస్తున్నారు. అదేవిధంగా, డిజైనింగ్ డ్రెస్సులతో మన తారలు కొందరు ఫ్రాన్స్‌లో అదరగొడుతున్నారు.
ఈ సారి కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ సంబరాలలో, టాలీవుడ్‌కు కూడా అరుదైన గౌరవం దొరికింది. మన తారల చిత్రాలను కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ గ్యాలరీలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. భారతీయ సినిమాకు చెందిన ప్రముఖుల ఫోటోలతో పాటు, టాలీవుడ్ ప్రముఖులైన ప్రభాస్, రాజమౌళి, చిరంజీవి చిత్రాలను ప్రదర్శించారు. దర్శక ధీరుడు రాజమౌళి ప్రభాస్‌తో తీసిన బాహుబలి ప్రథమ, ద్వితీయ భాగాలను కూడా, కేన్స్ వేడుకల్లో భాగంగా సినీ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు.
కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కు, ఎప్పుడూ బాలీవుడ్ స్టార్లే ఎక్కువగా వెళుతుంటారు. ఈ సారి తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసిన తమన్నా, పూజ హెగ్డే.. అలాగే దక్షిణాది నుంచి కమల్, మాధవన్, రెహమాన్ వెళ్లారు. బాలీవుడ్ నుంచి జ్యూరీ సభ్యురాలిగా దీపికా పదుకొనే కూడా హాజరయ్యారు. భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు రావాలని ఆమె అన్నారు. పది రోజుల పాటు ఫ్రాన్స్‌లో మన భారతీయ తారలు కూడా తళుకులీనుతూ.. సినీ ప్రేమికులకు మరింత వినోదాన్ని పంచుతూ, వారిలో ఉత్సాహాన్ని నింపడం విశేషమే కదా.