అఖండ సినిమా విజయాన్ని నాన్న ఎన్టీఆర్‌‌కు అంకితం చేస్తున్నా : బాలకృష్ణ (BalaKrishna)

Updated on Jun 04, 2022 01:58 PM IST
అఖండ 175 రోజుల వేడుకలో బాలకృష్ణ (BalaKrishna), బోయపాటి
అఖండ 175 రోజుల వేడుకలో బాలకృష్ణ (BalaKrishna), బోయపాటి

కరోనాతో మూతపడిన థియేటర్లు తెరుచుకున్న తర్వాత వాటికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తూ ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేసిన సినిమా బాలకృష్ణ (BalaKrishna) ‘అఖండ’. రిలీజ్ అయిన రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా విజయంతో బోయపాటి – బాలయ్య కాంబినేషన్‌ మళ్లీ హ్యాట్రిక్‌ కొట్టడం విశేషం. ‘అఖండ‘ సినిమా విడుదలై 175 రోజులు పూర్తయినందున, చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్‌‌లో వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ, సినిమా దర్శకుడు బోయపాటి మాట్లాడారు.

ముందుగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘నేను సంపాదించిన విలువైన ఆస్తి అభిమానులు. వాళ్లు నాపై చూపించే ప్రేమ మరువలేనిది. నా తండ్రి, గురువు, దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు నేడు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అఖండ సినిమా సిల్వర్ జూబ్లీ వేడుకలు జరగడం ఆనందంగా ఉంది.ఎన్టీఆర్ వారసుడిగా ఆయన ఆశయాలను, కలలను నిలబెట్టినందుకు గర్వపడుతున్నాను. అఖండ సినిమాను కారణ జన్ముడైన ఎన్టీఆర్‌‌ గారికి అంకితం చేస్తున్నాను.

బాలకృష్ణ (BalaKrishna) అఖండ సినిమా 175 రోజుల పోస్టర్

రామారావు పోషించని పాత్రలంటూ ఏవీ లేవు. ఏ నటుడూ చేయనన్ని క్యారెక్టర్లను ఆయన చేశారు. నాన్నగారు ఎన్టీఆర్‌‌ ఆశిస్సులు ఉన్న కారణంగానే, విభిన్నమైన పాత్రలు పోషించే అవకాశం నాకు కూడా దక్కింది. దర్శకుడు బోయపాటి శ్రీనుపై చాలా నమ్మకం ఉంది. ఒక సినిమా చేసేటప్పుడు చిత్తశుద్దితో పనిచేస్తాం. ఈ సినిమాను చూసి అన్ని వర్గాల ప్రేక్షకులు ఆనందించారు. మీ అభిమానమే నాకు శ్రీరామరక్ష. నేను సంపాదించుకున్న విలువైన ఆస్తి మీ అభిమానమే‘ అని బాలకృష్ణ చెప్పారు.

అనంతరం బోయపాటి మాట్లాడుతూ.. ‘సోదర సమానులైన నందమూరి అభిమానులందరికీ కృతజ్ఞతలు. బాలయ్య, నేను కలిసి చేసిన ‘సింహా’, ‘లెజెండ్‌’తో పాటు.. ఇటీవలే విడుదలైన ‘అఖండ’.. థియేటర్లలో 175 రోజులు ఆడాయి. ఒకే కాంబినేషన్‌లో ఇలా మూడు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయంటే దానికి ప్రధాన కారణం బాలకృష్ణ నాపై పెట్టుకున్న నమ్మకం. మీరు మాపై చూపిస్తున్న అభిమానం. మీ అభిమానానికి కృతజ్ఞత చెప్పాలనే ఉద్దేశంతోనే, బిజీగా ఉన్నప్పటికీ ఈరోజు ఇక్కడికి వచ్చాం. కేవలం పది నిమిషాలు మాత్రమే నేను చెప్పిన కథ విని.. నాపై నమ్మకంతో మూడు సినిమాలు చేసిన బాలయ్యకు (BalaKrishna) కృతజ్ఞతలు. ఆయన నమ్మకాన్ని నిజం చేసినందుకు ఆనందంగా ఉంది. ఈ మూడు సినిమాల విజయాన్ని ఎన్టీఆర్‌కు అంకితం చేస్తున్నా. ఇకపై నేను చేయబోయే చిత్రాలను కూడా ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!