( అంటే సుందరానికి) Ante Sundaraniki: సుందరాంగుడిగా మన 'నాని' చేసే మ్యాజిక్ ఏమిటో?

Updated on Apr 30, 2022 02:29 PM IST
పంచెక‌ట్టుతో నాని (Nani)  సినిమా ప్రమోషన్స్ చేసి... ప్రేక్షకులను ఔరా అనిపించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా ఈ వేస‌విలో విడుద‌ల కానుంది
పంచెక‌ట్టుతో నాని (Nani) సినిమా ప్రమోషన్స్ చేసి... ప్రేక్షకులను ఔరా అనిపించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా ఈ వేస‌విలో విడుద‌ల కానుంది

నేచుర‌ల్ స్టార్ నాని (Nani) న‌టించే సినిమాలంటే చిన్నవారి నుంచి పెద్దవారి వ‌ర‌కు ఇష్ట‌ప‌డ‌ని వారుండ‌రు. ప్ర‌తీ సినిమాలోనూ పక్కా కామెడీ టైమింగ్ ఉండేలా చూసుకుంటాడు.ఇప్పుడు కూడా అలాంటి క‌థ‌తో మనల్ని అల‌రించేందుకు రెడీ అయ్యాడు. పంచె కట్టుకొని మరీ, సినిమా ప్రమోషన్స్ చేసి, ప్రేక్షకులతో ఔరా అనిపించాడు. ఈయన హీరోగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌  'అంటే.. సుందరానికి’' వేస‌విలో విడుద‌ల కానుంది 

చిత్ర విశేషాలు..

హీరో నాని (Nani) లేటేస్ట్ మూవీ ‘అంటే.. సుందరానికి’ . ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవ‌లే తొలిపాట 'ది పంచెకట్టు'  విడుద‌ల అయింది. వివేక్ సాగర్ ఈ చిత్రంలోని పాటలకు సంగీతం అందించారు.  హసిత్ గోలి 'ది పంచెకట్టు' పాటను రాశారు.

ఈ పంచెకట్టు పాట సంగీత ప్రియులని విశేషంగా అలరిస్తోంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత, లెజెండరీ క్లాసికల్ సింగర్ అరుణా సాయిరామ్ ఈ పాటను పాడారు. అలాగే సరదాగా సాగిపోయే  పంచెక‌ట్టు పాట అలనాటి తరాన్ని కూడా  హుషారెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వ‌స్తున్న ఈ సినిమాకి నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మాత‌లు.

డైరెక్టర్ చేస్తున్న మరో కొత్త ప్రయోగం

మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి డిఫరెంట్ సబ్జెక్టులతో ప్రేక్షకులను అలరించిన వివేక్ ఆత్రేయ మరో ప్రయోగాత్మక కథతో మనముందుకు వస్తున్నారు. గుంటూరు వాసి అయిన ఆత్రేయ సినిమాలలోకి రాకముందు చెన్నై ఐబిఎంలో 5 సంవత్సరాలు పనిచేశారు. సినీ రంగంలో రాణించాలనే కోరికతోనే హైదరాబాద్ వచ్చారు.

అప్పటికే పెళ్లిచూపులు లాంటి సూపర్ హిట్ చిత్రాన్నిఅందించిన రాజ్ కందుకూరి ఈయనకు  మెంటల్ మదిలో సినిమాకి గాను తొలి అవకాశం అందించారు. దానికి పాజిటివ్ టాక్ రావడంతో, రెండవ చిత్రం బ్రోచేవారెవరురా సినిమాకి వెంటనే అవకాశం వచ్చింది. అది సక్సెస్ కావడంతో, ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బ్యానరుతో సినిమా చేసే అవకాశం దక్కింది. మరి ఈ సినిమా తన కెరీర్‌ను ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి మరి. 

 

 

హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే?

తమిళ, మలయాళ చిత్రాలలో కథానాయికగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నజ్రియా నజీమ్ ఈ సినిమాలో కూడా కథానాయికగా నటిస్తోంది. ఆర్యతో నటించిన రాజా రాణి చిత్రం ఈమెకు మంచి పేరుతీసుకొచ్చింది.

ఆ తర్వాత మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌ను వివాహమాడాక, కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ తీసుకుంది. మళ్లీ తెలుగు సినిమా అయిన "అంటే సుందరానికి"తో తన కెరీర్ పున ప్రారంభించడం గమనార్హం. 

మ్యూజిక్ విషయానికొస్తే..

పెళ్లి చూపులు లాంటి సూపర్ హిట్ చిత్రానికి సంగీతం అందించిన వివేక్ సాగర్, ఈ సినిమాకి కూడా బాణీలు సమకూర్చారు. సమ్మోహనం, నీ నగరానికి ఏమైంది, బ్రోచేవారెవరురా, ఫలక్ నామా దాస్, రాజ రాజ చోర లాంటి చిత్రాలతో తనకంటూ ఒక స్టైల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు వివేక్ సాగర్. ఈ సినిమాకి కూడా అతడు అందించే సంగీతం శ్రోతలను బాగా ఆకట్టుకుంటుందని ఆశిద్దాం. 

ఏంటీ క‌థ‌?

నాని ఈ చిత్రంలో ఓ బ్రాహ్మ‌ణ అబ్బాయిగా న‌టిస్తున్నాడు. ఓ క్రిస్టియ‌న్ అమ్మాయి ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కూడా వాళ్ళ మ‌త‌మేనని ఇంట్లో వాళ్ల‌కు అబ‌ద్ధాలు చెబుతాడు. ప్రేమించిన అమ్మాయికి బ్రాహ్మ‌ణ పద్దతులు నేర్పించే క్రమంలో నాని ప‌డిన పాట్లు కామెడీగా ఉంటాయి. ఇక త‌ర్వాత జ‌రిగే స్టోరీ ఏంటో థియేట‌ర్ల‌లో జూన్ 10 తేదీన‌ చూడాల్సిందే.టక్ జగదీష్, శ్యామ్ సింఘరాయ్ సినిమాల్లా కాకుండా ‘అంటే.. సుందరానికి’  ఓ మంచి హిట్ ఇస్తుంద‌ని హీరో నాని అభిమానులు కోరుకుంటున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!