‘మేజర్’ సినిమా టికెట్ రేట్లపై అడివి శేష్ (Adivi Sesh) కామెంట్లు.. నెటిజన్లు ఫిదా
26/11 ముంబై ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీసిన సినిమా ‘మేజర్’. సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో నటుడు అడివి శేష్ (Adivi Sesh) నటించడం విశేషం. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా అడివి శేష్ ట్విటర్‌లో తన అభిమానులు, సినీ ప్రేమికులతో చిట్‌చాట్ చేశాడు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు.
‘మనకు తెలియని సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని మేజర్ సినిమాలో చూపించాం. 'క్షణం' 'గూఢచారి', 'ఎవరు' ఈ సినిమాలను మించి 'మేజర్' ఉంటుంది. ఈ సినిమాకు టికెట్ రేట్లు సాధారణంగానే ఉంటాయి. సామాన్యులు చూడాల్సిన అసాధారణ చిత్రమిది’ అని చెప్పాడు అడివి శేష్.
ఇక టికెట్ రేట్లపై అడివి శేష్ ఇచ్చిన క్లారిటీతో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, మురళీ శర్మ, సయీ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ కీలకపాత్రల్లో నటించారు. 'మేజర్' సినిమాను మహేష్‌బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. మే 9న మేజర్ ట్రైలర్ రిలీజై మంచి రెస్పాన్స్‌ను రాబట్టింది.
తెలుగు, హిందీ భాషలలో 'మేజర్' చిత్రం తెరకెక్కింది. అలాగే మలయాళంలో కూడా డబ్ చేసి, విడుదల చేస్తున్నారు. అబ్బూరి రవి ఈ చిత్రానికి సంభాషణలు వ్రాయగా, శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇక వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ బాధ్యతలు స్వీకరించగా, జీ మ్యూజిక్ కంపెనీ లేబుల్ పై ఆడియా సౌండ్ ట్రాక్ రిలీజ్ అయ్యింది.
మేజర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అడివి శేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. తన అసలు పేరు అడివి సన్నీ కృష్ణ అని అమెరికాలో ఉన్నప్పుడు అందరూ సన్నీలియోన్ అని ఏడిపిస్తుండడంతో అడివి శేష్‌గా మార్చుకున్నాను అని చెప్పాడు. అమెరికాలో హీరోగా ఎందుకు ప్రయత్నించలేదన్న ప్రశ్నకు అడివి శేష్ స్పందిస్తూ.. 'అక్కడ భారతీయులకు టెర్రరిస్ట్, పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి.. ఇలాంటి పాత్రలే ఇచ్చేవారు. అక్కడ ఇండియన్ హీరో కాలేడు. ఇప్పుడు కూడా హాలీవుడ్‌లో బాగా పాపులర్ అయిన ఇండియన్స్ కమెడియన్ రోల్స్‌లోనే కనిపిస్తారని అన్నాడు అడివి శేష్ (Adivi Sesh).