Bigg Boss Non Stop: వీడియోలు బయటపెడ‌తా... బిందు మాధ‌వి, యాంక‌ర్ శివపై అఖిల్ సార్థ‌క్ సంచలన వ్యాఖ్యలు!

Updated on May 11, 2022 10:59 PM IST
బిందు మాధ‌వి, యాంక‌ర్ శివ, అఖిల్ సార్థ‌క్ (Bindu Madhavi, Akhil, Shiva)
బిందు మాధ‌వి, యాంక‌ర్ శివ, అఖిల్ సార్థ‌క్ (Bindu Madhavi, Akhil, Shiva)

బిగ్ బాస్.. (Bigg Boss Non Stop) సుదీర్ఘ కాలంగా తన హవాను చూపిస్తోంది ఈ షో. ఇదే క్రమంలో టెలివిజన్ హిస్టరీలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే, ఈ మధ్యకాలంలో తెలుగు వెర్ష‌న్‌కి మాత్రమే అత్యధిక టీఆర్పీ రేటింగ్ దక్కుతోంది. దీంతో నిర్వాహకులు తమ ఓటీటీ వెర్షన్‌లో భాగంగా,  24 గంట‌ల‌ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను మొద‌లుపెట్టారు. దీంతో ఈ షో మరింత జోష్‌తో నడుస్తోంది. అయితే, ఇదే షో ప్ర‌స్తుతం చివరి దశకు చేరుకోవడంతో మరింత రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలో. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అఖిల్ సార్థక్, యాంకర్ శివపై మండిపడ్డాడు. అంతేకాదు, ట్రాక్‌ను లాగుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg Boss Non Stop) తొలి సీజన్ ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజ‌న్లు అన్నిటికంటే, ఇందులో వినూత్నమైన సన్నివేశాలు కనిపించడం విశేషం. అలాగే  కొంత కంటెంట్ కూడా చూపిస్తున్నారు. దీనికితోడు ఈ షో ఇప్పుడు ఆఖరి దశకు చేరుకుంది. దీంతో  మరిన్ని కొత్త టాస్కులు ఇస్తున్నారు. ఫలితంగా ఈ సీజన్ మరింత జనరంజకంగా సాగుతోంది. గ‌త వారం అషూరెడ్డి ఎలిమినేట్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో తాజాగా ఈ వారానికి జరిగిన నామినేషన్ ప్రక్రియను సరికొత్తగా డిజైన్ చేశారు. ఇందులో భాగంగా హౌస్‌లోని కంటెస్టెంట్లు, మిగ‌తా స‌భ్యుల్లో నామినేట్ చేయాలనుకున్నవారిని ముగ్గురిని ఎంచుకోవాలి. వారిని గార్డెన్ ఏరియాలో ఉన్న ఎగ్జిట్ బోర్డు కింద నిల్చోబెట్టి.. అందుకు తగిన కారణాలను చెప్పాలి.

షో చివ‌రికి చేరుకోవ‌డంతో ఈ వారానికి హౌస్‌లో కెప్టెన్ ఎవరూ లేరు. దీంతో ఇంటి స‌భ్యులంద‌రూ నామినేషన్స్‌లో భాగమయ్యారు. టాప్ 5లో ఉండడానికి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అనేది చెప్పాలంటూ ఇచ్చిన టాస్కులో ఎన్నో గొడవలు జరిగాయి. మరీ ముఖ్యంగా బిందు మాధవి చేసిన పని కొందరికి కోపం తెప్పించింది. ఆమె అఖిల్ సార్థక్, నటరాజ్ మాస్టర్, మిత్రా శర్మలను నామినేట్ చేయగా.. వాళ్లంతా ఆమె క్యారెక్టర్‌పై పర్సనల్ ఎటాక్ చేశారు. అలాగే, ఆరియానా-మిత్రాల మధ్య పెద్ద మాటల యుద్దమే జరిగింది. 

అనంత‌రం యాంకర్ శివ.. తన వంతు వచ్చినప్పుడు టాప్ 5లో ఉండేందుకు అఖిల్ సార్థక్, నటరాజ్ మాస్టర్, మిత్రా శర్మలకు అర్హత లేదంటూ వారిని ఎంపిక చేసుకున్నాడు. ఇక‌, వారంద‌రూ యాథావిదిగానే అతడిపై గొడవకు దిగారు. దీంతో శివ వాళ్లకు ధీటుగానే బదులిచ్చాడు. ఈ నామినేషన్స్ ప్రక్రియలో యాంకర్ శివ తనను నామినేట్ చేయగానే.. అఖిల్ సార్థక్‌కు పట్టలేనంత కోపం వచ్చింది. దీంతో శివపై ఎన్నో సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశాడు. 'నువ్వు బయటే ప్లాన్ చేసుకుని వచ్చావు. ఆ విషయం నాకు నీ ఫ్రెండే చెప్పాడు. ఈ విషయాన్ని కావాలంటే నిరూపిస్తాను. బయటకు వెళ్లిన తర్వాత ఫుటేజ్‌తో సహా చూపిస్తాను' అంటూ రెచ్చిపోయాడు. 

అఖిల్ తనను నామినేట్ చేసిన సమయంలో యాంకర్ శివ (Anchor Shiva) సైతం ధీటుగానే స్పందించాడు. 'ఇప్పుడేంటి ! అఖిల్.. అఖిల్ అంటూ నీ పక్కన తిరిగితేనే, నీ దృష్టిలో మంచోళ్లు. ఎప్పటికీ నీ భజన చేస్తూ ఉండాలి. లేకపోతే వాళ్లను టార్గెట్ చేస్తావు. అంతేకదా. ముందు నుంచీ నువ్వు చేసేది ఇదే. ఆ విషయం ఇక్కడ ఉన్న వాళ్లందరికీ తెలుసు. నేను అలా చేయట్లేదని నన్ను నామినేట్ చేశావ్' అన్నాడు.

శివతో గొడవ పడుతోన్న సమయంలోనే అఖిల్ కూడా తన వాగ్దాటిని చూపించాడు.  'నువ్వు మామూలోడివి కాదు. అన్ని పక్కాగా సెట్ చేసుకున్నావు. అంతెందుకు ఎవరితో ఉంటే ప్లస్ అవుతుంది? ఎవరితో ట్రాక్ నడిపితే ప్లస్ అవుతుంది అనేవి చూసుకునే వచ్చావు. అలాగే, ఇప్పుడు హౌస్‌లో కంటిన్యూ అవుతున్నావు' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంటే పరోక్షంగా బిందు, శివల మధ్య నడుస్తున్న ట్రాక్ గురించి ప్రస్తావించాడన్న మాట.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!