Big Boss Season 6: మెయిన్ కంటెస్టెంట్‌గా మారుతున్న కామన్ మ్యాన్ ఆదిరెడ్డి (Adireddy)!
బిగ్‌బాస్ షో (Biggboss Season 6) విజయవంతంగా రన్ అవుతోంది. ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సక్సెస్‌ఫుల్‌గా ఐదు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇటీవలే ఆరో సీజన్ కూడా మొదలై.. టెలివిజన్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ఇప్పుడు ఈ సీజన్ మూడో వారం పూర్తి చేసుకుని.. నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ లేటెస్ట్ సీజన్‌కూ టాలీవుడ్ కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈనెల 4న ఈ రియాలిటీ షో ప్రారంభమైంది. హౌజ్‌లోకి 21 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. వారిలో టాప్–5 పోటీదారుల్లో ఒకడిగా దూసుకెళ్తున్న ఆదిరెడ్డి గురించి, ఆయన నేపథ్యం గురించి వివరించే ప్రత్యేక కథనమిది.
కామన్ మ్యాన్ కప్ గెలిచేనా?
బిగ్‌బాస్ రివ్యూలతో పాపులారిటీ సంపాదించిన ఆదిరెడ్డి (Adireddy) అనే యూట్యూబర్ అదే బిగ్‌బాస్ హౌజ్‌లోకి కామన్ మ్యాన్ గా అడుగుపెట్టారు. ఈసారి హౌజ్‌లో ఓ సామాన్యుడికి ఛాన్స్ ఉందన్న గాసిప్స్ నేపథ్యంలో.. కామన్ మ్యాన్‌గా ఆదిరెడ్డి ఎంట్రీ ఆసక్తిని రేకెత్తించింది. అందుకు తగ్గట్లే తనదైన ఆటతీరుతో టాప్-5 కంటెస్టెంట్లలో ఒకడిగా ఆదిరెడ్డి దూసుకెళ్తున్నారు. మరి ఈ ఆదిరెడ్డి ఎవరు? బిగ్‌బాస్ హౌజ్ (Biggboss Season 6) వరకు ఆయన ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం.
నెల్లూరు జిల్లా, ఉదయగిరిలోని వరికుంటపాడు గ్రామం ఆదిరెడ్డి స్వస్థలం. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయనకు తల్లిదండ్రులతోపాటు అన్న, అక్క, చెల్లి ఉన్నారు. జిల్లా కేంద్రంలోనే డిగ్రీ చదువుతూ లాస్ట్ ఇయర్ మధ్యలోనే మానేశారు. ఆ తర్వాత ఇంజినీరింగ్ చదవాలని నిర్ణయించుకుని, బీటెక్ పూర్తి చేశారు. క్యాంపస్ సెలక్షన్స్‌లో రూ.10 వేల ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారు. అయితే తల్లి హఠాన్మరంతో జాబ్‌లో చేరలేదు. ఆ తర్వాత ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లారు.
బెంగళూరులో జాబ్ చేస్తున్న సమయంలో ఓ ఫ్రెండ్ సలహాతో ఆదిరెడ్డి బిగ్‌బాస్ షోపై సరదా వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా కౌషల్ పై చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. దీంతో తన పేరుతోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఆదిరెడ్డి.. బిగ్‌బాస్ సీజన్లపై విశ్లేషణలు కొనసాగించారు. నెటిజన్ల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తూ వచ్చింది.
అందరి ఫోకస్ ఆదిపైనే
బిగ్‌బాస్ షోపై చేసిన విశ్లేషణలతో వచ్చిన క్రేజ్.. అదే షోలో పాల్గొనే అవకాశాన్ని ఆదిరెడ్డికి కల్పించింది. అయితే ఇన్నాళ్లూ మిగతా కంటెస్టెంట్ల ఆటతీరు, మంచీచెడుల గురించి చెబుతూ వచ్చిన ఆదిరెడ్డిపై ఇప్పుడందరి ఫోకస్ ఉంది. దీనికి తగ్గట్లే ఆదిరెడ్డి (Adireddy) కూడా గేమ్ బాగా ఆడుతుండటం విశేషం. మరి ఈ సామాన్యుడు బిగ్‌బాస్ సీజన్ 6 విజేత అవుతాడేమో చూడాలి.