విభిన్న కథతో రాబోతున్న ‘జాంబీరెడ్డి’ (Zombie Reddy) డైరెక్టర్

Updated on Apr 29, 2022 10:24 PM IST
‘జాంబీరెడ్డి’ (Zombie Reddy) డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
‘జాంబీరెడ్డి’ (Zombie Reddy) డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

కొత్త కథాంశాలతో విభిన్నమైన సినిమాలు తీస్తూ పేరు తెచ్చుకున్న క్రియేటివ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మొదటి సినిమా ‘అ!’తో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ప్రశాంత్.. ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత రాజశేఖర్‌‌తో తీసిన ‘కల్కి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అనంతరం యువ హీరో తేజ సజ్జాతో తెరకెక్కించిన ‘జాంబీరెడ్డి’(Zombie Reddy) సినిమాతో ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్‌‌గా గుర్తింపు పొందాడు.

తెలుగు ప్రేక్షకులకు జాంబీలు అనే కొత్త క్యారెక్టర్లను పరిచయం చేస్తూ హిట్‌ అందుకున్నాడు. అదే విభిన్నమైన ఆలోచనతో ‘అద్భుతం’ సినిమాకు కథ అందించాడు. విభిన్నమైన కథ, కథాంశాలతో తీసిన సినిమాలు కమర్షియల్‌ హిట్‌ అందుకుంటున్నాయి. ప్రస్తుతం ఇదే కొత్త ఆలోచనతో రెండు కొత్త సినిమాల షూటింగ్‌ ప్రారంభిస్తున్నాడు.

జాంబీరెడ్డి వంటి భారీ హిట్‌ తర్వాత తేజ సజ్జా హీరోగా ‘హను–మాన్‌’ అనే పాన్‌ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్. తొలి తెలుగు సూపర్‌‌ హీరో సినిమాగా పేర్కొంటున్నారు. ఈ సినిమా తర్వాత డీవీవీ దానయ్య కొడుకును హీరోగా పరిచయం చేస్తూ ‘అధీరా’ అనే పేరుతో మరో సూపర్‌‌ హీరో మూవీ చేయనున్నాడు ప్రశాంత్.

అధీరా సినిమాను పూర్తి చేసిన తర్వాత ప్రశాంత్‌.. ఒక సరికొత్త కాన్సెప్ట్​తో సినిమా తీయబోతున్నాడని తెలుస్తోంది. వెరైటీ స్క్రిప్ట్​తో మరో కొత్త ప్రయోగం చేయబోతున్నాడని ఇండస్ట్రీ టాక్. ఇప్పటివరకు ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో మాత్రమే టాలీవుడ్‌లో సినిమాలు వచ్చాయి. అయితే ప్రశాంత్ మాత్రం వీటన్నింటికీ భిన్నంగా మరింత మంది హీరోయిన్లతో సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పది మంది హీరోయిన్లతో ప్రశాంత్‌ కథ రాసుకున్నాడు. విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో కథను ప్రేక్షకులకు చెప్పబోతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. పది మంది హీరోయిన్ల పాత్రలను లింక్‌ చేస్తూ డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో కథను ప్రేక్షకులకు చెప్పబోతున్నాడట ప్రశాంత్.

ఇప్పటికే ఒక హీరోయిన్‌ కోసం అనుపమా పరమేశ్వరన్‌ను డైరెక్టర్ ప్రశాంత్‌ సంప్రదించాడని తెలిసింది. కథ విన్న వెంటనే అనుపమ కూడా ఓకే చెప్పిందని ఇండస్ట్రీ టాక్. మిగిలిన తొమ్మిది క్యారెక్టర్ల కోసం కూడా ప్రముఖ హీరోయిన్లనే సంప్రదించే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నాడని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుందని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.

అసలు పది మంది హీరోయిన్లతో సినిమా చేయడం అంటే ఒక విధంగా సాహసమనే చెప్పాలి. ఇప్పటివరకు అంతమంది హీరోయిన్లతో టాలీవుడ్‌లో సినిమా రాలేదు. నిజంగా ప్రశాంత్‌ కొత్త ప్రయత్నం చేయబోతున్నాడనే చెప్పాలి.

విభిన్నమైన కథలతో సినిమాలు చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ప్రశాంత్‌ ఈ సినిమాతో ప్రేక్షకులను ఎలా అలరించబోతున్నాడో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగక తప్పదు. ఈ ప్రయోగంలో సక్సెస్ కావాలని, ‘జాంబీరెడ్డి’ (Zombie Reddy) సినిమాలాగే ఈ సినిమా కూడా విజయవంతం కావాలని ఆశిద్దాం.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!