Tough Love Is Also Love : "అమ్మ మనసుకు అర్థాలెన్నో" .. ప్రేక్షకుల హృదయాలను కట్టి పడేస్తున్న జీ తెలుగు షార్ట్ ఫిల్మ్
తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ప్రముఖ ఛానల్స్‌లో జీ తెలుగు కూడా ఒకటి. ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలకు నాంది పలికిన ఛానల్ ఇది. అలాగే, లెక్కలేనన్ని సీరియల్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది కూడా. ఇక, హుషారెక్కించే షోలతో ఇంటిల్లిపాదిని ఆకట్టుకోవడంలో, జీ తెలుగు ఎప్పుడూ ముందంజలోనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో పలు సరికొత్త ఐడియాలతో "జీ తెలుగు" ముందుకు వెళ్తోంది.
ఇటీవలే మదర్స్ డే సందర్భంగా జీ తెలుగు యాజమాన్యం, యూట్యూబ్‌లో ఓ కాన్సెప్ట్ ఫిలిమ్‌ను విడుదల చేసింది. #ToughLoveIsAlsoLove అనే హ్యాష్ ట్యాగ్‌తో ప్రస్తుతం ఈ ఫిల్మ్ వైరల్ అవుతోంది.
అమ్మ మనసు ఎంత లోతైనదో ఈ లఘుచిత్రాన్ని చూసి మనం తెలుసుకోవచ్చు. అలాగే చిన్నారుల భవిష్యత్తు కోసం, అమ్మ పడే తపన ఎలా ఉంటుందో ? ఆమె అంతరంగపు కోణమేమిటో తెలిపే ఈ చిన్న వీడియో నేటి తరాన్ని కచ్చితంగా ఆలోచింపజేస్తుంది.
జీ తెలుగు విడుదల చేసిన మదర్స్ డే స్పెషల్ కాన్సెప్ట్ ఫిలిమ్, ఓ మంచి సందేశాన్ని అందించింది.
ఆ చిన్నారికి అమ్మంటే చాలా ఇష్టం. అమ్మకు కూడా ఆ బిడ్డంటే వల్లమాలిన ప్రేమ. కానీ ఓ రోజు ఈ చిన్నారితో అమ్మ మాట్లాడడం మానేస్తుంది. అమ్మ మాట్లాడనందుకు చిన్నారి బాధపడతాడు. కానీ ఆ బాధ వెనుక ఆ పసివాడు చేసిన తప్పు కూడా ఉంటుంది. ఓ రోజు ఐస్ క్రీం కోసం అమ్మ పర్సులో నుండి యాభై రూపాయలు తీసుకుంటాడు ఆ డబ్బుతో. దొంగతనంగా ఐస్ క్రీం కొనుక్కోవాలనుకుంటాడు.
కానీ తనకు అమ్మ ప్రేమ గుర్తుకు వస్తుంది. అందుకే, తిరిగి ఆ డబ్బులను తన తల్లి పర్సులో పెట్టేస్తాడు. ఆ పర్సు పక్కనే అతనికి ఓ ఉత్తరం కనిపిస్తుంది. ఆ ఉత్తరంలో... "నువ్వు తీసింది యాభై రూపాయలే. కానీ చేసింది మాత్రం దొంగతనం. నా కొడుకు దొంగ అవడం నాకు ఇష్టం లేదు" అనే మాటలు ఉంటాయి. ఆ లెటర్ చదివిన చిన్నారి తన తప్పు తెలుసుకుంటాడు.
"అమ్మ కఠినమైన మనసు వెనుక కూడా, మన భవిష్యత్తు దాగి ఉంది. పాల పొంగులా కనిపించే ఆమె మనసు వెన్న" అనే సారాంశంతో కూడుకొని ఉన్నదే ఈ కాన్సెప్ట్ ఫిలిమ్ (#ToughLoveIsAlsoLove). ఈ చిత్రం అమ్మలందరి కోసం అంకితం అంటూ మాతృ దినోత్సవ శుభాకాంక్షలను తమ అభిమాన ప్రేక్షకులతో పంచుకుంది జీ తెలుగు. ఇదే లఘుచిత్రంపై ప్రస్తుతం నెటిజన్లు ప్రశంసల కురిపిస్తున్నారు.