సుదీప్ (Kiccha Sudeep) – అజయ్ (Ajay Devgn) మధ్య ట్విట్టర్(Twitter) వార్
సినిమా ప్రమోషన్లు, వాటి కార్యక్రమాల్లో తమ అభిమాన హీరోను వెనకేసుకుని వస్తూ కొందరిపై పలువురు విమర్శలు చేస్తుంటారు. తమ అభిమాన హీరోలపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు ఎదుటి వ్యక్తిపై ఆరోపణలు చేస్తుంటారు. అవి కొన్నిసార్లు హద్దులు దాటుతుంటాయి కూడా. అయితే అవి సినిమా విషయాలకు సంబంధించినవి మాత్రమే అయ్యి ఉంటాయి. అయితే ఇప్పుడు రెండు ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోల మధ్య భాష కోసం వివాదం జరుగుతోంది. హిందీ ఇక జాతీయ భాష కాదని కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) ఒక ఫంక్షన్‌లో కామెంట్ చేశాడు. ఇక ఆ విమర్శలను తిప్పికొడుతూ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) ఘాటుగా స్పందించాడు. కిచ్చా సుదీప్ చేసిన కామెంట్లను ట్విట్టర్ (Twitter) వేదికగా అజయ్ స్పందించాడు.
‘సుదీప్ మేరే భాయ్.. హిందీ ఎంతోకాలంగా జాతీయ భాషగా ఉంది. ఎప్పటికీ ఉంటుంది. హిందీ జాతీయ భాష కానప్పుడు మీ సినిమాలను ఎందుకు హిందీలోకి డబ్బింగ్ చేస్తున్నారు’ అని అజయ్ ట్వీట్ చేశాడు. దీనికి సమాధానంగా కిచ్చా సుదీప్ ట్వీట్ ద్వారా రిప్లై ఇచ్చాడు. ‘అజయ్ సార్.. నేను చెప్పింది మీరు సరిగ్గా అర్ధం చేసుకోలేదని అనుకుంటున్నా. మన దేశంలోని భాషలన్నింటిపైనా నాకు చాలా గౌరవం ఉంది. హిందీ భాషను నేను ప్రేమించాను కాబట్టే దానిని మాట్లాడడం నేర్చుకున్నా. అందుకు మీరు హిందీలో పెట్టిన ట్వీట్‌ను కూడా చదవగలుగుతున్నా. నేను కన్నడలో రిప్లై ఇచ్చి ఉంటే దానిని మీరు చదవగలరా? విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడడం వలనే ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి. మీ దగ్గర నుంచి సమాధానం వచ్చినందుకు సంతోషిస్తున్నా. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగిద్దాం. త్వరలోనే మనిద్దరం కలుసుకోవాలని కోరుకుంటున్నాను’ అని సుదీప్ ట్వీట్ చేశాడు. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య మొదలైన ట్వీట్టర్‌లో (Twitter) వార్ ముగుస్తుందో లేదో చూడాలి.