Mahesh Babu Top Ten Movies: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు టాప్‌ 10 సినిమాలు.. ప్రత్యేకంగా మీకోసం

Updated on Jul 11, 2022 12:12 AM IST
సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు (MaheshBabu) సినిమా పోస్టర్లు
సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు (MaheshBabu) సినిమా పోస్టర్లు

సూపర్‌‌స్టార్ కృష్ణ నటవారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు మహేష్‌బాబు (Mahesh Babu). చిన్ననాటి నుంచే సినిమాల్లో నటిస్తూ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కూడా మంచి మార్కులే కొట్టేశారు మహేష్. 1990లో బాలచంద్రుడు సినిమా తర్వాత దాదాపు 9 సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా మన ముందుకు వచ్చారు ఘట్టమనేని మహేష్‌బాబు. హీరోగా ఇండస్ట్రీకి వచ్చి 23 సంవత్సరాలు పూర్తవుతోన్న సందర్భంగా మహేష్‌బాబు కెరీర్‌‌లో టాప్‌ టెన్‌ సినిమాలపై ఒక లుక్కేద్దాం..

మహేష్‌బాబు (MaheshBabu) మురారి సినిమా పోస్టర్

మురారి

రాజకుమారుడు సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన మహేష్‌బాబుకు స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టిన సినిమా ‘మురారి’. కృష్ణవంశీ దర్శకత్వంలో 2001లో విడుదలైన మురారి సినిమాలో నటనకుగాను మహేష్‌బాబు.. స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు. సోనాలీ బింద్రే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో గొల్లపూడి మారుతీరావు, కైకాల సత్యనారాయణ, లక్ష్మి, సుకుమారి కీలకపాత్రలు పోషించారు.

మహేష్‌బాబు కుటుంబానికి సంబంధించిన పూర్వీకులు అమ్మవారి నగల కోసం చేసిన పొరపాటు కారణంగా ఆ వంశాన్ని శాపం వెంటాడుతూ ఉంటుంది. దాని కారణంగా ప్రతి 48 సంవత్సరాలకు ఒకరు మరణిస్తూ ఉంటారు. ఈసారి మరణించేది మహేష్‌బాబు అని జాతకం ద్వారా తెలుసుకుంటారు. దానిని తప్పించేందుకు మహేష్‌ కుటుంబం ఏం చేసింది.. సోనాలీ బింద్రేను ప్రేమించిన మహేష్‌ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నారు అనేది సినిమా కథ.

మహేష్‌బాబు (MaheshBabu) ఒక్కడు సినిమా పోస్టర్

ఒక్కడు

గుణశేఖర్‌‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్కడు సినిమా మహేష్‌ కెరీర్‌‌ గ్రాఫ్‌ను అమాంతం పెంచేసింది. ఎంఎస్‌ రాజు నిర్మాతగా తెరకెక్కించిన ఈ సినిమాలో భూమిక హీరోయిన్‌గా నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఒక్కడు సినిమా జనవరి 15, 2003లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 8 నంది అవార్డులను గెలుచుకుంది. సుమారు 13 కోట్ల ఖర్చుతో తెరకెక్కించిన ఒక్కడు సినిమా దాదాపు రూ.30 కోట్లు వసూలు చేసింది.

కబడ్డీ ప్లేయర్ అయిన మహేష్‌బాబు.. స్టేట్‌ లెవెల్ టోర్నీ కోసం కర్నూల్ వెళ్తాడు. కర్నూల్‌లో ఫ్యాక్షన్ లీడర్ ప్రకాష్‌రాజ్‌ హీరోయిన్‌ భూమికను ప్రేమిస్తాడు. ప్రకాష్‌రాజ్‌ నుంచి తప్పించుకుని పారిపోతున్న భూమికను పట్టుకుని తీసుకెళుతుంటాడు ప్రకాష్‌రాజ్. ఇది గమనించిన మహేష్‌బాబు కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర ప్రకాష్‌రాజ్‌ను కొట్టి భూమికను కాపాడుతాడు. అక్కడి నుంచి మహేష్‌, భూమిక పారిపోతారు. ప్రకాష్‌రాజ్‌ నుంచి భూమికను ఎలా కాపాడుతాడు? కబడ్డీ పోటీలో గెలుస్తాడా? అనేది సినిమా కథ.

మహేష్‌బాబు (MaheshBabu) అతడు సినిమా పోస్టర్

అతడు

 మహేష్‌బాబు – త్రివిక్రమ్ కాంబినేష్‌లో వచ్చిన మొదటి సినిమా ‘అతడు’. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా జయభేరి ఆర్ట్స్‌ బ్యానర్‌‌పై తెరకెక్కింది. సోనూ సూద్, నాజర్, ప్రకాష్‌రాజ్, కోటా శ్రీనివాసరావు కీలకపాత్రలు పోషించారు. 2005 ఆగస్టు 10వ తేదీన విడుదలైన అతడు సినిమాకు మూడు నంది అవార్డులు దక్కాయి.

మహేష్‌బాబు (MaheshBabu) పోకిరి సినిమా పోస్టర్

పోకిరి

మహేష్‌బాబుకు సూపర్‌‌స్టార్ ఇమేజ్‌ను తీసుకొచ్చిన సినిమా పోకిరి. అంతేకాదు తెలుగు సినిమా స్టానిమాను కూడా ఈ సినిమా అమాంతం పెంచేసింది. పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా 2006 ఏప్రిల్ 28వ తేదీన విడుదలై రికార్డులను సృష్టించింది. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. సుమారు రూ.10 కోట్ల ఖర్చుతో తెరకెక్కించిన ఈ సినిమా రూ.60 కోట్లు వసూలు చేసింది.

మహేష్‌బాబు (MaheshBabu) బిజినెస్‌మేన్ సినిమా పోస్టర్

బిజినెస్‌మేన్

పోకిరి వంటి బ్లాక్ బస్టర్‌‌ హిట్ తర్వాత మహేష్‌బాబు – పూరీ జగన్నాథ్​ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా బిజినెస్‌మేన్. మహేష్‌ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎస్‌ఎస్‌ థమన్ సంగీతం అందించిన బిజినెస్‌మేన్ సినిమాలో ప్రకాష్‌రాజ్‌, నాజర్ కీలకపాత్రల్లో నటించారు. 2012, జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మహేష్‌బాబు (MaheshBabu) దూకుడు సినిమా పోస్టర్

దూకుడు

పోకిరి, బిజినెస్‌మేన్ వంటి మాస్‌ ఎంటర్‌‌టైనర్లు చేసి హిట్లు అందుకున్న మహేష్‌బాబు.. డిఫరెంట్‌ రోల్‌లో నటించిన సినిమా దూకుడు. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించారు. 2011, సెప్టెంబర్‌‌ 23న రిలీజైన ఈ సినిమా సూపర్‌‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దాదాపు రూ.35 కోట్లతో తెరకెక్కిన దూకుడు సినిమా సుమారురూ.100 కోట్లు వసూలు చేసింది.

మహేష్‌బాబు (MaheshBabu)  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా పోస్టర్

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

విక్టరీ వెంకటేష్, సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు నటించిన టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా. 2013, జనవరి 11వ తేదీన విడుదలైన ఈ సినిమా సినీ ప్రేమికులతో పాటు మహేష్‌బాబు, వెంకటేష్‌ అభిమానులను అలరించింది. సమంత, అంజలి హీరోయిన్లుగా నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నాలుగు నంది అవార్డులను దక్కించుకుంది.

మహేష్‌బాబు (MaheshBabu)  భరత్‌ అనే నేను సినిమా పోస్టర్

భరత్‌ అనే నేను

యాక్షన్‌, సామాజిక బాధ్యత, ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌ సినిమాలు చేసిన మహేష్‌బాబు మొదటిసారి రాజకీయ నేపథ్యం ఉన్న కథను సెలెక్ట్ చేసుకున్నారు. శ్రీమంతుడు వంటి హిట్‌ సినిమా తర్వాత కొరటాల శివతో చేసిన రెండో సినిమా భరత్‌ అనే నేను. కియారా ఆడ్వాణీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా 2018, ఏప్రిల్‌ 20వ తేదీన రిలీజైంది. ప్రకాష్‌రాజ్, శరత్‌ కుమార్ కీలకపాత్రల్లో నటించారు.

మహేష్‌బాబు (MaheshBabu)  మహర్షి  సినిమా పోస్టర్

మహర్షి

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు నటించిన సినిమా మహర్షి. వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా బ్యానర్లపై తెరకెక్కిన మహర్షి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అల్లరి నరేష్‌ కీలకపాత్రలో నటించాడు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్. దాదాపు 100 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన మహర్షి సినిమా 2019, మే 9వ తేదీన విడుదలై రూ.200 కోట్ల వరకు వసూలు చేసింది.

మహేష్‌బాబు (MaheshBabu)  సరిలేరు నీకెవ్వరు  సినిమా పోస్టర్

సరిలేరు నీకెవ్వరు

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మహేష్‌బాబు మేజర్‌‌ రోల్‌లో నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో రష్మికా మందాన హీరోయిన్‌గా నటించారు. లేడీ సూపర్‌‌స్టార్ విజయశాంతి చాలా కాలం తర్వాత నటించిన సినిమా ఇది. ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా 2020, జనవరి 11వ తేదీన రిలీజైంది. రూ.75 కోట్ల ఖర్చుతో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపుగా రూ.260 కోట్లు కలెక్ట్‌ చేసింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!