R. Narayanamurthy: టాలీవుడ్ పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తికి మాతృ వియోగం.. తల్లి చిట్టెమ్మ మృతి !

Updated on Jul 06, 2022 09:26 PM IST
ఆర్. నారాయణ్ మూర్తి, అతని తల్లి చిట్టెమ్మ (R. Narayana Murthy and His Mother Chittemma)
ఆర్. నారాయణ్ మూర్తి, అతని తల్లి చిట్టెమ్మ (R. Narayana Murthy and His Mother Chittemma)

ప్రముఖ సినీ నటుడు, దర్శకనిర్మాత, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి (R. Narayanamurthy) ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వృద్దాప్య సంబంధ అనారోగ్యంతో ఆమె కొద్దికాలంగా బాధపడుతున్నారు. కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆమె మృతి చెందారు.

ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. మరికొంతమంది నేరుగా నారాయణమూర్తి ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు. 

విజయనగరం జిల్లాలో సినిమా షూటింగ్‌లో ఉన్న చిట్టెమ్మ కుమారుడు ఆర్‌.నారాయణమూర్తి, ఈ విషయం తెలుసుకున్న వెంటనే బుధవారం స్వస్థలం రౌతులపూడి మండలం మల్లంపేట చేరుకున్నారు.

తల్లి పార్థివదేహాన్ని సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు. మల్లంపేటలో మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు.  ఆ ఊర్లో ఎన్నో సేవా కార్యక్రమాలను చిట్టెమ్మ (R.Narayanamurthy Mother) దగ్గరుండి నిర్వహించారట. దీంతో ఊరంతా తీవ్ర విషాదంలో మునిగింది. 

కాగా, నారాయణమూర్తి (R. Narayanamurthy) తల్లి రెడ్డి చిట్టెమ్మకు మొత్తం ఏడుగురు సంతానం. నలుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగ పిల్లలు. వారిలో మూడవ కొడుకు ఆర్.నారాయణ మూర్తి. ఆర్. నారాయణ మూర్తి అసలు పేరు రెడ్డి నారాయణ మూర్తి. అయితే వాళ్ళ ఊరిలో అందరు ఆయనను రెడ్డి బాబు అని పిలుస్తారట.

ఆర్.నారాయణమూర్తి మహారాణి కాలేజీలో చదువుతున్నపుడు కళాశాల ప్రెసిడెంట్‌గా పనిచేసి విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనేవాడు. అప్పట్లోనే ఎంతో చురుకుగా ఉంటూ, కమ్యూనిజం భావజాలంతో ముందుకెళ్ళేవారు నారాయణ మూర్తి.

నారాయణమూర్తి (R. Narayanamurthy) ఇంటర్ చదువుకునే రోజుల్లోనే సినిమాలపై ఉన్న మక్కువతో, మద్రాసు వెళ్లి అక్కడ ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్‌లో తన మార్క్ చూపించారు.

ఇప్పటివరకు నారాయణమూర్తి 35 పైగా సినిమాలలో నటించి పీపుల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకంటూ ప్రత్యేక అభిమాన వర్గం ఉంది. ఎంత సక్సెస్ సాధించినా, ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. సినిమాలే కాక తన ఊర్లో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. పెళ్లి చేసుకోకుండా సినిమాలకి, సమాజానికి ఆయన జీవితాన్ని అంకితమిచ్చారు.

Read More: Megastar Chiranjeevi: 'మెగాస్టార్ చిరంజీవి' పేరు మార్చుకున్నాడా? లేక గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ లో జరిగిన పొరపాటా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!