'ఈనాడు' అధినేత రామోజీరావు (Ramoji Rao) ఆధ్వర్యంలో 'యాక్టింగ్ స్కూల్' ప్రారంభం ! త్వరలో అధికారిక ప్రకటన

Updated on May 27, 2022 03:55 PM IST
రామోజీ ఫిల్మ్‌ సిటీ అధినేత రామోజీరావు
రామోజీ ఫిల్మ్‌ సిటీ అధినేత రామోజీరావు

రెండు తెలుగు రాష్ట్రాలలో షూటింగ్ స్పాట్‌లకు కేరాఫ్ అడ్రస్‌ ఏది? అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రామోజీ ఫిల్మ్ సిటీ. టాలీవుడ్‌తోపాటు అన్ని భాషల సినిమాల షూటింగ్‌లు ఇక్కడే జరుగుతాయి. 'బాహుబలి' వంటి భారీ యాక్షన్ సినిమాల నుంచి పలు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సీరియళ్ల వరకు , అన్నీ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకున్నవే. ఈ ఫిల్మ్ సిటీని చాలా ఏళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ చేస్తున్నారు వ్యాపార దిగ్గజం రామోజీరావు (Ramoji Rao)

కేవలం తెలుగు నటీనటులే కాకుండా.. దేశంలోని అన్ని భాషల నటీనటులు, సాంకేతిక సిబ్బంది రామోజీ ఫిల్మ్ సిటీపైనే ఆధారపడే జీవిస్తున్నారు. వేల మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతోంది. సినిమా క్లాప్ కొట్టిన దగ్గర నుంచి, షూటింగ్ పూర్తయ్యేవరకు.. ఎంత బడ్జెట్‌తో తీసే సినిమానైనా రామోజీ ఫిల్మ్‌ సిటీలో పూర్తి చేసేయవచ్చు. అందుకు తగ్గ సకల సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల నుండి అనేకమంది సీరియల్స్‌లో, సినిమాల్లో వేషాలను పొందడం కోసం హైదరాబాదుకి తరలివస్తున్నారు. అలా ప్రయత్నించే వారికి సరైన అవకాశాలు దక్కడంలేదు. ఈ క్రమంలో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలలో నివసిస్తూ, నటనపై ఆసక్తి ఉన్న వాళ్ల కోసం ఓ యాక్టింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలని రామోజీరావు యోచిస్తున్నారు. దీని కోసం పక్కా ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారని సమాచారం. అదే నిజమైతే, ఇప్పటివరకు ఉన్న యాక్టింగ్ స్కూల్స్‌కు గట్టి పోటీ తప్పదనే చెప్పుకోవాలి.  

యాక్టింగ్ స్కూల్ ఏర్పాటు విషయమై 'తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్' చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇటీవలే నేను రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావును కలిసి మాట్లాడాను. కొత్త వాళ్లకు నటన,  సినీ సాంకేతిక రంగంలో శిక్షణ ఇవ్వడానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 'తెలంగాణ ఫిలిం ఛాంబర్' తరపున కూడా కొంత మంది విద్యార్థులను శిక్షణ కోసం పంపాలని రామోజీరావు కోరారు. రామోజీరావు(Ramoji Rao) ను చూసి అందరూ ఎన్నో విషయాలు నేర్చుకోవాలి' అని ఆయన తెలిపారు. ఇక, రామోజీరావు ప్రారంభించే యాక్టింగ్‌ స్కూల్ ఏర్పాటుపై, త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనుందని సమాచారం.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!