త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో వెంకటేష్ (Venkatesh) నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్.. తర్వాత సినిమాల దర్శకులపై నో క్లారిటీ
కరోనా తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నారు మన హీరోలు. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమా ఓకే చేసేస్తున్నారు. ఇంకొందరు అయితే రెండు, మూడు సినిమాలకు పచ్చ జెండా ఊపేస్తున్నారు. వీలైనంత తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేసే విక్టరీ వెంకటేష్ (Venkatesh) కూడా కరోనా కారణంగా ఒకే సినిమాను రెండు సంవత్సరాలు చేయాల్సి వచ్చింది. దీంతో ఆయన తర్వాతి సినిమాపై ఇప్పటివరకు ఏ విధమైన వార్తలు బయటకు రాలేదు.
వరుణ్‌తేజ్‌తో కలిసి నటించిన ఎఫ్3 శుక్రవారం రిలీజ్ అవుతుండడంతో.. తన తర్వాతి సినిమాలతో పాటు భవిష్యత్‌లో రాబోయే సినిమాలపై కూడా క్లారిటీ ఇచ్చాడు వెంకీ. ఎఫ్3 ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తన తర్వాతి సినిమాల గురించి చెప్పాడు. రెండు సినిమాలు చేయబోతున్నట్టు చెప్పిన వెంకీ వాటికి డైరెక్టర్లు ఎవరనేది మాత్రం చెప్పలేదు. మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లలో సినిమాలు చేయనున్నట్టు తెలిపాడు. ఈ రెండు బ్యానర్లపై చేసే సినిమాలకు డైరెక్టర్లను కన్ఫమ్ చేసే పనిలో ఉన్నానని చెప్పాడు ఈ ఫ్యామిలీ స్టార్.
ఇప్పటికే వెంకటేష్ 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. రానాతో కలిసి వెంకీ.. నెట్‌ఫ్లిక్స్ కోసం ఈ వెబ్ సిరీస్ చేశాడు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత మొదలైన ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇటీవల పూర్తయింది. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. వెంకీని ఇప్పటివరకు యాక్ట్ చేయని క్యారెక్టర్‌లో ఈ సిరీస్‌లో కనిపించనున్నారని టాక్. హిందీ, ఇంగ్లిష్‌లో రూపొందిన ఈ సిరీస్‌లో వెంకీ (Venkatesh) సెన్సార్ డైలాగులు కూడా చెప్పాడని రానా ఇప్పటికే తెలిపాడు.