Tollywood Sequels : టాలీవుడ్‌లో సీక్వెల్స్‌గా వచ్చిన సినిమాలు ఇవే.. త్వరలో మరిన్ని మీకోసం రెడీ !

టాలీవుడ్‌ (Tollywood)లో చాలాకాలం నుంచి సీక్వెల్స్ తెరకెక్కించే ట్రెండ్ ఉంది. సీక్వెల్స్ కూడా హిట్ అవుతుండడంతో ఆసక్తి మరింత పెరిగింది.

టాలీవుడ్‌ ( Tollywood)లో ప్రస్తుతం సీక్వెల్స్‌ హవా నడుస్తోంది. కొన్నేళ్ల క్రితం హాలీవుడ్‌లో సీక్వెల్స్‌ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. తర్వాత బాలీవుడ్‌లో ఈ ట్రెండ్‌ మొదలైంది. దాదాపుగా అన్ని ఇండస్ట్రీలూ సీక్వెల్స్‌ తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ భారీ హిట్‌ కావడంతో సెకండ్‌ పార్ట్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండడంతోపాటు ప్రీ రిలీజ్ బిజినెస్‌ కూడా బాగా జరుగుతుండడం సీక్వెల్స్‌ తెరకెక్కించడానికి కారణం.

టాలీవుడ్‌ ( Tollywood)లో సీక్వెల్స్‌కు భారీగా క్రేజ్ పెరగడానికి ముఖ్య కారణం బాహుబలి. ప్రభాస్ హీరోగా, దగ్గుబాటి రానా విలన్‌గా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించాయి. దాంతో అప్పటివరకు బాలీవుడ్, హాలీవుడ్‌కే పరిమితమైన ఈ ట్రెండ్‌ టాలీవుడ్‌కు అక్కడి నుంచి పలు భాషల్లోని ఇండస్ట్రీలకు కూడా పాకింది. ఇప్పటివరకు టాలీవుడ్‌లో వచ్చిన సీక్వెల్స్‌తోపాటు రాబోతున్న వాటి గురించి తెలుసుకుందాం.

‘శంకర్‌‌దాదా’ సినిమాతో మెగాస్టార్‌‌

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా జయంత్‌ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శంకర్‌‌దాదా ఎంబీబీఎస్. కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ జానర్‌‌లో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర మంచి హంగామా చేసింది. చాలాకాలం తర్వాత చిరంజీవి చేసిన కామెడీకి ఆయన అభిమానులు ఫిదా అయ్యారు కూడా. ఇక, ఈ సినిమాకు సీక్వెల్‌గా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శంకర్‌‌దాదా జిందాబాద్.ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

‘రక్తచరిత్ర’తో ఆర్జీవీ:

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మ (RamGopal Varma)  తెరకెక్కించిన సినిమా రక్తచరిత్ర. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన రక్తచరిత్ర సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కథకు కొనసాగింపుగా రక్తచరిత్ర–2ను తెరకెక్కించారు ఆర్జీవీ. అయితే మొదటి భాగానికి వచ్చిన క్రేజ్‌ రెండో పార్ట్‌కు రాలేదనే చెప్పుకోవాలి. వివేక్‌ ఒబెరాయ్, రాధికా ఆప్టే, సూర్య, ప్రియమణి కీలకపాత్రలు పోషించారు.

‘బాహుబలి’తో రాజమౌళి:

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన అద్భుతమైన సినిమా బాహుబలి (Baahubali). రెబల్‌స్టార్ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన బాహుబలి సినిమా మొదటి భాగం సూపర్‌‌హిట్‌ సాధించింది. మొదటి భాగానికి కొనసాగింపుగా తెరకెక్కించిన బాహుబలి2 సూపర్‌‌డూపర్‌‌ హిట్‌గా నిలిచింది. విడుదలైన అన్ని సెంటర్లలో వసూళ్ల వర్షం కురిపించింది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయి దేశవ్యాప్తం అయ్యిందనే చెప్పాలి. ఈ సినిమాతో రెబల్‌స్టార్ ప్రభాస్ పాన్‌ఇండియా స్టార్‌‌గా ఎదిగారు. దగ్గుబాటి రానా, రమ్యకృష్ణ, అనుష్క, నాజర్, తమన్నా తదితరులు కీలకపాత్రలు పోషించారు.

‘ఆర్య’ సినిమాతో సుకుమార్

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్‌ ఎంటర్‌‌టైనర్‌‌ ఆర్య. ఈ సినిమా అల్లు అర్జున్‌ను స్టార్‌‌ హీరోగా నిలబెట్టింది. ఆర్యకు సీక్వెల్‌గా ఆర్య2 సినిమాను తెరకెక్కించారు సుక్కు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హడావిడి చేయలేకపోయింది. అయితే ఆర్య2 సినిమాలోని నటన, డాన్స్‌కు అల్లు అర్జున్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

విక్టరీ వెంకటేష్‌ ‘దృశ్యం’

విక్టరీ వెంకటేష్‌ (Venkatesh) ప్రధాన పాత్రలో శ్రీప్రియ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దృశ్యం. క్రైమ్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమా హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. మీనా హీరోయిన్‌గా నటించిన దృశ్యం సినిమాలో నరేష్, నదియా, ఎస్తేర్ అనిల్, కృతికా జయకుమార్ కీలకపాత్రలు పోషించారు. మలయాళ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక, దృశ్యం సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కిన దృశ్యం2 కూడా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ సినిమాకు జీతు జోసెఫ్ దర్శకత్వం వహించారు.

‘బంగార్రాజు’గా నాగార్జున

అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా తెరకెక్కిన సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన’. కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌గా రూపొందించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించిన బంగార్రాజు. ఈ సినిమాలో నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా, కృతిశెట్టి హీరోయిన్‌గా నటించారు.

ఎఫ్‌2..ఎఫ్‌3

విక్టరీ వెంకటేష్‌ (Venkatesh), వరుణ్‌ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఎఫ్‌2 సినిమా భారీ హిట్ సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన ఎఫ్‌2 సినిమాకు సీక్వెల్‌ తీశారు దర్శకుడు అనిల్. ఎఫ్‌3 పేరుతో రూపొందిన ఈ సినిమా కూడా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

‘కార్తికేయ’తో నిఖిల్

నిఖిల్ (Nikhil Siddhartha) హీరోగా తెరకెక్కిన సినిమా కార్తికేయ. ఈ సినిమా పాజిటివ్‌ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లనే రాబట్టింది. 2014వ సంవత్సరంలో వచ్చిన కార్తికేయ సినిమాలో కలర్స్ స్వాతి హీరోయిన్‌గా నటించారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా కార్తికేయ2 (Karthikeya2) సినిమా తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. నిఖిల్‌ క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. కార్తికేయ2 సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో కార్తికేయ3 సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు దర్శకనిర్మాతలు. హీరో నిఖిల్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు.

‘పుష్ప’తో మరోసారి సుకుమార్..

పుష్ప (Pushpa) సినిమాతో టాలీవుడ్‌తోపాటు అన్ని భాషల్లోనూ వసూళ్ల వర్షం కురిపించారు సుకుమార్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కించిన పుష్ప సినిమా సూపర్‌‌డూపర్‌ ‌హిట్ అయ్యింది. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో అల్లు అర్జున్‌ ఇమేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారు సుకుమార్. పుష్ప సినిమా తర్వాత పుష్ప2 (Pushpa2) కోసం రెడీ అయ్యారు బన్నీ. పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్‌తో పుష్ప2 సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. రెగ్యులర్ షూటింగ్‌ మొదలైందని టాక్.

‘డీజే టిల్లు’ నుంచి ‘టిల్లు స్క్వేర్‌‌’

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డీజే టిల్లు (DJ Tillu). 2022, ఫిబ్రవరి నెలలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన డీజే టిల్లు యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. నేహా శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కిస్తున్నారు. ‘టిల్లు స్క్వేర్‌‌’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేసింది చిత్ర యూనిట్.

‘హిట్‌’ సీక్వెల్‌గా ‘హిట్‌2’

హిట్‌: ది ఫస్ట్‌ కేస్ పేరుతో విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రైమ్‌ యాక్షన్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ రెడీ అవుతోంది. అడివి శేష్‌ (Adivi Sesh) హీరోగా తెరకెక్కుతున్న హిట్‌: ది సెకండ్ కేస్ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

‘గూఢచారి’ సీక్వెల్‌లోనూ అడివి శేష్‌

డిఫరెంట్ జానర్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న అడివి శేష్‌  మరో సీక్వెల్‌ చేయనున్నారు. శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా గూఢచారి. ఈ సినిమా అడివి శేష్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతేకాకుండా విడుదలైన అన్ని సెంటర్లలోనూ పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. గూఢచారి సినిమాకు సీక్వెల్‌ రాబోతోందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. గూఢచారి సినిమా చేయడానికి అడివి శేష్ (Adivi Sesh) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘రాక్షసుడు’. 2019లో విడుదలైన ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇక, రాంచరణ్ (Ram Charan), సమంత జంటగా సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా రంగస్థలం. ఈ సినిమాకు కూడా సీక్వెల్ రాబోతోందని సమాచారం. దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చి బంపర్‌‌ హిట్ సాధించిన సినిమా అఖండ. ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని టాక్.

మంచు విష్ణు (Vishnu Manchu) హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన కామెడీ ఎంటర్‌‌టైనర్‌‌ ‘ఢీ’. 14 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ  సినిమాకు సీక్వెల్ తెరకెక్కించనున్నట్టు ప్రకటన వచ్చింది. వీటితోపాటు రవితేజ హీరోగా రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించిన 'విక్రమార్కుడు’, రవితేజ (RaviTeja) హీరోగా గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన 'క్రాక్‌', గోపీచంద్‌ (Gopichand) హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వం వహించిన 'లక్ష్యం', తేజ దర్శకత్వం వహించిన 'చిత్రం' మూవీకి సీక్వెల్‌గా 'చిత్రం 1.1', తేజా సజ్జ 'జాంబి రెడ్డి', నవీన్‌ పోలిశెట్టి 'జాతిరత్నాలు, ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ', విశ్వక్‌ సేన్‌ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన 'ఫలక్‌నుమా దాస్‌' చిత్రాలకు కూడా సీక్వెల్స్ రాబోతున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇటీవల నటించిన ‘గాడ్‌ఫాదర్’ (God Father) సినిమాకు సీక్వెల్‌ తీసే ఆలోచన ఉందని దర్శకుడు మోహన్‌రాజా కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మొత్తానికి టాలీవుడ్‌ (Tollywood)లో నయా ట్రెండ్‌ సక్సెస్‌ బాటలోనే పయనిస్తోందని చెప్పచ్చు.

Read More : RRR : తెలుగు సినిమాకు మరో అరుదైన గౌరవం.. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌

You May Also Like These