ఒక ఠాగూర్.. ఒక అపరిచితుడు.. వీరి బాటలోనే రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) కూడా!
లంచగొండితనం, అవినీతి .. ఇవి దేశాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సామాజిక రుగ్మతలు. ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసులలో సామాన్యులకు రోజువారీ ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఇది. ఈ సమస్యను ప్రధానంగా చేసుకొని చాలా చిత్రాలే వచ్చాయి. తెలుగులో ఠాగూర్, తమిళంలో అన్నియన్, హిందీలో రైడ్ లాంటి సినిమాలు అందుకు ఉదాహరణ. చాలామంది హీరోలకు ఈ సబ్జెక్టు ఒక రిస్క్ ఫ్రీ సబ్జెక్టు. ఇప్పుడు వారి బాటలోనే మాస్ మహరాజా రవితేజ (Raviteja) పయనించనున్నారు.
రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty).. టైటిలే చాలా వెరైటీగా ఉంది కదా? మరి సినిమా కూడా అంతే వెరైటీగా ఉండే అవకాశముందని అంటున్నారు సినీ అభిమానులు.
ఈ సినిమా ప్రత్యేకలివే
ఎవరీ శరత్ మండవ?
శరత్ మండవ (Sarat Mandava) ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఓ తమిళ దర్శకుడు. గతంలో నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిథి చిత్రాన్ని తమిళంలో కో 2 పేరుతో రీమేక్ చేశాడు. రచయితగా, సినిమాటోగ్రాఫర్‌గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరుగా.. ఇలా బహుముఖ పాత్రలు పోషించిన దర్శకుడు ఈయన. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన పలు సినిమాలకు ఈయన ఛాయాగ్రహణం వహించారు. అలాగే ప్రభుదేవా, తమన్నా హిందీలో నటించిన ఖామోషీ అనే చిత్రానికి డైలాగ్స్ రాశారు. తమిళ చిత్రం కొలియత్తుర్ కాలమ్‌కు రీమేక్ ఇది. ఎక్కువగా డైరెక్టర్ చక్రి తోలేటితో కలిసి ఈయన పనిచేశారు.
ముఖ్యమైన పాత్రలో వేణు తొట్టెంపుడి
స్వయంవరం, చిరునవ్వుతో, గోపి గోపికా గోదావరి లాంటి సూపర్ హిట్ చిత్రాలలో హీరోగా నటించి.. ఆ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న నటుడు వేణు. ఆయన ఈ చిత్రంలో సీఐ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఈ పాత్ర చాలా కీలకమని టాక్.
మ్యూజిక్ డైరెక్టర్‌గా శ్యామ్ సి.ఎస్
తమిళంలో విక్రమ్ వేదా లాంటి సూపర్ హిట్ సినిమాకి మ్యూజిక్ అందించి.. పలు అవార్డులు అందుకున్న శ్యామ్ సి.ఎస్ ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందింనున్నారు. శ్యామ్ గతంలో మోసగాళ్లు, అర్జున్ సురవరం, నోటా, కణం లాంటి తెలుగు సినిమాలకు కూడా బాణీలు అందించారు.
యాత్ర.. సినిమా తర్వాత
ఖైదీ, మాస్టర్, సుల్తాన్ లాంటి హిట్ తమిళ సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన సత్యన్ సూర్యన్ ఈ సినిమాలో కూడా తన కెమెరాపనితనం చూపించనున్నారు. ఈయన గతంలో వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’కు కెమెరా వర్క్ చేశారు. అదే తెలుగులో సూర్యన్ తొలి సినిమా.
నిజ జీవిత కథా?
ఈ సినిమా పోస్టర్ మీద రైతు ఉద్యమానికి సంబంధించిన సీన్స్ ఉన్నాయి. అలాగే ఈ కథ కొన్ని నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కిస్తున్నారని కూడా వార్తలొచ్చాయి. మరి అది నిజమో కాదో? సినిమా విడుదలయ్యాక గానీ తెలియదు. పడిపడి లేచె మనసు, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇదే నిర్మాత నాని హీరోగా దసరా అనే మరో చిత్రాన్ని కూడా తీస్తున్నారు.