హాలీవుడ్‌లో విషాదం.. ‘హ్యారీ పోటర్’ (Harry Potter) నటుడు రాబీ కోల్ట్రేన్ (Robbie Coltrane) కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబీ కోల్ట్రేన్ (72) కన్నుమూశారు. ‘హ్యారీ పోటర్’ (Harry Potter) సిరీస్ సినిమాలతో రాబీ (Robbie Coltrane) అందరికీ సుపరిచితులే. ఈ చిత్రాల్లో హాగ్రిడ్ పాత్రలో అద్భుతమైన నటనను కనబర్చి.. ప్రపంచ వ్యాప్తంగా ఆయన మంచి గుర్తింపు సాధించారు. పలు ఆరోగ్య కారణాలతో స్కాట్లాండ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాబీ మరణించారు.
రాబీ మరణ వార్తను ఏజెంట్ బెలిందా రైట్ అందరికీ తెలియజేశారు. ‘రాబీ కోల్ట్రేన్ ఓ అద్భుతమైన నటులు. అంతేకాదు ఆయన తెలివైనవారు. రాబీ ఒక చమత్కారి. నేను ఆయన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటా’ అని చెబుతూ బెలిందా ఎమోషనల్ అయ్యారు. రాబీ మృతిపై హాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
రాబీ కోల్ట్రేన్ థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మంచి పేరు రావడంతోపాటు ‘ఫ్లాష్ గార్డాన్’ అనే సినిమాలో ఛాన్స్ దొరికింది. ఈ చిత్రంతో రాబీ వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ‘హ్యారీ పోటర్’ సిరీస్‌కు ముందు ‘క్రాకర్’ అనే టీవీ సిరీస్‌తో గుర్తింపు సాధించారు. 1990లో వచ్చిన ఈ సిరీస్‌లో హార్డ్ బీటెన్ డిటెక్టివ్‌గా నటించి పాపులారిటీ తెచ్చుకున్నారు. అనంతరం ‘జేమ్స్ బాండ్’ సిరీస్‌లోని రెండు మూవీల్లోనూ తనదైన విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నారు. రాబీ వరుసగా మూడు సార్లు ఉత్తమ నటుడిగా బాఫ్తా టీవీ పురస్కారాలను గెలుచుకున్నారు. రాబీ చివరగా ‘రిటర్న్ టు హాగ్వార్ట్స్’ వార్షికోత్సవంలో కనిపించారు.
‘హ్యారీ పోటర్’ సిరీస్ సినిమాలతో రాబీ కోల్ట్రేన్ ఇమేజ్ మరింతగా పెరిగింది. ‘హ్యారీ పోటర్’ సినిమాను చిన్నపిల్లలు ఎంతగా ఇష్టపడతారో తెలిసిందే. మంత్రదండంతో హీరో చేసే విన్యాసాలు అందర్నీ అబ్బురపరుస్తుంటాయి. ఈ సిరీస్‌లోని కొన్ని పాత్రలు ఆడియెన్స్‌పై తమదైన ముద్ర వేస్తాయి. అలాంటి క్యారెక్టర్లలో రాబీ పోషించిన హ్యాగ్రిడ్ ఒకటి. ఈ రోల్‌కు తనవంతు న్యాయం చేసిన రాబీ మృతితో హాలీవుడ్‌లో విషాదం నెలకొంది. రాబీ కోల్ట్రెన్‌కు ఆయన సోదరి అన్నీ రే, మాజీ భార్య రోనా గెమ్మెల్, పిల్లలు స్పెన్సర్, ఆలిస్‌లు ఉన్నారు.
Read more: మహేష్ బాబు (Mahesh Babu)తో రాజమౌళి (rajamouli ss) మూవీ.. విలన్‌గా కోలీవుడ్ హీరో కార్తి (Karthi)?