సాహిత్యంపై ఏడిద నాగేశ్వరరావుకు (Edida Nageswara Rao) మక్కువ ఎక్కువ

Updated on Apr 24, 2022 04:35 PM IST
సాహిత్యంపై ఏడిద నాగేశ్వరరావుకు (Edida Nageswara Rao) మక్కువ ఎక్కువ
సాహిత్యంపై ఏడిద నాగేశ్వరరావుకు (Edida Nageswara Rao) మక్కువ ఎక్కువ

ఏడిద నాగేశ్వరరావు సినిమా తీస్తున్నారంటే అందులో సాహిత్యం, బాణీలు, మ్యూజిక్‌కు ప్రాధాన్యం ఉంటుందని ప్రేక్షకులు అనుకునేవారు. ఫలితం ఎలా ఉంటుందనే దాని గురించి ఆలోచించకుండా అభిరుచికి తగ్గ సినిమాలు చేయడంలో ఏడిద నాగేశ్వరరావు (Edida Nageswara Rao) ముందుండేవారు. పూర్ణోదయ సంస్థను ఏర్పాటు చేసి దానిపై పలు విజయవంతమైన సినిమాలు తీసిన ఘనట ఆయనకే దక్కుతుంది. కేవలం నిర్మాతగానే కాదు నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్​గా కూడా ఏడిద (Edida Nageswara Rao) సక్సెస్ అయ్యారు. 30కు పైగా సినిమాల్లో నటించారు. 100కు పైగా సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారాయన.

నేరము–శిక్ష, చిన్ననాటి స్నేహితులు సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే దర్శకుడు కె.విశ్వనాథ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే విశ్వనాథ్‌తో సినిమాలు, వాటిలో కళాత్మక విలువల గురించి చర్చించుకునేవారు. ఈ క్రమంలోనే విశ్వనాథ్‌ దగ్గర సంగీత సాహిత్యాలతో మిళితమైన మంచి కథ ఉందని తెలుసుకున్నారు ఏడిద నాగేశ్వరరావు (Edida Nageswara Rao). ఆ కథను ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అని విశ్వనాథ్‌ కూడా సందేహం వ్యక్తం చేశారు. తీస్తే అటువంటి సినిమానే తియ్యాలని అనుకున్నారు ఏడిద.  

కె.విశ్వనాధ్‌ దర్శకత్వంలో పూర్ణోదయ సంస్థపై ఏడిద నాగేశ్వరరావు (Edida Nageswara Rao) తీసిన ‘శంకరాభరణం’ సినిమా తెలుగులో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. అయితే ఆ సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఎంత కష్టపడ్డారనేది చాలామందికి తెలియని విషయం. డిస్ట్రిబ్యూటర్లకు పలు షోలు వేసి చూపించినా రిలీజ్‌కు వారు అంతగా ఆసక్తి చూపించలేదు. 1979లోనే ‘శంకరాభరణం’ షూటింగ్‌ పూర్తయినా 1980 ఫిబ్రవరి 2వ తేదీన సినిమా రిలీజ్ అయ్యింది అంటే దానిని విడుదల చేయడానికి నిర్మాతలు ఎంతగా కష్టపడ్డారో అర్ధమవుతుంది.

సినిమా రిలీజైనా థియేటర్లలో రోజుకు ఒక్క షో మాత్రమే వేసేవారు. వారం రోజుల తర్వాత ఆ నోటా ఈ నోటా సినిమా చూసిన వాళ్లు బాగుందని చెప్పడంతో ‘శంకరాభరణం’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటినుంచి అన్ని షోలు ప్రదర్శించే వారు. ఆ రోజుల్లోనే 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది ‘శంకరాభరణం’. తెలుగులోనే కాకుండా కన్నడం, తమిళం, మలయాళ భాషల్లోనూ సినిమా విజయకేతనం ఎగురవేసింది. ఎన్టీఆర్‌‌ వంటి హీరో నటిస్తేనే కోటి రూపాయలు వసూలు చేసే రోజుల్లో అంతగా ఎవరికీ తెలియని వారితో తెరకెక్కించిన ‘శంకరాభరణం’ అన్ని భాషల్లోనూ కలిపి కోటి రూపాయలు రాబట్టింది.

ఈ సినిమాతో ఏడిద నాగేశ్వరరావును (Edida Nageswara Rao) అందరూ ‘శంకరాభరణం’ నిర్మాత అని పిలిచేవారు. అంతకుముందు ఆ తర్వాత కూడా పూర్ణోదయ సంస్థపై ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. వీటిలో కొన్నింటికి తాడి రామకృష్ణ, హరిబాబు, బాబ్జీ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. భారతీరాజా దర్శకత్వంలో ఇళయరాజా సంగీత సారధ్యంలో ఏడిద నాగేశ్వరరావు (Edida Nageswara Rao) తీసిన ‘సీతాకోకచిలుక’ మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది.

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఏడిద నాగేశ్వరరావు సొంత ఊరు. 1934 ఏప్రిల్‌ 24న జన్మించిన ఏడిదకు చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఇష్టం. ఈ క్రమంలోనే వీబీ రాజేంద్రప్రసాద్‌తో స్నేహం కుదిరింది. చదువయ్యాకా మద్రాసు వెళ్లిన రాజేంద్రప్రసాద్.. ‘అన్నపూర్ణ’ అనే సినిమా నిర్మించారు. అందులో వేషం కోసం ప్రయత్నించిన ఏడిద.. అది కుదరకపోవడంతో మద్రాసుకే అలవాటుపడ్డారు. నటుడిగా స్ధిరపడాలనే తపనతో వేషాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టారు. 2015 అక్టోబర్‌‌ 4న కన్నుమూశారు. ఏడిద నాగేశ్వరరావు జయంతి ఈరోజు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!