క్రమశిక్షణకు మారుపేరు ‘బాపయ్య’ (Bapayya)
సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నా, ఎదగాలన్నా క్రమశిక్షణ అనేది తప్పనిసరి. హీరో, హీరోయిన్, దర్శకుడి దగ్గర నుంచి లైట్ బాయ్ వరకు అందరికీ ఇది వర్తిస్తుంది. అదే పంథాలో నిలబడి చాలా మంది సక్సెస్ అయ్యారు. ఆ కోవలోకి చెందిన వారే కె.బాపయ్య (Bapayya). ఆయన ఎంత క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నించే వారనే విషయం తెలియాలంటే షూటింగ్‌కు ఆయన వేసుకుని వచ్చే బట్టలను చూసి చెప్పేయచ్చు. క్రమశిక్షణకు మారుపేరైన ఖాకీ యూనిఫామ్ వేసుకుని షూటింగ్‌లకు వచ్చేవారు బాపయ్య (Bapayya). ఈరోజు బాపయ్య పుట్టినరోజు.
1937 ఏప్రిల్ 24న పుట్టిన బాపయ్యకు చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయిన కేఎస్ ప్రకాశరావుకు అన్నయ్య కుమారుడే బాపయ్య. చిన్నతనంలోనే కన్నవారిని కోల్పోయిన బాపయ్యను కొడుకులు కె.రాఘవేంద్రారావు, కృష్ణమోహనరావు, కేఎస్ ప్రకాశ్‌లతో సమానంగా చూసుకున్నారు ప్రకాశరావు. కేఎస్ ప్రకాశరావు, కె.రాఘవేంద్రరావు వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
సురేష్ ప్రొడక్షన్స్‌లో పనిచేస్తున్న సమయంలోనే ఆయన క్రమశిక్షణను గమనించిన రామానాయుడు బాపయ్య (Bapayya)కు డైరెక్టర్‌గా చాన్స్ ఇచ్చారు. జగ్గయ్య హీరోగా ద్రోహి’ అనే సినిమా తీశారు. అయితే అది ప్రేక్షకులను అంతగా అలరించలేదు. కానీ, దర్శకుడిగా బాపయ్యకు (Bapayya) మంచి పేరు వచ్చింది.
‘ద్రోహి’ సినిమా ప్లాప్ కావడంతో మూడేండ్లు బాపయ్య (Bapayya)కు దర్శకుడిగా అవకాశం రాలేదు. ఆ తర్వాత కృష్ణంరాజు హీరోగా ‘మేమూ మనుషులమే’ అనే సినిమా తీసే చాన్స్ వచ్చినా.. అది కూడా హిట్ టాక్ దక్కించుకోలేకపోయింది. తర్వాత ఊర్వశి శారదతో ‘ఊర్వశి’ అనే సినిమా తీసినా అది కూడా ప్రేక్షకులకు దగ్గర కాలేదు. అందులో హిందీలో అప్పటి టాప్ నటుడు సంజీవ్ కుమార్ మంచి క్యారెక్టర్ చేయించినా ఫలితం దక్కలేదు. అయితే, ‘ఊర్వశి’ సినిమాలో పాటల చిత్రీకరణ, దర్శకత్వం తదితర విభాగాల్లో బాపయ్య (Bapayya)కు మంచి పేరే వచ్చింది.
సరిగ్గా అప్పుడే నందమూరి తారక రామారావు హీరోగా ‘ఎదురు లేని మనిషి’ సినిమా చేసే అవకాశం దక్కింది. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ను కొత్తగా చూపించిన బాపయ్య (Bapayya), ఆయనతో రంగురంగుల బట్టలు వేయించి, పాటల్లో కొంత రొమాంటిక్ సీన్స్ జోడించారు. దీంతో ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. సినిమా మొదటి వారం వసూళ్లు చూసి సినీ వర్గాలే ఆశ్చర్యపోయాయి.
ఎదురు లేని మనిషి సినిమా రిలీజైన వారం రోజులకే అంటే డిసెంబర్ 19న ‘సోగ్గాడు’ సినిమా రిలీజై భారీ విజయం సాధించింది. ఆ తరువాత హిందీలోనూ సినిమాలు చేసిన బాపయ్య (Bapayya) సక్సెస్ అయ్యారు. హ్యాపీ బర్‌డే బాపయ్య...