R. Madhavan: ఆర్. మాధవన్ నటించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ చిత్రంపై సీబీఐ అధికారుల ప్రశంసలు..!
కోలీవుడ్ నటుడు ఆర్. మాధవన్ (R. Madhavan) స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ . ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందింది. పొరుగు దేశం పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆయన ఆ తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చారు. కాగా, జులై 1న ఈ సినిమా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాపై (Rocketry: The Nambi Effect) సీబీఐ అధికారులు తాజాగా ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం చాలా అద్భుతంగా, ఆకర్షణీయంగా, వినోదాత్మకంగా ఉందని కొనియాడారు. సైన్స్, టెక్నాలజీ, ఎమోషన్ మేళవింపుతో అద్భుతంగా ఉందని సీబీఐ మాజీ ఇన్స్‌పెక్టర్ జనరల్ పి.ఎం.నాయర్ ప్రశంసించారు. నంబి నారాయణన్‌లా ఇస్రో అభివృద్ధి కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన వేలాదిమంది శాస్త్రవేత్తలకు ఈ సినిమా అంకితమని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖల కార్యదర్శి అపూర్వ చంద్ర పేర్కొన్నారు.
అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా మాధవన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్స్ మిషన్ పూర్తి చేసేందుకు అంతరిక్షంలోకి రాకెట్ పంపడానికి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO)కు పంచాగం (హిందూ క్యాలెండర్) తోడ్పడిందని మాధవన్ వ్యాఖ్యానించాడు. అంతే.. నెటిజన్లు మాధవన్‌ను ఏకిపారేస్తున్నారు. మాధవన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాధవన్ పై భారీగా ట్రోలింగ్ చేస్తున్నారు.