దసరా, దీపావళి పండుగలకు టాలీవుడ్ (Tollywood)లో పెద్ద సినిమాలు సందడి చేశాయి. దసరా పండుగకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గాడ్‌ఫాదర్, కింగ్ నాగార్జున (Nagarjuna) ది ఘోస్ట్ సినిమాలు విడుదలయ్యాయి. ఇక, దీపావళి సందర్భంగా మంచు విష్ణు (Vishnu Manchu) జిన్నా, విశ్వక్‌సేన్ (Vishwak Sen) ఓరి దేవుడా సినిమాలతోపాటు డబ్బింగ్ సినిమాలైన కాంతార, ప్రిన్స్, సర్దార్ చిత్రాలు విడుదలై ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి.
ప్రస్తుతం పండుగల హడావిడి ముగిసింది. స్టార్ హీరోల సినిమాలన్నీ ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. క్రిస్‌మస్ వచ్చే వరకు సెలవుల ప్రస్తావన లేదు. ఈ సమయంలో కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. వీటిలో చాలా సినిమాల్లో హీరోహీరోయిన్లుగా చిన్న యాక్టర్లే నటిస్తున్నారు. అయితే కీలకపాత్రల్లో పలువురు స్టార్ నటులు యాక్ట్ చేస్తున్నారు. ఈ చిన్న సినిమాలతోపాటు సినీ ప్రేమికులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమా కూడా విడుదల కానుంది. ఆ సినిమాలు ఏమిటి? ఎప్పుడు విడుదల కానున్నాయి అనే విషయాలపై ఒక లుక్కేద్దాం!
ఈ శుక్రవారం..
ఒకప్పటి కామెడీ హీరో, సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటించిన ‘అనుకోని ప్రయాణం’ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ప్రేమ, నరసింహరాజు, రవిబాబు, శుభలేఖ సుధాకర్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలోపాటు నిన్నే చూస్తూ, రుద్రవీణ, ఫోకస్, వెల్ కమ్ టు తీహార్ కాలేజ్ సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.
నవంబర్ నెలలో!
నవంబర్ నెలలో చిన్న సినిమాలతోపాటు స్టార్ డమ్ ఉన్న యాక్టర్ల సినిమాలు కూడా విడుదల కానున్నాయి. నవంబర్ నెల మొదటి శుక్రవారం థియేటర్లలో పలు సినిమాలు సందడి చేయనున్నాయి. నవంబర్ 4వ తేదీన అల్లు శిరీష్ (Allu Sirish) హీరోగా తెరకెక్కిన ‘ఊర్వశివో.. రాక్షసివో’ సినిమా రిలీజ్ అవుతోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించారు. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులకు బాగానే చేరువయ్యాయి. దీంతో ‘ఊర్వశివో.. రాక్షసివో’ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ కూడా..
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ (Like, Share and Subscribe) మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలకపాత్రలు పోషించారు. కామెడీ, సస్పెన్స్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ సినిమా నవంబర్ 4వ తేదీన విడుదల కానుంది. ఇవి కాకుండా మరో మూడు చిన్న సినిమాలు కూడా నవంబర్ 4వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
సమంత ‘యశోద’
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన ‘యశోద’ సినిమా కూడా నవంబర్ నెలలోనే విడుదల కానుంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు హరి శంకర్ – హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించారు. సమంత ముఖ్యపాత్రలో నటిస్తున్న యశోద సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, ఉన్ని ముకుందన్ కీలకపాత్రలు పోషించారు. నవంబర్ 11వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన యశోద (Yashoda) ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు మేకర్స్.
‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’
కామెడీ హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లరి నరేష్ (Allari Naresh).. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సీరియస్ సినిమాల హీరోగా మారారు. నాంది సినిమాలో సీరియస్ క్యారెక్టర్ చేసి ప్రేక్షకులను మెప్పించిన నరేష్.. మరోసారి సీరియస్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అల్లరి నరేష్ కెరీర్‌లో 59వ చిత్రంగా రాబోతోంది ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఈ సినిమాలో నరేష్‌కు జోడీగా ఆనంది నటించారు. వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర కీలకపాత్రలు పోషించారు. హాస్య మూవీస్ – జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా కూడా నవంబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
సుధీర్‌బాబు ‘హంట్’..
నిట్రో స్టార్ సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా నటించిన కొత్త సినిమా ‘హంట్’. పూర్తి స్థాయి యాక్షన్ కథాంశంతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాతో మహేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవల విడుదలైన హంట్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పోలీసాఫీసర్ క్యారెక్టర్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు సుధీర్‌బాబు. హంట్ సినిమాపై ఆసక్తిని పెంచేలా టీజర్ ఉంది. ఈ సినిమా కూడా నవంబర్‌లోనే విడుదల కాబోతోందని తెలుస్తోంది. సినిమాలు చిన్నవా, పెద్దవా అనే తేడాను పక్కన పెడితే నవంబర్ నెలలో విడుదలవుతున్న సినిమాల్లో బాక్సాఫీస్ దగ్గర ఏ చిత్రాలు సందడి చేస్తాయో చూడాలి మరి.
Read More : Tollywood Sequels : టాలీవుడ్‌లో సీక్వెల్స్‌గా వచ్చిన సినిమాలు ఇవే.. త్వరలో మరిన్ని మీకోసం రెడీ !
Follow Us